తీవ్ర నడుము నొప్పి అన్నారు..తీర్థ యాత్రలకెళ్లారు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబుకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పిందంతా అబద్దమేనా?;

Update: 2025-02-12 09:14 GMT

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వ రథ సారథులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు మధ్య గ్యాప్‌ పెరిగిందా? సీఎం చంద్రబాబు ఫోన్‌ చేసినా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎందుకు అందుబాటులోకి రాలేదు? సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడలేదు? ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందా? తేడాలు రాకపోతే ఎందుకు మాట్లాడుకోరు? కూటమి వర్గాలను తొలిచేస్తున్న ప్రశ్నలు.

వైరల్‌ ఫీవర్, సివియర్‌ స్పాండలైటిస్‌తో ఇబ్బందులు పడుతున్నాను. రెస్టు తీసుకోమని డాక్టర్లు చెప్పారు. వైద్యుల సూచలన మేరకు విశ్రాంతి తీసుకుంటాను. అందువల్ల శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేనని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబుకు సందేశం పంపారు. అది జరిగిన నాలుగు రోజుల తర్వాత మంగళవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి కూడా పవన్‌ కల్యాణ్‌ హాజరు కాలేదు. ఈ సందర్భంగా జరిగిన పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ జోక్యం చేసుకొని వైరల్‌ జ్వరం, తీవ్రమైన నడుము నొప్పితో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బాధపడుతున్నారని.. అందుకే ఈ సమావేశానికి హాజరు కాలేక పోయారని.. రెండు, మూడు రోజుల్లో విధులకు హాజరవుతారని తెలిపారు. దీనిపైన సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని.. అయితే ఆయన దొరక లేదని.. ఇప్పుడెలా ఉన్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్‌ను అడిగారు. ఇప్పుడు కాస్త పర్వాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్‌ సీఎం చంద్రబాబుకు చెప్పారు. ఇది మంగళవారం జరిగింది.
ఇది జరిగి 24 గంటలు గడవక ముందే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీర్థ యాత్రలకు కేరళ, తమిళనాడు రాష్ట్ల్రాకు వెళ్లడం.. లడ్డూ ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా ధరించిన ప్రత్యేకమైన వస్త్రాలతో దేవాలయాల దర్శనాలతో బిజీ బిజీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. తీర్థ యాత్రలకు వెళ్లడం, దేవుళ్లను దర్శించుకోవడంలో ఎలాంటి ఇబ్బందుల్లేక పోయినా.. తీవ్ర అనారోగ్యంతో పవన్‌ కల్యాణ్‌ ఇబ్బందులు పడుతున్నారని.. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారని.. రెండు వారాలు తర్వాత వస్తారని సాక్షాత్తు సీఎం చంద్రబాబుకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పి 24 గంటలు గడవక ముందే పవన్‌ కల్యాణ్‌ తమిళనాడు, కేరళా టూర్‌లు చేస్తుండటంతో మంత్రి నాదెండ్ల మనోహర్‌ సీఎం చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యం గురించి చెప్పిన మాటలు ఒట్టి అబద్దాలేనా? కావాలనే చంద్రబాబును డైవర్ట్‌ చేసేందుకు అలా చెప్పారా? లేదా తీవ్రమైన నడుము నొప్పిని భరిస్తూనే టూర్‌లకు పవన్‌ కల్యాణ్‌ వెళ్లారా? లేదా కేంద్రంలోని బీజేపీ పెద్దల డైరక్షన్‌లో టూర్‌లు చేస్తున్నారా? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.
డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం తీర్థయాత్రలో ఉన్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు ఈ టూర్‌ చేయనున్నారు. కుమారుడు అకీరా, టీడీపీ బోర్డు సభ్యులు ఆనందసాయితో కలిసి కేరళ కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి దేవాలయన్నా దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత తిరువనంతపురంలోని పరశురామస్వామి దేవాలయన్ని దర్శించుకోనున్నారు. ఈ మూడు రోజుల్లో అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర, స్వామిమలైయ్, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్‌ కల్యాణ్‌ దర్శించుకోనున్నారు.
అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలంటే విజన్‌ ఉన్న నేత నారా చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడే ఏపీకి సీఎంగా ఉండాలని మహాశక్తి పీఠం మీద ఒట్టేసి పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఎన్నో సందర్భాల్లో సీఎం చంద్రబాబు విజన్‌ను, పాలనా తీరును పవన్‌ కల్యాణ్‌ మెచ్చుకున్నారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేస్తే.. మాట్లాడేందుకు పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ఆసక్తి చూపలేదు? తీవ్ర నడుము నొప్పిని చెప్పి తీర్థ యాత్రలకు ఎందుకు వెళ్లారు? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలను, కూటమి వర్గాలను తొలిచేస్తున్న ప్రశ్నలు.
Tags:    

Similar News