పవన్ కల్యాణ్ కోరుతున్న సనాతన ధర్మమేమిటీ? లెఫ్ట్ నుంచి రైట్ కి మారారా?

ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారు, వీరు వారవుతారనే సామెత ఇప్పుడు పవన్ కల్యాణ్ కి అతికినట్టు సరిపోతుందేమో. ఇంతకీ పవన్ కోరుతున్న సనాతన ధర్మం ఏమిటీ?

Update: 2024-09-21 08:59 GMT

ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారు, వీరు వారవుతారనే సామెత ఇప్పుడు పవన్ కల్యాణ్ కి అతికినట్టు సరిపోతుందేమో. ప్రముఖ సినీనటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుత రాజకీయాల్లో ఓ సంచలనం. ఆయన ఏది చేసినా వివాదమే. దానికో లెక్క ఉంటుంది. మొత్తం మీద ఆయన రూటే సెపరేటు. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర శాసనసభలో ఒక్క సీటూ లేకుండానే ఆనాటి అధికార పార్టీ వైసీపీకి టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి మోదీ మొదలు ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు- అందరికీ తల్లో నాలుకయ్యారు. రాజకీయమంతా తన చుట్టూతా తిప్పుకునే స్థాయికి ఎదిగారు. టీడీపీని ఎన్డీఏ దరి చేర్పించడం మొదలు ప్రస్తుతం బీజేపీని కేంద్రంలో నిలబెట్టేంత వరకు అంతా తానై రాజకీయం నడిపించారు. విప్లవకారుడి అవతారం నుంచి వీర భక్త సనాతునిగా మారిపోయారు. హిందూ ధర్మ పరిరక్షణలో పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీ వాళ్లను మించిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇందుకు ఆయన సెప్టెంబర్ 20న ఇచ్చిన ప్రకటనే రుజువు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. ఏమిటీ వైపరీత్యమనుకునే వారున్నా పవన్ కల్యాణ్ వామపక్షం నుంచి మితవాదపక్షం (లెఫ్ట్ టు రైట్) వైపు మళ్లి చాలాకాలమైంది.

లెఫ్ట్ నుంచి రైట్ వరకు...
ఓ సాదాసీదా కానిస్టేబుల్ కుమారుడుగా, కింది నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన మెగాస్టార్ తమ్మునిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ ఆవేశపరుడనే వ్యాఖ్యలూ లేకపోలేదు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినపుడు ఆయనో విప్లవకారుడు. అర్జెంటైనా మార్క్సిస్టు విప్లవకారుడు చేగువేరా తనకు ఆదర్శం అని ప్రకటించుకున్నారు. ఆ తర్వాత మన్యం విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు మార్గమే తన మార్గమన్నారు. తన సోదరుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత 2014 మార్చిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (జేఎస్పీ)ని స్థాపించారు. ఓట్లు, సీట్లు తనకు ముఖ్యం కాదని ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని ప్రకటించుకున్నారు. ఉత్తరాంధ్రలోని ఉద్దానంలో ప్రబలిన కిడ్నీ వ్యాధుల సమస్య సహా అనేక అంశాలపై విస్తృతంగా అధ్యయన చేయించారు. ప్రభుత్వాలను కదిలించారు. 2014 ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి-బిజెపి కూటమి విజయానికి ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని రైతుల సమస్యలపై గళం విప్పారు. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని 2019లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేశారు. ఒకసీటు గెలిచినా ఆ ఎమ్మెల్యే ఆనాటి అధికార పార్టీ వైసీపీలో కలిసిపోవడంతో ఆయనతో పాటు ఆయన పార్టీకి చట్టసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

