నేటి నుంచి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష.. వెల్లువెత్తుతున్న విమర్శలు..
టీటీడీ ప్రసాదం అపవిత్రం అయిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు. దీక్షతో లాభమేంటని వెల్లువెత్తుతున్న విమర్శలు.
టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అంశం దేశమంతటా సంచలనంగా మారింది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ప్రక్షాళన చర్యలను కూడా తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. శ్రీవారి లడ్డూ ప్రసాద పవిత్రను పునరుద్ధరించామంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలిపింది. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. గతంలో వినియోగించిన నెయ్యి, ప్రస్తుతం వినియోగిస్తున్న నెయ్యికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. దీంతో పాటుగానే గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యి కల్తీ అయిందని నిర్ధారించిన ల్యాబ్ రిపోర్ట్‌లను కూడా టీటీడీ షేర్ చేసుకుంది. శ్రీవారి ప్రసాద పవిత్ర విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్న తమ అంకితభావాన్ని, లడ్డూ నాణ్యత విషయంలో భక్తులకు ఒక క్లారిటీ ఇవ్వడానికి టీటీడీ ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్తుంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తాను ఈ దీక్షను 11 రోజుల పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ పాపం వారిదే..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి ఘోర అవమానం జరిగింది. తిరుమలలో అపచారం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పవన్ కల్యాణ్ వివరించారు. ‘‘అమృతతుల్యంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని గత పాలకులు తమ వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. వారి హయాంలో తిరుమల ప్రసాదం జంతు కొవ్వుతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఈ పాపానికి పాల్పడ్డారు. ఈ పాపాన్ని ఆదిలోనే కనిపెట్టకపోవడం హిందూ సమాజానికి కళంకం’’ అని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
ఏడుకొండలవాడా..! క్షమించు
— Pawan Kalyan (@PawanKalyan) September 21, 2024
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం…
అక్కడే దీక్ష చేపడితా..
‘‘లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది’’ అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
పవన్ ఏం చేస్తున్నారు..
పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన నేపథ్యంలో అనేక మంది ఆయనపై విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి.. చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. న్యాయం కోసం నిరసన చేయడంపై అనేక మంది ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆమె ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు కోట్ల మంది భక్తుల మనోభావాలను అవమానించేటటువంటి ఘటన తిరుమలలో జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్.. దీక్ష చేపట్టడం కూడా అంతే విడ్డూరంగా ఉందని పలువురు విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటి వరకు అధికారం లేదని, అధికారంలోకి వస్తే తప్పు జరిగితే అడ్డంగా నిలబడి బాధితులకు న్యాయం జరిపిస్తానంటూ చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్.. తీరా అధికారం వచ్చి.. డిప్యూటీ సీఎం కుర్చిలో కూర్చుని ఇప్పుడు న్యాయానికి బదులు దీక్ష ఎందుకు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
రెండూ ఒకటి కాదంటున్న జనసైనికులు..
కాగా పవన్ కల్యాణ్ దీక్షను.. మమతా బెనర్జీ నిరసనతో పోల్చడంపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అంశంలో అక్కడి సీఎం మమతా బెనర్జీ.. హోంశాఖ, వైద్యారోగ్యశాఖల మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా డిప్యూటీ సీఎం అన్న హోదాకు ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండన్న విషయం ఈ విమర్శలు చేస్తున్న మేధావులకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తాను దీక్ష పూనారే తప్ప.. ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూజలు, పురస్కారాలు చేస్తే సరిపోతుందని చెప్పలేదని, ప్రాయిశ్చిత్త దీక్ష చేయడం అనేది.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత అంశమని, దీనిని కొందరు కావాలనే సంబంధం లేని అంశాలతో పోలుస్తున్నారని మండిపడుతున్నారు.