NTR Bharosa Pension | భర్త ఉన్నా.. విధవరాలే..! కాళ్లు లేకున్నా నడక !!
సామాజిక పింఛన్ల తనిఖీలో విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సిబ్బందే నివ్వెరపోతున్నారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2024-12-09 12:44 GMT
ఎన్టీఆర్ భరోసా పథకంలో లబ్దిపొందుతున్న వారిలో అనర్హుల ఏరివేతకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సిబ్బందిని కూడా రంగం లోకి దించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 65.31 లక్షల మంది సామాజిక పింఛన్లు తీసుకుంటున్నారు. వారిలో కనీసంగా నాలుగు లక్షల మంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం సందేహిస్తోంది. దీనికోసం
రాష్ట్రంలోని ఓకో జిల్లాలో ఒక పంచాయతీవార్డును మాత్రమే పైలెట్ ప్రాజెక్టుగా రెండు రోజుల పరిశీలన కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభించారు. నిర్దేశించిన వార్డులో సగటున 40 మంది లబ్ధిదారుల జాబితా సిబ్బందికి అందించారు. ప్రతి పది మందిలో నలుగురు నకిలీ పత్రాలు సమర్పించడం ద్వారా మొదటి రోజే అనర్హులు బయటపడ్డారు.
ఇదీ సాక్ష్యం
కడప నుంచి విభజిత అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం ఈటమార్పురం పంచాయతీలో తనిఖీకి ఎంపిక చేశారు.
ఆ వార్డులో 40 మంది ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారు.
ఆ వార్డులో తనిఖీకి పెనగలూరు మండల సిబ్బందిని పక్కకు ఉంచి, అదే నియోజకవర్బంలోని చిట్వేలి మండలంలోని వివిధ గ్రామ సచివాలయాల నుంచి 12 మందిని నియమించారు. డివిజన్ కేంద్రం రాజంపేట రూరల్ మండలం నుంచి మరో 14 మందిని ఈటమార్పురం పంచాయతీకి కేటాయించారు. వారికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ చంద్రకళ సారధ్యంలో తనిఖీలు చేశారు.
బయటపడిన విచిత్రం
గ్రామంలోని ఓ ముస్లిం ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది వెళ్లారు. అమ్మా.. పింఛన్ అనగానే.. ఎన్నిసార్లు ఇస్తారు సార్, నేను తీసుకున్నా. అని చెప్పింది. మీ భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకురమ్మంటే..
"బలేవోళ్లు సార్ మీరు.. మా ఇంటాయనే బతికే ఉంటే, సచ్చిపోయినాడు అంటారా? సర్టిఫికెట్, గిర్టిఫికెట్ ఏం లేదు. అప్పుడు మా లీడర్లు అట్టా రాయించినారులే" అంటూనే, కావాలంటే రద్దు చేసుకోండి అని కూడా ఆఫర్ ఇచ్చింది.
కాళ్లుచచ్చు బడినా పరిగెత్తాడు..!
అదే వీధిలో ఓ ఇంటి వద్దకు వెళ్లిన సిబ్బంది అవాక్కయ్యారు. పింఛన్ అనగానే.. వచ్చాండ సార్.. అని ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. "ఇదేందిబ్బా నీకు కాళ్లుచచ్చుబడిపోయాయి కదా"
"ఔ సార్, ఇదో సర్టిఫికెట్ అని పత్రం కూడా ఇచ్చాడు. ఇదేందియా సామి అంటే, మా నాయకులు అలా రాయించారులే సార్. నేను బాగానే ఉన్నా. పింఛన్ రద్దు చేసుకోపోండి" అని ఉచిత సలహాకూడా ఇచ్చాడంట. తనిఖీ బృందంలోని ఓ అధికారి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
ఈ విచిత్రాలు చూసి, సిబ్బంది నివ్వెరబోయారు.
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. పింఛన్ల మంజూరుకు వైసీపీ, టీడీపీ, మొదట్లో కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు అస్త్రంగా మార్చుకున్నాయి. అదే ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు భారంగా మారింది.
