స్పూర్తి సందేశాన్నిచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ వైఫ్‌ రేణూ దేశాయ్‌

రాజకీయాలకు దూరంగా ఉంటాను..సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమమని వచ్చాను.;

Update: 2025-01-03 13:36 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ విజయవాడలో జరిగిన సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై) ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ లెమన్‌ ట్రీ హోటల్‌లో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సావిత్రిబాయి సేవలను ఆమె కొనియాడారు. సావిత్రిబాయి ఫూలే జన్మించిన ప్రాంతంలో తాను జన్మించడం పూర్వ జన్మ సుకృతమని, అదే ప్రాంతంలో తాను పుట్టడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. చిన్న తనం నుంచి సావిత్రిబాయి కథలు వింటూ.. సావిత్రిబాయి కథలు చదువుతూ పెరిగానన్నారు. అంత గొప్ప సంఘ సేవకురాలు సాయిత్రిబాయి ఫూలే గురించి నిర్వహిస్తున్న సభలో తాను పాల్గొనడం, ప్రసంగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో మిగిలి పోతాయని, ఎన్నేళ్లయినా చెరిగి పోవన్నారు. ఆడపిల్లల చదువుల కోసం ఆ నాడు సావిత్రిబాయి ఫూలే పోరాడకపోతే, అడుగు ముందుకు వేయకపోతే మహిళలు ఎక్కడ ఉండేవాళ్లమో అని అన్నారు.

భారత దేశంలో మహిళల విద్య కోసం సావిత్రిబాయి ఫూలే ఎనలేని కృషి చేశారని రేణూదేశాయ్‌ అన్నారు. సహజంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తనకు చెబితే ఆ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆశతో వచ్చానన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహించిన రామచంద్ర యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇలా వందలాది ప్రజలందరి ముందు నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం సావిత్రిబాయి ఫూలే కారణమన్నారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి ఫూలే ఎంతో కష్టపడి పని చేశారని అన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రుల వద్ద కంటే పాఠశాలల్లో ఉపాధ్యాయులతోనే ఎక్కువ సమయం ఉంటారని, సమాజానికి ఉపయోగపడే విధంగా పిల్లలను తీర్చి దిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం, బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సూరజ్‌ మండల్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఉత్తమ సేవలందించిన మహిళా ఉపాధ్యాయులకు అవార్డులను ప్రధానం చేశారు.
Tags:    

Similar News