తుదికంటా పోరాటమే తన ధ్యేయమని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పోరుకు పిలుపిచ్చి ముందుకు సాగారు. సినిమాలలో విలన్లపై విజయం సాధించడానికి ఎటువంటి పోరాటాలు చేస్తాడో అలాగే పవన్ కల్యాణ్ రాజకీయ వేదికలపైనా అదే ఆవేశం, ఆక్రోశంతో చెలరేగిపోయేవారు. ఈ 55 ఏళ్ల నటుడు రాజకీయవేత్తగా మారారు. పవన్ కళ్యాణ్ “పవర్ స్టార్” అని నిరూపించుకున్నారు. 2024 ఎన్నికల్లో తన జన సేన పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను 100 శాతం స్ట్రైకింగ్ రేటుతో చరిత్ర సృష్టించారు. పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఓ సంచలనం అయ్యారు.
పవన్ ప్రస్థానం నల్లేరుపై నడకేమీ కాదు...
సినిమా వేరు నిజజీవితం వేరు. రాజకీయాల్లో ఆయన నడకేమీ నల్లేరు పై బండిలాంటిది కాదు. 2014 మార్చి 14న రాష్ట్రం విడిపోయినపుడు ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆయన ఎక్కడికి వెళ్లినా వేలాది మంది యువతీ యువకులు కేరింతలు కొట్టేవారు. యువత ఉర్రూతలూగే ప్రసంగాలు చేసేవారు. తానొక వ్యక్తిగాదు శక్తినని పదేపదే చెప్పడంతో ఆయన వెనకేదో శక్తి ఉందన్న విశ్వాసం రాష్ట్రప్రజల్లో కలిగేలా చేశారు. అందువల్లనే ఏమో వైసీపీ నాయకత్వం ఆయన్ను టార్గెట్ చేసింది. "రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ ఓ బలమైన శక్తిగా ఎదుగుతాడని ముందుగా జగన్ నాయకత్వంలోని వైసీపీ గుర్తించింది. అందుకే ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. దాన్నే ఆయుధంగా మలుచుకున్న పవన్ కల్యాణ్ తన సామాజికవర్గమైన కాపుల అండతో 2024 ఎన్నికల్లో అజేయ శక్తిగా మారాడు" అని పవన్ కళ్యాణ్ సన్నిహితుడొకరు చెప్పారు.
జనసేన సిద్ధాంతమేమిటంటే...
జనసేన పార్టీని పెట్టినపుడు పవన్ కల్యాణ్ తన ప్రధాన లక్ష్యాలేమిటో స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరును, వ్యవస్థలలో అవినీతిని ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం జనసేన సిద్ధాంతాలుగా ప్రచారం చేశారు. భిన్న కులాలతో కలివిడిగా ఉండడం, మత వివక్ష లేని రాజకీయాలు, భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, తెలుగుప్రజల సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడడం, ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ వాదం, అవినీతిపై అలుపెరగని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించడం తన ధ్యేయాలుగా చెప్పుకొచ్చారు.
మధ్యేవాద మార్గాన్ని పాటిస్తా...
మనిషిలో మార్పు సహజం. 2014 నాటి పవన్ కల్యాణ్ కి 2019 నాటి పవన్ కల్యాణ్ కి చాలా తేడా ఉంది. విప్లవ సిద్ధాంతాల నుంచి ఆయన క్రమేణా మారుతూ వచ్చినట్టు ఆయన ప్రసంగాలు చెబుతాయి. తాను మధ్యేవాద మార్గాన్ని విశ్వసిస్తానని, అతివాద, మితవాద సిద్ధాంతాల మధ్య సమతుల్యత ఉండేలా చూస్తానని పవన్ కల్యాణ్ చెప్పేవారు.
దానికనుగుణంగా పవన్ కల్యాణ్ తానో సిద్ధాంతాన్ని సృష్టించుకున్నారు. "చాలా మందికి పవన్-ఇజం ఏమిటో అర్థం కాలేదంటుంటారు. వారికి నా సమాధానం ఒక్కటే. నా -ఇజం మానవతావాదం అని చెబుతాను." అంటారు పవన్ కల్యాణ్. సనాతన ధర్మాన్ని అనుసరిస్తానని అయితే ఇతర మతాలను కూడా గౌరవిస్తానని ఆమధ్య పవన్ కల్యాణ్ చెప్పారు.
ఇంతలో ఇంత మార్పు ఎలా సాధ్యం..

