సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు.. విచారణకు రావాలని పోలీసులు ఆదేశాలు

వైసీపీ నేతలను విచారణ నోటీసులు వెంటాడుతున్నాయి. లుక్‌అవుట్‌ నోటీసులతో మంగళవారం అడ్డుకున్న సజ్జలను, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులిచ్చారు.

Update: 2024-10-16 07:49 GMT

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నాయకుడు, జగన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం గురువారం ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

2021, అక్టోబరు 19న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. అంతకు ముందు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ నాటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నాటి సీఎం జగన్‌ను బోస్‌డీకే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్‌సీపీ శ్రేణులు ఒక్క సారిగా బగ్గుమన్నాయి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. వందలాదిగా చేరుకున్న వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో వైఎస్‌సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయం అద్దాలతో పాటు ఫర్నచర్‌ను ధ్వసం చేశారు. బయట ఉన్న కార్లపైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ నేత దొరబాబుతో పాటు మరో ముగ్గురు టీటీడీపీ కార్యాలయ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపైనే కాకుండా కొంత మంది నాయకులపైన కూడా కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడుగా అరోపణలు ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకుడు పానుగంటి చైతన్య రెండు రోజుల క్రితమే కోర్టులో లోంగి పోయాడు. ఇదే కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌లను కూడా ఈ కేసులో చేర్చారు. వీరిని ఎలాగైనా అరెస్టు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తమకు ఎలాంటి సంబంధం లేక పోయినా తమ పేర్లను ఈ కేసులో చేర్చారని పలుమార్లు మీడియాతో, పోలీసులతో వీరు చెప్పుకున్నారు. ఈ కేసులో నందిగం సురేష్‌ను ఇది వరకే పోలీసులు అరెస్టు కూడా చేశారు. 14 రోజులు రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ తీసుకున్నారు.
అయితే బెయిల్‌పై ఉన్నప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశాలివ్వడం తాజాగా చర్చగా మారింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇది వరకే లుక్అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. బాలివుడ్‌ నటి కాదంబరీ జెత్వానీ కేసులో సజ్జలకు ఈ నోటీసులు ఇచ్చారు. సజ్జల విదేశాలకు పోయి వస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు బయటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకుండా ఆపేశారు. తాను విదేశాల నుంచి తిరిగి వచ్చానని, హైదరాబాద్‌లోనే ఉంటానని నచ్చజెప్పడంతో వదిలేశారు. ఇక మీదట ఎప్పుడైనా విదేశాలకు వెళ్లాల్సి వస్తే లుక్అవుట్‌ నోటీసుల వల్ల సజ్జలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఏ కేసులోనైనా లుక్అవుట్‌ నోటీసులు జారీ అయితే ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు తెలియకుండా విదేశాలకు వెళ్లే అవకాశం లేదు.
ఇప్పటి వరకు సజ్జల మీద రెండు కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం పార్టీ దాడి కేసుతో పాటు సినీ నటి జెత్వానీని వేధింపులకు గురి చేసిన కేసులు సజ్జలను వెంటాడుతున్నాయి. ఏ కేసులోనానై సజ్జలను అరెస్టు చేయొచ్చనే చర్చ సాగుతోంది.
Tags:    

Similar News