జన సైనికులారా శాంతించండి

బహిరంగ చర్చలు వద్దు. అనవసర వివాదాల జోలికి పోవద్దు. అంటూ జనసేన శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారు.;

Update: 2025-01-27 05:38 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ శ్రేణులకు హుకుం జారీ చేశారు. ఇది వరకు ఓ సారి ఎవ్వరూ స్పందిచొద్దని తన శ్రేణులకు ఆదేశాలు జారీ చేసిన పవన్‌ కల్యాణ్‌ రెండో సారి తనదైన శైలిలో ఆదేశాలు జారీ చేశారు. అయితే వీటి మీద ఆ పార్టీ శ్రేణుల్లో భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ నేతలు మాట్లాడుతున్నప్పుడు.. తామెలా మాట్లాడకుండా ఉంటామని, అలా మాట్లాడక పోతే జనసేన పార్టీకి విలువ ఏమి ఉంటుందనే అభిప్రాయాలు వారి అంతర్గత చర్చల్లో వ్యక్తం అతువున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ జారీ చేసిన ఆదేశాలు ఎంత మేరకు జనసేన శ్రేణులు ఫాలో అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.

సీఎం చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలనే అంశం ఇటీవల తెరపైకి వచ్చింది. లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీకి చెందిన ఓ పార్టీ నేత మాట్లాడిన మాటలు పెద్ద చర్చకు దారి తీసింది. ఇదే అంశంపై టీడీపీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు ప్రస్తావించడం మొదలు పెట్టారు. దీంతో లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలనే అంశం టోటల్‌గా టీడీపీ శ్రేణుల
డిమాండ్‌గా మారింది. దీనికి జనసేన పార్టీ శ్రేణులు ప్రతిస్పందించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో లోకేష్‌ ఉపముఖ్యమంత్రి అనే అంశంపై ఎవరూ మాట్లాడొద్దని జనసేన శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారు.
ఇలాంటి అనేక అంశాలపై క్షేత్ర స్థాయి కూటమి నేతలు, కార్యకర్తల్లో ఒక మాటపై లేక పోవడంతో భేదాభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అవి వివిధ రకాల చర్చలకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ మరో సారి జనసేన శ్రేణులకు హుకుం జారీ చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఏమని ఆదేశించారంటే..
అవనవసరమైన వివాదాల జోలికి పోవద్దని హెచ్చరించారు. అధికారం చేపట్టి ఏడు నెలల కాలంలో దాదాపు రూ. 3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్రాని వచ్చాయన్నా, మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షమాన్ని–అభివృద్ధిని సమపాళ్లల్లో ముందుకు తీసుకెళ్తున్నా సరే దానంతటికి కారణం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్‌ అందించాలనే దృఢ సంకల్పమే కారణం. ఇటువంటి పరిస్థితులలో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరమైన వివాదాల జోలికి పోవద్దు. అనవసరమైనా విభేదాల జోలికి పోవద్దు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దు. అంటూ జనసేన శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ హుకుం జారీ చేశారు.
Tags:    

Similar News