పవన్ కల్యాణ్ 2014 మార్చి14న హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో పార్టీని ప్రారంభించినపుడు ఆయన విప్లవపార్టీల అభిమాని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభజించిందని హైకమాండ్‌ని విమర్శించారు. పార్టీ రెండో బహిరంగ సభ విశాఖపట్నంలో మార్చి 27న నిర్వహించినపుడు పవన్ కళ్యాణ్ రాజు రవితేజతో కలిసి రచించిన ఇస్మ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.2014 ఎన్నికలలో పోటీ చేయని పవన్ కల్యాణ్ "కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో" నినాదంతో ముందుకు వెళ్లారు. తాను మద్దతిచ్చిన టీడీపీ, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక కేటగిరీ హోదా కోసం ఉద్యమించారు. 2016 సెప్టెంబరు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వడంలో జాప్యంపై బీజేపీ, టీడీపీని విమర్శించారు. రాష్ట్రానికి 'ప్రత్యేక ప్యాకేజీ' పాచిపోయిన లడ్డూలుగా ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేన పోటీ చేసిన 18 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేదు. 137 అసెంబ్లీ సీట్లలో రాజోలు నుంచి మాత్రమే గెలిచింది. తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వైసీపీ పంచన చేరారు.
జనసేనను పెట్టినపుడు తనది 15 ఏళ్ల ప్రణాళిక అని పవన్ కల్యాణ్ చెప్పారు. “రాజకీయాల్లో తానేమి చేయాలనుకుంటున్నానో స్పష్టత ఉంది. డబ్బు బలం లేకుండా ఎన్నికల్లో గెలిచి ప్రజలకు చూపించాలని కోరుకుంటున్నా. అందువల్ల గెలుపోటములను పట్టించుకోను” అని ఆనాడే పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టారు.
2019 పరాజయం తరువాత పవన్ కల్యాణ్ లో చాలా మార్పు వచ్చింది. “వైఎస్‌ఆర్‌సిపి హయాంలో ఏడాదిన్నరలో జగన్ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయడం లేదని కళ్యాణ్ గ్రహించారు. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా నిరోధించేందుకే ఆయన మళ్లీ ఎన్డీఏలో చేరారు’’ అని పార్టీ నేత బొలిసెట్టి సత్య అన్నారు.
"జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించండి" అనే నినాదంతో ఓటర్లను ఏకీకృతం చేయడానికి కళ్యాణ్ ప్రయత్నాలు ప్రారంభించారు. 2020 ప్రారంభం నుంచి టీడీపీతో ఓ పక్క మంతనాలు సాగిస్తూనే ఆంధ్రాలో బీజేపీతో కూడిన కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టి.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌ లో చంద్రబాబు అరెస్టుతో దాన్ని సక్సెస్ చేశారు. కమ్, కాపు వర్గాలతో పాటు ఇతర బీసీ వర్గాలను ఏకం చేసి- "జగన్ ను ఓడించకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదనే" మాటను నిజం చేశారు.
తనను తాను తగ్గించుకున్న వాడు...
కొందరు ఎంత ఎత్తు ఎదిగినా తగ్గే ఉంటారు. అది భారతీయ సమాజంలోనే ఉంది. పవన్ కల్యాణ్ కూడా ఆ మాదిరే తన పార్టీకి వచ్చిన సీట్లను తగ్గించుకుని వాటిని బీజేపీకి ఇచ్చి తాను పదేపదే చెప్పే "తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును" అనే బైబిల్ సూక్తిని పాటించారు. అప్పటికే విప్లవకారుల మాటలు మరుగున పడి భారతం, రామాయణం, భాగవతం లోని సూక్తుల్ని చెప్పడం ప్రారంభించారు. తన ప్రచార రథానికి వారాహి పేరు కూడా అందులో భాగమేనంటారు. విప్లవ స్ఫూర్తి నుంచి ఆధ్యాత్మికత వైపు విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఈ మొత్తం వెనుక బీజేపీ ప్రభావం ఉందేమోనని అందరూ అనుకున్నా "మనిషిలో వచ్చిన సహజ మార్పే అదని నా అభిప్రాయం. యుక్త వయసులో కమ్యూనిస్టు కాకపోయినా ఆ తర్వాత అయినా ఓ సమస్య ఉన్నట్టేనన్నది నానుడి కావొచ్చు కాని పవన్ కల్యాణ్ విషయంలో అది ముమ్మాటికీ నిజం" అన్నారు ఆయన్ను దగ్గరగా పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా వాసి అల్యూష్.
పవన్ కల్యాణ్ ఏ సనాతన ధర్మాన్ని కోరుతున్నారు?
అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ పూజలు, పునస్కారాలు ఎక్కువ అయ్యాయనే దానికి నిదర్శనమే ఇప్పుడు ఆయన ధరిస్తున్న వేషధారణ. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యతో ఆయన కలత చెందినట్టు కనిపించింది. కల్తీ నెయ్యికి సంబంధించి జగన్ ప్రభుత్వం నీయమించిన టీటీడీ ట్రస్ట్ బోర్డు సమాధానం చెప్పాలని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

అంతటితో ఆగకుండా ఇంకో అడుగు ముందుకు వేసి “మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా ఈ వ్యవహారాన్ని చర్చించాలి. 'సనాతన ధర్మాన్ని' కాపాడడానికి మనందరం కలిసి రావాలని నేను భావిస్తున్నాను' అని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీంతో ఆయన మరోసారి తెరపైకి వచ్చారు. ఇంతకీ ఆయన ఏ సనాతన ధర్మాన్ని కోరుతున్నారు? బీజేపీ వాళ్లు చెబుతున్నదా లేక హిందూ సనాతన ధర్మమా? అని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆరు నెల్లు సావాసం చేస్తే పాత్రలు తారుమారు కావడమంటే ఇదేనేమోనని రిటైర్డ్ టీచర్ శౌరయ్య చేసిన వ్యాఖ్య పవన్ కల్యాణ్ కి వర్తిస్తుందో లేదో మున్ముందు చూడాల్సి ఉంది.
Tags:    

Similar News