విశాఖ గొంతెండగట్టి మాల్స్ కట్టడానికి మంచినీళ్లా?

విశాఖ వాటర్ వర్క్స్ అధికారుల అవినీతి. తాగునీటిని మాల్ నిర్మాణానికి తరలింపు. ఈ అవినీతి ఆధారాలతో బట్టబయలు చేసిన జనసేన కార్పొరేటర్.

Update: 2024-04-29 06:33 GMT

(శివరామ్)

రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖ. ఆ అక్కడి ప్రజలకు ఈ నిండు వేసవిలో తీవ్ర నీటి కష్టాలు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా తాగునీటి కోసం క్యూలు కడుతున్నారు. రోజూ రావాల్సిన మున్సిపల్ నీళ్లు.. రెండు , మూడు రోజులకు ఒకసారి వస్తున్నాయి. నీటి కోసం జీవీఎంసీ వాటర్ వర్క్స్ వద్దకు వెళ్లి చలానా కట్టినా నీరు నింపడం లేదు. ఇంత భయంకరమైన నీటి కొరత ఉందా అంటే అటువంటిదేమీ లేదు. కానీ ఈ కొరత ఎందుకు? దానికి కారణం ఏమిటని విచారిస్తే.. విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయి. ప్రజల తాగునీరుగా సరఫరా చేయాల్సిన రెండు లక్షల లీటర్ల మున్సిపల్ నీటిని పెద్దల అదేశంతో కైలాసపురం పోర్టు క్యార్టర్స్‌లో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ భవన నిర్మాణ పనులకు మళ్లించేస్తున్నారు. ఆ తతంగం నిబంధనలకు విరుద్ధంగా ఆరు నెలలుగా జరుగుతుందని తీరా బయటపడ్డాక అధికారులే అంగీకరిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లక్స్‌కు ఆనుకుని ఉన్న టీఎస్ఆర్ రిజర్వాయర్ నుంచి దర్జాగా రోజుకు రెండు లక్షలకుపైగా శుద్ధి చేసిన తాగునీరును మాల్ యాజమాన్యం దౌర్జన్యంగా తీసుకుపోతుంటే అడిగిన నాథుడే లేడు. లక్షలాది మంది నగర ప్రజలకు గొంతుఎండుతున్నా పట్టించుకోకుండా మాల్ యాజమాన్యానికి నీటిని పంపుతున్న వైనాన్ని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. దాంతో ఇప్పుడు జీవీఎంసీ పెద్దలు నాలుక్కరుచుకుని తప్పు జరిగిందని అంగీకరిస్తున్నారు.

నీరు ఇవ్వడం చట్ట విరుద్దం

విశాఖ నగరంలో పారిశ్రామిక అవసరాలకు, వాణిజ్య అవసరాలకు నీరు సరఫరా చేసేందుకు విస్కొ అనే ప్రత్యేక కంపెనీని జీవీఎంసీ నేతృత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హాయాంలోనే ఏర్పాటు చేశారు. పారిశ్రామిక , వాణిజ్య అవసరాలకు తగ్గట్టుగా బల్క్ వాటర్‌ను విస్కో నిర్ణయించిన ధరలకు సరఫరా చేస్తుంది. అయితే, నీటి కొరత ఉన్నప్పుడు మాత్రం తాగునీటికే ప్రాధాన్యత. అయితే, జీవీఎంసీ అందుకు విరుద్ధంగా శుద్ధి చేసిన తాగునీటిని ఇనార్బిట్ మాల్‌కు సరఫరా చేసింది. విస్కో ద్వారా శుద్ధి చేయని బల్క్ వాటర్‌ను మాత్రమే అమ్మాల్సి ఉండగా, లంచాలు తీసుకుని కొందరు అధికారులు శుద్ధి చేసిన తాగునీటిని స్లాబ్‌లు వేయడానికి, గోడలు తడపడానికి సరఫరా చేయడం ఎన్నికల సమయంలో విశాఖలో పెద్ద సమస్యగా మారింది.


ఆ అధికారి మౌఖిక ఆదేశంతోనే..

రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ కీలక అధికారి, అవినీతి ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లివచ్చిన ఓ అధికారి సిఫార్సులతో మేయర్ ఈ దారుణానికి ఒడికట్టారని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఆమె మౌఖిక ఆదేశాలకు డూడూ బసవన్నల మాదిరిగా తలలూపిన ఇక్కడి అధికారులు, పాలక వర్గ పెద్దలు రహస్యంగా ఆరు నెలలుగా కోట్ల లీటర్ల ప్రజల నీటిని మాల్ నిర్మాణం పనులకు తరలించేశారని.. ఇప్పటి వరకూ ఇలా అనధికారికంగా ఉచితంగా తరలించిన నీటి ఖరీదు కోట్లలోనే ఉంటుందని ఆయన విలేకరులతో అన్నారు. చలానా లేకుండా, డబ్బు వసూలు చేయకుండా ఉచితంగా ఇచ్చేస్తున్నారని, జీవీఎంసీ అధికారులు రోజుకు రెండు లక్షల లీటర్లను ఉచితంగా ప్రైవేటు సంస్ధకు పంపిణీ చేయడం వైసీపీ ప్రభుత్వ అరాచకానికి, నగర ప్రజలకు జీవీఎంసీ పాలక వర్గం చేస్తున్న అన్యాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. మాల్ యాజమాన్యం నిబంధనల మేరకు నీరు తెచ్చుకునేందుకు పైప్‌లైన్ వేసుకొని, అనుమతులు పొంది, డిపాజిట్ చెల్లించాలని ఇందుకు 70 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్న వారిని మేనేజ్ చేసిన మాల్ యాజమాన్యం అంత మేర మిగుల్చుకుందని ధ్వజమెత్తారు.

రోజుకు 30 వేల లీటర్లు తాగునీటికని ఇచ్చాం

రోజుకు 30 వేల లీటర్ల తాగునీటి అవసరాల కోసమని అడిగితే ఇచ్చామని, అయితే మాల్ యాజమాన్యం అంతకంటే ఎక్కువ నీరు తీసుకొందని, ఆ విషయం తమకు ఇప్పుడే తెలిసిందని సంబంధిత వాటర్ వర్క్స్ ఈఈ అంగీకరించారు. ఆ మధ్య ఎక్కువ నీరు తీసుకువెళుతున్నారని తెలిసి ఆపితే దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారని ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని చెప్పారు. శుద్ధి చేసిన మంచి నీటిని భవన నిర్మాణ పనులకు వాడటం చట్ట విరుద్ధమని అంగీకరించారు.

Tags:    

Similar News