‘మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి’.. మాజీ మంత్రి కాకాణి

సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కాకాణి అన్నారు.

Update: 2024-08-26 11:21 GMT

సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కాకాణి అన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అవినీతి చేయడం మొదలు పెట్టేశారంటూ ఆరోపణలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం చంద్రమోహన్ రెడ్డి.. రూ.3 లక్షలు డిమాండ్ చేశారని బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారు.. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పినా.. సోమిరెడ్డి కనికరించలేదని ఆరోపించారు. పెంచలయ్యతో మేమే అలా చేయించామని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, కానీ తమకు పెంచలయ్యకు సంబంధం లేదని కాకాణి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. వాళ్లు మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మరి నేను పెంచలయ్యతో ఏమైనా ఫోన్ మాట్లాడేనేమో చూసుకోండి అంటూ కాకాణి తీవ్ర ఆరోపణలు చేశారు.

కేసులకు మేము భయపడం

‘‘సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన నిజాతీని నిరూపించుకోవాలి. పెంచలయ్య ఆరోపణలపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆయన వీడియోను ఫోర్వర్డ్ చేసినందుకు నన్ను ఏ2గా చేర్చారు. పోలీసులు పెట్టే కేసులకు మేము భయపడం. సోమిరెడ్డి అవినీతి చేసినా నోరు మెదపకూడదా.. సోమిరెడ్డిపై ఇతరులు చేసిన ఆరోపణలను ఫార్వర్డ్ చేయడం కూడా నేరమా. అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం.. అధికారం ఊడిన తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం సోమిరెడ్డి తత్వం. గతంలో అనేక ఉద్యోగాలను డబ్బులు తీసుకుని అంగటి సరుకుల్లా విక్రయించుకున్నారు. ఇప్పుడు ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు’’ అని ఆరోపించారు.

మామూళ్లు కూడా ముడుతున్నాయి..

సర్వేపల్లి నియోజకవర్గంలో లే-అవుట్ యజమానుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని కాకాణి ఆరోపించారు. ‘‘ఆ లే-అవుట్ యజమానులంతా నా బినామీలని గతంలో ప్రచారం చేశారు. ఆ లే-అవుట్‌లన్నీ ధ్వంసం చేశారు. ఇప్పుడు వారి దగ్గర నుంచే డబ్బులు తీసుకుని వారికే అనుమతులు ఇస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయలేక.. మా నోళ్లు మూయించాలని కేసులు పెట్టిస్తున్నారు. ఇలాంటి కేసులకే భయపడిపోతే రాజకీయాల్లో ఉండగలమా.. సోమిరెడ్డి చేసే అవినీతి పనులకు సంబంధించి అతి త్వరలోనే ఒక రికార్డు విడుదల చేస్తాం. కాంట్రాక్టర్లను బెదిరించి మామూళ్లు వసూలు చేయడం సోమిరెడ్డికి పరిపాటిగా మారింది. నేను చెప్పిన అంశాలపై దమ్ముంటే విచారణ చేపట్టాలి. అప్పుడు అసలు దోషి ఎవరో తేలిపోతుంది’’ అని కాకాణి గోవర్దన్ వెల్లడించారు.

Tags:    

Similar News