పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారా!

వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయడం వెనక చంద్రబాబు హస్తం ఉందని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. పెన్షన్ల విషయంలో బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

Update: 2024-04-03 14:10 GMT
Source: Twitter

వాలంటీర్లపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్ర హైకోర్టు సమర్థించింది. వాలంటీర్లు లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్‌లను ఇంటికి అందిస్తున్నారుకదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్లను అడ్డుకుంటుంది చంద్రబాబేనని పునరుద్ఘాటించారు. వాలంటీర్లపై ఉన్న కక్షతోనే చంద్రబాబు ఇలా చేశారని విమర్శించారు. పెన్షన్‌లు వాలంటీర్లు ఇవ్వడం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని, అది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమే అవుతుందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ప్రైవేటు సంస్థ ఫిర్యాదు చేసిందని ఆయన గుర్తు చేశారు. చేసింది సంస్థే అయినా చేయించింది చంద్రబాబే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం ఎలాంటి పథకాల అమలు కోసం వాలంటీర్లను వినియోగించకూడదని, ఎన్నికల విధుల నుంచి కూడా వారిని దూరంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చిందని, దీంతో బాబు ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయిందని చురకలంటించారు.

2019లో చేసిందేంటి
ఇప్పుడు వాలంటీర్లు పథకాలు అందిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అంటున్నారని, మరి 2019లో టీడీపీ చేసిందేంటని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ‘‘పెన్షన్‌ల పంపిణీపై చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాల అమలుకు వాలంటీర్లను వినియోగించడం నిబంధనల ఉల్లంఘన అయితే.. 2019లో టీడీపీ వాళ్లు జన్మభూమి కమిటీల ద్వారా పెన్షన్‌లను అందించడం ఏమవుతుంది. అప్పుడు మేము అడ్డుకున్నామా.. ఎవరు చేసినా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది మేము చూస్తాం. మీకు మాదిరిగా మాకు పేరొస్తుందా లేనా అని చూడం. 2019 ఎన్నికల సమయంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు పెన్షన్‌లు పంచారు. పసుపు-కుంకుమ పేరుతో అక్కచెల్లెమ్మలకు రూ.20వేల చెక్కులను అందించారు. ఇంత చేసినా చంద్రబాబును నమ్మే ధైర్యం ప్రజలు చేయలేకపోయారు. ఇప్పుడు కూడా 2019 సీనే రిపీట్ అవుతుంది. ఈసారి వైసీపీ విజయం మరింత గొప్పగా ఉండనుంది’’అని ధీమా వ్యక్తం చేశారీ మాజీ మంత్రి.
అదంతా అసత్య ప్రచారమే
డబ్బులు లేకే ఏపీ సర్కార్ పెన్షన్‌ల పంపిణీని జాప్యం చేస్తుందని టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలపై పేర్ని నాని మండిపడ్డారు. అదంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు. ‘‘వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలే ఇవ్వలేదని అంటున్న చంద్రబాబు.. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్‌ల పంపిణీ చేయమని ఎలా సలహాలు ఇస్తున్నారు. మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుంటే సచివాలయాల్లో 1.60 లక్షల మంది ఉద్యోగులు ఎలా వచ్చారో కూడా బాబే చెప్పాలి. ఉద్యోగాలే ఇవ్వలేదన్న నోటితోనే సచివాలయ ఉద్యోగాలను వైసీపీ కల్పించిందని ఒప్పుకోవాల్సి వస్తుంది’’అని స్పష్టం చేశారాయన.
ఆ ఘనత సీఎం జగన్‌దే
రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ఐదేళ్లూ పనిచేసిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్నినాని చెప్పారు. ‘‘ఐదేళ్ల పాలనలో 2 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించింది సీఎం జగన్ మాత్రమే. తనకు 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, 14 ఏళ్లు రాష్ట్ర సీఎంగా చేశానని, హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకునే చంద్రబాబుకు పెన్షన్‌లను ఇంటికే అందించాలన్న ఆలోచన వచ్చిందా. జగన్ నిక్కర్లు వేసుకోనప్పటి నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని చంద్రబాబు అంటున్నారు. ఎప్పుడు వచ్చాం అన్నది కాదు ఏం చేశామన్నది ముఖ్యం’’అంటూ సినిమా లెవెల్లో కౌంటర్ ఇచ్చారు.
Tags:    

Similar News