ఆగని ఆపరేషన్ ప్రకాశం బ్యారేజ్.. ఉగ్రవాదులు బెటర్ అన్న హోంమంత్రి

వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీ ఢీకొట్టిన బోట్లను తొలగించడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వాటిని ఎలా తొలగించాలో అర్థంకాక అధికారులు జుట్టు పీక్కుంటున్నారు.

Update: 2024-09-17 08:37 GMT

వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీ ఢీకొట్టిన బోట్లను తొలగించడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వాటిని ఎలా తొలగించాలో అర్థంకాక అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. తోచిన మార్గాన్ని ఎంచుకుంటూ చకచకా బోట్లను తొలగించే పనులు చేస్తున్నారు. క్రేన్లతో పనికాకపోవడంతో, తాజాగా మళ్ళీ తాళ్లనే నమ్ముకున్నారు అధికారులు. బ్యారేజీ అడుగున ఇసుకలో కూరుకుపోయిన బోటును తొలగించడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఏడు రోజులుగా దశలవారీగా బోట్లను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా మంగళవారం బోట్ల తొలగింపుకు హెచ్ బ్లాక్ విధానాన్ని అమలు చేయనున్నారు. బోట్లను తొలగించడం రోజురోజుకు క్లిష్టమైన పనిగా మారుతోంది. తొలుత నీళ్లలో బోట్లు.. గిడ్డర్లలో ఇరుక్కుపోవడంతో క్రేన్లతో బోట్లను తొలగించడం కుదరలేదు. దీంతో బోట్లను కోసి తొలగించాలని అనుకున్న పని కూడా అనుకున్న ఫలితాలను ఇవ్వలేక పోయింది. ఎట్టకేలకు గిడ్డర్ల నుంచి బోట్లను తొలగించడంతో అడుగున ఇసుకలో ఇరుక్కున్న బోట్లు ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది.

ఆపరేషన్ హెచ్ బ్లాక్

సోమవారం ప్రకాశం బ్యారేని గుద్దుకున్న బోట్లలో నీట మునిగిన బోటు తేలడంతో పనులను మంగళవారానికి వాయిదా వేశారు అధికారులు. ఈరోజు పనులను పునఃప్రాంరభించిన అధికారులు హెచ్ బ్లాక్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఇందుకోసం 150 టన్నుల బరువు మోయగల రెండు ఇసుక పడవలను వినియోగించనున్నారు అధికారులు. 6 నుంచి 7 టన్నుల బరువు ఉండే హెచ్ బ్లాక్ సిద్ధమైంది. 10 పుల్లీలు, 10 చైన్ లింక్‌లతో మొత్తం 200 టన్నుల లోడ్ సామర్థ్యంతో చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఎలాగైనా నీట మునిగిన పడవను ఎలాగైనా ఇవాళే తొలగించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు హెచ్ బ్లాక్ విధానం చిట్టచివరి మార్గంగా వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నేపథ్యంలోనే పడవల అంశంపై హోం మంత్రి వంగలపుడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పని చేసింది ఎవరైనా వారికన్నా ఉగ్రవాలు నయమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక్కో బోటు బరువు 40 టన్నులు కాదు: అనిత

ప్రకాశం బ్యారేజీకి జరిగిన బోటు ప్రమాదాన్ని తాము రాజకీయ కుట్రగానే భావిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. బ్యారేజీని ఢీ కొట్టిన బోటు ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామని, కానీ అది ఒక్కొక్కటి 80 టన్నుల బరువు ఉందని ఆమె తెలిపారు. అటువంటి మూడు బోట్లు ఇనుప తాళ్లతో కలిపి కట్టి ఉన్నాయని, అంటే దాదాపు 240 టన్నుల బరువున్న బోట్లను బ్యారేజీని ఢీకొట్టేలా కావాలని విడిచిపెట్టడం అనేది సైకో తరహా అలోచనే అంటూ మండిపడ్డారు. ‘‘ఈ వ్యవహారంపై దర్యాపు వేగంగా జరుగుతోంది. కొందరు అతి తెలివిగా.. బోట్లు వాటంతట అవే కొట్టుకు రావా అని ప్రశ్నిస్తున్నారు. అలా ఎలా కొట్టుకు వస్తాయి. బోట్లను కవాలని లంగరుకు కట్టేయకుంటే వస్తాయి. వచ్చినా ఒక్కో బోటు వేరువేరుగా రావాలనే కాని.. అవే వాటిని ఒకదానితో ఒకటి ఇనుప తాళ్లతో కట్టుకుని వచ్చి బ్యారేజీని ఢీకొట్టాయా. వీళ్లు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరంగా ఉన్నారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వదిలి పెట్టే ప్రసక్తే లేదు

‘‘విజయవాడ ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు. అందుకే అతిపెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఒకవేళ ఈ బోట్లు వచ్చి బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టాయి. అలా కాకుండా పిల్లర్లను ఢీకొట్టి ఉంటే పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేది. ఘోరం చూసుండేవాళ్లం. కొందరు రాజకీయం పేరిట నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఏది ఏమైనా బోట్లు బయటకు తీసి తీరుతాం. దీని వెనక ఎవరున్నారో వాళ్లని కూడా బయటకు తీసి చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తాం. వీటి వెనక ఎవరున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ఈ ఘటనకు కారణం ఎవరైనా వారు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని హెచ్చరించారు.

ఎవరో తెలియని బోట్ల యజమానులు

ప్రకాశం బ్యారేజీని బోట్ల ఢీ కొట్టి ఇప్పటికి 17 రోజులు అవుతున్నాయి. బోట్లను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టి ఏడురోజులు అవుతున్నాయి. ఇప్పటి వరకు బోట్ల యజమానులు ఎవరు అన్నది మాత్రం తేలలేదు. అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూటమి మాత్రం ఈ బోట్ల ప్రమాదం వెనక వైసీపీ, మాజీ సీఎం జగన్ హస్తం ఉందని ఆరోపిస్తోంది. పక్కా ప్లాన్‌తోనే బోట్లను ఒకదానితో ఒకటి కట్టేసి బ్యారేజీని ఢీకొట్టేలా వైసీపీ చేసిందని టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతూ.. అసలు ఆ బోట్లు టీడీపీ నేతలవేనని ఆరోపిస్తోంది. ప్రజల దృష్టి ఆకర్షించడానికి, వైసీపీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి టీడీపీ నేతలే ఈ ప్రమాదాన్ని ప్లాన్ చేసిన చేశారని, ఇప్పుడు కూడా ప్లాన్ ప్రకారమే వైసీపీపై బురదజల్లుతున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. ఏది ఏమైనా అసలు ఏ బోట్లు ఎవరివి అన్న విషయం మాత్రం ఇప్పటికి కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. మరి ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

Tags:    

Similar News