ఎన్టీఆర్, చంద్రన్నలా ప్రభుత్వ పథకాలకు పవన్ కల్యాణ్ పేరు?
ప్రభుత్వ పథకాలకు ఎలాంటి పేర్లు పెట్టాలనే దానిపై ఒక క్లారిటీ ఉన్న పవన్ కల్యాణ్, టీడీపీ నేతల పేర్లే పెడుతున్నా ఎందుకు స్పందించడం లేదు?
Byline : The Federal
Update: 2024-07-15 05:57 GMT
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు వారి నచ్చిన నేతల పేర్లను పెట్టుకోవడంపై గతంలో విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత రెండో స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టే అంశానికి అంత ప్రాధాన్యత లేదనుకుకున్నారో ఏమో అందుకే ఇంత వరకు స్పందించ లేదనే టాక్ వినిపిస్తోంది.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సయమంలో ప్రభుత్వ పథకాలకు టీడీపీ నేతల పేర్ల పెట్టడంపై నాడు పవన్ కల్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు పేర్లు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా చేసి ఉండొచ్చు అంత మాత్రానా ప్రభుత్వ పథకాలకు వారి పేర్లు ఎలా పెడుతారనే ధోరణిలో నిలదీశారు. రాష్ట్రం కోసం ఏమి చేశారని వారి పేర్లు పెట్టుకుంటారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ పార్టీ నేతల పేర్లు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతల పేర్లు పెట్టడం అలవాటుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఇందిరమ్మ పథకాలు, టీడీపీ ప్రభుత్వంలో అన్ని చంద్రన్న పథకాలు పెట్టుకుంటున్నారని, రాష్ట్రం కోసం త్యాగం చేసిన వారి పేర్లు పెడితే సబబుగా ఉంటుందని ఆదర్శాలు వల్లించారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పథకాలు, చంద్రన్న పథకాలు మాదిరిగా పవన్ కల్యాణ్ బీమాలు వంటి పేర్లు ప్రభుత్వ పథకాలకు ఉండవన్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి నాయకులు, రాష్ట్రం కోసం త్యాగం చేసిన నాయకులు, ముఖ్య నాయకులు పేర్లు పథకాలకు పెడుతామని, పవన్ కల్యాణ్ బీమా వంటి పేర్లు పెట్టమని ఆదర్శాలు పలికారు. అంటే మనం ఇచ్చే వాళ్లం.. మిగతా వారు తీసుకునే వాళ్ళా అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అలా కాకుండా మహనీయుల పేర్లు పెట్టి వారిని గౌరవించుకుంటామని ఆదర్శవంతమైన వ్యాఖ్యలు చేశారు.
నేడు పవన్ కల్యాణ్ పొజిషన్ మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పవర్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఉప ముఖ్యమంత్రిగా రెండో స్థానంలో పవన్ కల్యాణ్ ఉన్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. నాడు విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ నేడు పవర్‌లో ఉండగానే పలు పథకాలకు పేర్లు కూడా మార్చేశారు. ఆరోగ్యశ్రీతో పాటు మరో ఐదు పథకాలకు పేర్లను మార్చారు. గత జగన్ ప్రభుత్వంలో ఉన్న పేర్లను మార్చి టీడీపీకి అనుకూలంగా ఉన్న పేర్లను మార్చుకున్నారు. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు పథకం పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. వైఎస్‌ఆర్ విద్యోన్నతి పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మార్చారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరును నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్‌గా పేరు మార్చారు. దీంతో పాటు హెల్త్ యూనివర్శిటీకి కూడా పేరు మార్చారు. వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చారు. చంద్రబాబు, ఎన్టీఆర్ పేర్లు కాకుండా రాష్ట్రం కోసం త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి ప్రముఖల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టాలని నాడు విమర్శించిన పవన్ కల్యాణ్ నేడు కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కూడా స్పందించక పోవడంతో పథకాల పేర్ల పట్ల పవన్ కల్యాణ్ చిత్త శుద్ధిని శంకించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. భవిష్యత్‌లో అయినా స్పందిస్తారా లేదా మౌనంగానే ఉండి పోతారా అనేది వేచి చూడాలి.
మరో చర్చ కూడా సాగుతోంది. గతంలో కూడా ఒక భిన్నమైన నిర్ణయం సీఎం చంద్రబాబు ఈ సారి తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కూటమిలో భాగస్వామి కావడం, తెలుగుదేశం పార్టీ క్రైసిస్‌లో ఉన్నప్పుడు దగ్గరుండి మద్దతు తెలపడం, ఎన్నికల్లో సీట్ల విషయంలోను త్యాగం చేయడం ఇలా అనేక కారణాల వల్ల పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వంలో సముచిత స్థానం కేటాయించారు. ఇదే విధంగా పథకాల పేర్ల విషయంలోను చేయనున్నారనే చర్చ కూడా సాగుతోంది. ప్రభుత్వ పథకాలకు ఎన్టీఆర్, చంద్రబాబు పేర్లు పెట్టుకున్నట్లు పవన్ కల్యాణ్ పేరు కూడా పెట్టొచ్చనే టాక్ కూడా ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. దీని వల్లే పథకాల పేర్లపై గతంలో చెప్పిన ఆదర్శాలను పక్కన పెట్టారనే చర్చ కూడా సాగుతోంది.