ప్రజలకు సాయం అందించడంలో అధికారులు విఫలం

బుడమేరు, కృష్ణా రివర్ వల్ల వచ్చిన వరద ఉధృతికి విజయవాడ పట్టణంలోని పలు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు ఇంకా నీటిలోనే విలవిల్లాడుతున్నారు.

Update: 2024-09-02 09:52 GMT

బుడమేరు, కృష్ణా రివర్ వల్ల వచ్చిన వరద ఉధృతికి విజయవాడ పట్టణంలోని పలు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు ఇంకా నీటిలోనే విలవిల్లాడుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలు ఉన్న ప్రదేశాల్లో మొదటి ఫ్లోర్ లో ఉండేవాళ్లు పై ఫ్లోర్లలో తల దాచుకుంటున్నారు. ప్రధానంగా కృష్ణలంక, రాణి గారి తోట, బాలాజీ నగర్, స్క్రూ బ్రిడ్జి, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు వంటి ప్రాంతాలు నడుముల లోతు నీటితో నిండిపోయాయి. చాలామంది ప్రజల సామాన్లు నెత్తిన పెట్టుకొని రోడ్డుపైకి మోసుకెళ్తూ కనిపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. నేతలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తుండడం వల్ల అధికారులంతా వారి చుట్టే ఉన్నారు. దీంతో ప్రజలకు భోజన పాకెట్లు కానీ, పాలు, నిత్యవసర వస్తువులు కానీ అందే పరిస్థితి లేకుండా పోయింది. దీనిని నివారించేందుకు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు సరైన చర్యలు తీసుకోలేదు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కనిపించకుండా పోయారు.

కృష్ణలంకలోని పోలీస్ కాలనీ, బాలాజీ నగర్, పూర్ణచంద్ర నగర్ కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్ భవనాలన్నీ మునిగిపోయాయి. ఎంతో మంది ప్రజలకు సంబంధించిన వస్తువులు నీట మునిగాయి. వీరికి తోడ్పాటునందించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వరద ఉధృతి కొనసాగుతూ కృష్ణా నది లోపలి భాగము నుంచి వరద నీరు కాలనీలోకి చేరింది. ప్రజలకు కనీస సౌకర్యాలైన పాలు, ఇతర నిత్యావసర వస్తువులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందలేదు. కొందరు ట్రాక్టర్లలో వచ్చి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోతున్నారు తప్ప ఇక్కడి ప్రజలను పునరావాస సెంటర్లకు తరలించడం కానీ, వెళ్లి అన్నం అందించడం కానీ చేయడం లేదు. దీంతో ఉదయం నుంచి అన్నం లేకుండా చాలా కుటుంబాలు ఉన్నాయి.

బుడమేరు, కృష్ణానది వల్ల దాదాపు 75% విజయవాడ పట్టణం మనకకు గురైంది. భవానిపురం, విద్యాధరపురం, చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, జక్కంపూడి కాలనీ, వైయస్సార్ కాలనీ, అజిత్ సింగ్ నగర్ వంటి కాలనీలు బుడమేరు వరదకు మునిగిపోయాయి. శుక్ర శనివారాలు నగరంలో వర్షం కురిసింది. ఆది, సోమవారాల్లో విజయవాడ నగరంలో వర్షం లేదు. అయినా వరద నీరు ముంచెత్తుతోంది. రెండు రోజులుగా వర్షం లేకపోయినా వరద నీరు కాలనీల వైపు రాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. నీరు చేరిన తరువాత ఆ నీటిని నది వైపు కానీ.. నగరం బయటికి కానీ పంపించడం అధికారులకు సాధ్యం కాలేదు. వాస్తవంగా నది ఉధృతంగా ఉండడం వల్ల వరద నీటిని నగరంలో నుంచి బయటికి పంపించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ఉంటే నగరంలోకి నీరు ప్రవేశించకుండా ఆగిపోయే అవకాశం ఉంది. అయినా అధికారులు విజయవాడలోని వరద సహాయ కార్యక్రమాల్లో ఘోరంగా విఫలమయ్యారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రిటర్నింగ్ వాల్ రంధ్రాలు పూడ్చి ఉంటే కృష్ణలంక మునిగేది కాదు

రిటర్నింగ్ వాల్ నిర్మాణ సమయంలో కాలనీలలో ఉన్న వర్షపు నీటిని నదిలోకి వెళ్లే విధంగా రిటర్నింగ్ వాల్ కు ఇంజనీర్లు రంద్రాలు పెట్టించారు. ఆ రంధ్రాలు పూడ్చకపోవడం వల్ల నది ఉధృతి పెరిగి వాల్ రంధ్రాలలో నుంచి వరద నీరు కృష్ణలంకలోని కాలనీలను ముంచెత్తింది. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని కాలనీలవాసులు వాపోతున్నారు. రెండు రోజుల ముందు వర్షాలు లేనందున ఆ రంద్రాలు పూడ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని బాధితులు చెబుతున్నారు.

Tags:    

Similar News