ఫుల్ జోష్‌లో పవన్ కల్యాణ్ : ఏపీ ప్రజలకు లేఖ
మోడల్ నియోజక వర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతా. ఓటేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు. అంటూ పవన్ కల్యాణ్ లేఖ.
Byline : The Federal
Update: 2024-05-16 15:30 GMT
మే 13 జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం, రికార్డు స్థాయిలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడం, ప్రత్యేకించి పిఠాపురంలో ఎన్నడు లేనంతగా పోలింగ్ పర్సెంటేజీ అమాంతంగా పెరగడంతో అది తమ ఎన్డీఏ కూటమికి కలిస్తొందని జనసేన అధినేత వపన్ కల్యాణ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆనందంతో తబ్బుబ్బి పోతున్న పవన్ కల్యాణ్ తన సంతోషాన్ని పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, పిఠాపురం వాసులకు లేఖ రాశారు.
లేఖలోని అంశాలు
సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మే 13 ఎన్నికల్లో భాగస్వామ్యం అయినందుకు ఏపీ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో మీరు చూపిన ప్రేమకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.86 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే రాజ్యాంగం కల్పించిన హక్కు వినియోగించుకున్నందుకు ఆనందం కలిగిందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ అభినందించారు. ఎన్నికల ప్రాముఖ్యతను వివరించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా, పౌర సంఘాలు కీలక పాత్ర పోషించిన పాత్రకు ధన్యవాదాలు తెలిపారు.
పిఠాపురం వాసులకు
పిఠాపురం వాసులపై వల్లమానిన అభిమానం చాటుకున్నారు. పిఠాపురంలో పోటీసిన తనను ఆదరించి, అండగా నిలచిన పిఠాపురం వాసులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో రికార్డు స్థాయిలో 86.3 శాతం ఓటింగ్ నమోదు కావడం అనేది పిఠాపురం వాసుల ప్రేమను తెలియజేస్తుందన్నారు. జనసైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు.
మోడల్ నియోజక వర్గంగా పిఠాపురం
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే తన సీటు త్యాగం చేసి తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎస్ వర్మకు, వారి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తాను పిఠాపురంలో పోటీ చేస్తున్నానని తెలియగానే సినిమాలు, దారా వాహికలకు గ్యాప్ ఇచ్చి, ప్రతి గడపకు వెళ్లి తన కోసం ప్రచారం చేసిన సినీ, బుల్లి తెర నటీ నటుల ప్రేమ తనను కదిలించిందన్నారు. తన విజయాన్ని కాంక్షిస్తూ అగ్ర నాయక నటుల నుంచి యువతరం నటుల వరకు మద్దతు ప్రకటించడం సంతోషాన్నిచ్చిందన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. విదేశాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, తరలి వచ్చి తనకు ఓటు వేసిన ఎన్‌ఆర్‌ఐలకు అభినందనలు తెలిపారు. పిఠాపురం నియోజక వర్గాన్ని మోడల్ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.