ఒక్కరోజులో అన్న క్యాంటీన్లు ఎంతమంది కడుపు నింపాయంటే..!

ప్రతి పేదవాడికి అతి తక్కువ ధరలోనే నాణ్యమైన పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్న క్యాంటీన్లు. వీటిని ఏపీలో సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు.

Update: 2024-08-17 08:40 GMT

ప్రతి పేదవాడికి అతి తక్కువ ధరలోనే నాణ్యమైన పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్న క్యాంటీన్లు. వీటిని ఏపీలో సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా గుడివాడలో తొలి అన్న క్యాంటీన్‌ను పునఃప్రాంరభించారు సీఎం. మరుసటి రోజు కూడా సాగిన ఈ పునఃప్రారంభ వేడుకల్లో మొత్తం 99 అన్న క్యాంటీన్లు తిరిగి తెచుకున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 100 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. పంద్రాగస్టు నుంచే పేదోడికి ఆహారం పెట్టడం కూడా ప్రారంభమైపోయింది. అన్న క్యాంటీన్లను ఏపీ సర్కార్ తన ఖాజానాతో కాకుండా విరాళాలతో నడుపుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు భారీగా విరాళాలు అందుతున్నాయి.

ఒక్కరోజులో ఎంతమందంటే..

రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు తిరిగి మొదలు కావడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల ఎంతో మంది ఆకలి బాధలను తీరుస్తున్నాయని, అతి తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించడం నిజంగా ఎంతో గొప్ప ఆలోచన అంటూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వచ్చిన అన్న క్యాంటీన్ల ద్వారా ఒక రోజుకు ఎంత మంది తమ ఆకలి మంటలను ఆర్పుకున్నారో తెలుసా? వారి సంఖ్య అక్షరాలా 93వేల మంది(మూడు పూటల కలుపుకుని). వీరిలో ఉదయం అల్పాహారం 32,500 మంది తినగా, మధ్నాహ్న భోజనం 37,500 మంది, రాత్రి భోజనం 23వేల మంది చేశారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

అన్న క్యాంటీన్లకు అయ్యే ఖర్చు ఇదే..

రాష్ట్రవ్యాప్తంగా పేదోడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునరుద్దరించింది. ఈ 100 క్యాంటీన్లలో లెక్కలను చూస్తే వీటిలో రోజూ సగటు 1.05 లక్షల పేట్ల భోజనం ప్రజలు చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వం రోజుకు రూ.78.75 లక్షలు రాయితీగా ఇస్తుంది. అంటే నెలకు రూ.19.68 కోట్లు, ఏడాదికి రూ.236.25 కోట్లు సబ్సిడీ అందిస్తోంది. ఇది రోజుకు లక్ష ప్లేట్ల లెక్క చొప్పున మాత్రమే.. ఈ ప్లేట్ల సంఖ్య పెరిగితే ఈ ఖర్చు కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రభుత్వం విరాళాలు సేకరిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కాగా.. వాటి దగ్గర ఎక్కువగా అల్పాహారం, మధ్యాహ్న భోజనాల సమయంలోనే ప్రజలు ఉంటున్నారని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రులు సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మరో 103 క్యాంటీన్లు రెడీ..

తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం కాగా రెండో విడతలో ప్రారంభం కావడానికి మరో 103 అన్న క్యాంటీన్లను సర్కార్ సిద్ధం చేస్తోంది. వీటిని వచ్చే నేలాఖరుకు ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వీటిలో కావాల్సిన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయిస్తున్నారు అధికారులు. ఇవి కూడా ప్రారంభం అయితే ప్రభుత్వం రాయితీ భారం మరింత పెరుగుతుంది. మొత్తం 203 క్యాంటీన్లలో రోజూ సగటున మూడు పూటలు కలుపుకుని 2.13 లక్షల మంది భుజిస్తారు. దీంతో రోజుకు రూ.1.59 కోట్లు, నెలకు రూ.39.96 కోట్లు, ఏడాదికి రూ.479 కోట్లు సబ్సిడీ భారం ప్రభుత్వంపై పడనుంది.

ఈ నేపథ్యంలోనే అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ మరో రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. దీని సహాయంతో ప్రతి ఒక్కరూ తమకు తోచినంత అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వవచ్చు. యూపీఐ, క్యూఆర్ ద్వారా ప్రజలు తమ విరాళాలు అందించేలా ప్రభుత్వం పనులు చేపడుతోంది.

Tags:    

Similar News