శివయ్య.. నీ ఆస్పత్రి ఇంత ఘోరంగా ఉందేటయ్యా..!?
కూర్చోడానికి కుర్చీ లేదు. ఓపి చీటీ కావాలంటే మొదటి అంతస్తుకు వెళ్లాలి. మరో సర్టిఫికేట్ కావాలంటే రెండో అంతస్తు వెళ్లాలి.;
కూర్చోడానికి కుర్చీ లేదు. ఓపి చీటీ కావాలంటే మొదటి అంతస్తుకు వెళ్లాలి. మరో సర్టిఫికేట్ కావాలంటే రెండో అంతస్తు వెళ్లాలి. కనీసం గర్భిణులకు కూడా సదుపాయాలు లేవు. వైద్యం చేయించుకోవాలంటే గంటల తరబడి నిలబడాల్సిందే. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీకాళహస్తి (Srikalahasti) లోని సిహెచ్సీ (community health centre) లో రోగుల సహనానికి పరీక్షగా మారింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో రోగల కష్టాలకు అంతులేకుండా పోయింది. ఆసుపత్రిలో గురువారం కనిపించిన దృశ్యాలు చెప్పే కథలు ఇవి.
ప్రభుత్వ ఆసుపత్రులంటేనే ప్రజల్లో తెలియని ఒక అసంతృప్తి ఉంటుంది. అక్కడ సరైన చికిత్స అందించరన్న భావన ఉంటుంది. అసలు తమను మనుషులుగానే చూడరని, ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తమను తాము ఆకాశం నుంచి ఊడిపడినట్లు ఊహించుకుంటారని ప్రతి సామాన్యుడు చెప్పే మాట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే సిబ్బంది, యాజమాన్యం తీరు కూడా దీనినే వాస్తవం చేసేలో నడుచుకుంటుంది. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి దీనిని అక్షర సత్యం చేస్తోంది. దవాఖానాకు వచ్చిన ప్రజలకు కూర్చునే వసతి కూడా కల్పించలేదు. గంటల తరబడి నిలబడే ఉండాల్సి రావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఆసుపత్రి సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. ఓపీ రాయించుకోవడానికే గంటల తరబడి నిలబడాల్సి వస్తుంటే లోపలికి వెళ్లిన తర్వాత వైద్యుడి దగ్గర చెకప్ చేయించుకోవడానికి మరోసారి బారులు తీరిన క్యూల్లో నిల్చోవాల్సి వస్తోందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగులు ఎన్ని అవస్తలు పడుతున్నా యాజమాన్యం మాత్రం చూడనట్లే ప్రవర్తిస్తోంది.
నేలే కుర్చీ..
గంటల తరబడి వేచి చూడటం సమస్య కాదని, ఆ సమయం అంతా కూడా నిల్చునే ఉండాలంటే కాళ్లు గుంజేస్తున్నాయని ఆసుపత్రికి వచ్చిన వారు వాపోతున్నారు. కనీసం గది బయట రోగులు కూర్చోవడం కోసం నామమాత్రానికి ఒక్క కుర్చీ కూడా లేదు. దీంతో గంటల సమయం వేచి చూసి చూసి కాళ్లు నిలబడివ్వనిక పోవడంతో నేలపైనే చతికిలబడుతున్నారు రోగులు. శ్రీకాళహస్తి ఆసుపత్రిలో తొలి అంతస్తులో ఉన్న ఓపీ విభాగం దగ్గరే కాకుండా, రెండో అంతస్తులో రూమ్ నెంబర్ 10(జనన, మరణాల నమోదు విభాగం) దగ్గర కూడా సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కనీలం చంకలో బిడ్డల్ని ఉంచుకుని వచ్చిన తల్లులకు కూడా కూర్చోవడానికి ఒక కుర్చి అనేది లేదు. అంతంత సమయం నిలబడి ఉండటంతో కాళ్లు నొప్పులు వచ్చేసి నేలపైనే కూర్చుంటున్నారు రోగులు. ఈ ఆసుపత్రిలోని ఈ దుస్తితి ప్రభుత్వ దవాఖానాల్లో రోగులకు, ప్రజలకు ఇచ్చే ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఇటువంటి అవస్థలు పడలేకనే చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రులవైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న వాదన బరింత బలపడుతోంది. ఇప్పటికైనా ఆ ఆసుపత్రిలోని పరిస్థితులపై యాజమాన్యం కానీ, అధికారులు కూడా ఏమైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.