పోటీపడి హామీలు
ఎన్నికల హామీలు ఇచ్చిన వైసిపి అధికారంలోకి రాగానే 2014లో ఆ మొత్తాన్ని రెండు వేల రూపాయలకు పెంచింది. ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతామని హామీ మేరకు అమలు చేసింది. వైసిపి ప్రభుత్వ కాలంలోనే సామాజిక పింఛన్ల మొత్తం మూడు వేలకు చేరింది. ఆ మొత్తానికి మళ్లీ అధికారంలోకి వస్తే 500 పెంచుతామని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
2024 టిడిపి కూటమి ఓ అడుగు ముందుకు వేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ఆ మేరకు సీఎం ఎన్ చంద్రబాబు సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచారు. దీంతో,
ఈ పరిస్థితుల్లో వృద్ధులకు రు. నాలుగు వేలు, దివ్యాంగులకు ఆరు వేలు. పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15 వేలు, కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే.
2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన మేరకు, వైసిపి పాలనలో ఇస్తున్న 3000 రూపాయల మొత్తాన్ని నాలుగు వేలకు పెంచింది.. ప్రస్తుతం ఇదే పంపిణీ జరుగుతోంది.
చెప్పారు.. ఇచ్చారు..
టిడిపికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి నుంచి కొత్త గా సామాజిక పింఛన్లు మంజూరు చేయడానికి సంసిద్ధమైనది. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది లబ్ధిదారులకు గడచిన ఐదు నెలల్లో 18 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసింది.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ మొత్తం మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం వల్ల గతంతో పోలిస్తే అదనంగా రూ. 819 కోట్ల రూపాయలు భారం పడింది. దీనితో కలిపితే కేవలం సామాజిక పింఛన్ల కోసం ఏడాదికి 33,100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోంది.
నిధుల కొరతతో రాష్ట్ర ప్రభుత్వం సతమతం అవుతోంది.. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేస్తే కానీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఖజానాపై భారం
ఈ పరిస్థితిని అధిగమించడానికి వందల సమీకరణ పై సీఎం చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు. నూతన మద్యం విధానంలో వచ్చే ఆదాయానికి తోడు ఇతర మార్గాల్లో పారిశ్రామిక విధానాలు అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో..
సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానంగా సామాజిక పింఛన్ల పంపిణీ భారంగా మారినట్లే ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో అనివార్యమైనప్పటికీ అనర్హులను ఏరి వేయడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో నిర్ణీత మండలాల్లో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.
గతంలో ఏం జరిగింది?
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మద్దతుదారులు నాయకులు తమకు అవసరమైన వారికి అర్హతలు లేకున్నా పింఛన్లు మంజూరు చేయించారు..అనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. సాధారణంగా అధికార పార్టీ నాయకుల మాట చెల్లుబాటు అవుతుందనేది జగమెరిగిన సత్యం. ఆ మేరకే 2014 లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థను ఆ పార్టీ వారితో పాటు తమకు బలం ఉన్నచోట
టిడిపి నాయకులూ కూడా అవసరమైన వారికి అర్హతలు లేకున్నా పింఛన్లు మంజు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ చేసిన పనులపై ప్రతిపక్ష టీడీపీకి అనుకూల మీడియా అనేక కథనాలను ప్రచురించింది. ఇది ఒక రకంగా వారికి పెన్షన్లు మంజూరు చేసిన సిబ్బందిని ఇరకాటంలో పెట్టడమే.
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారం పై దృష్టి సారించింది. అందులో ప్రధానంగా..
"ఆనర్హులకు సామాజిక పింఛన్లు రద్దు చేయడం. వారి స్థానంలో అర్హులైన వారికి నూతన సంవత్సరం 2025 జనవరి నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయడం" లక్ష్యంగా ఎంచుకుంది.
జంబ్లింగ్ పద్ధతిలో...
మండలాలు, లేదా పట్టణ ప్రాంతాల్లో సామాజిక పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలు పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పగడ్బందీ చర్యలు తీసుకుంది. ఒక మండలంలో పింఛన్ల లబ్ధిదారుల హరహర పరిశీలించడానికి అదే మండలం లేదా పట్టణానికి చెందిన సిబ్బంది కాకుండా, పొరుగు ప్రాంత సిబ్బందిని రంగంలోకి దించింది. దీనివల్ల రాజకీయ ఒత్తిళ్లు, పక్షపాతానికి ఆస్కారం ఉండబోదు అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఎంతమందికి కోత
రాష్ట్రంలో ప్రస్తుతం 65.31 లక్షల మంది సామాజిక పింఛన్లు తీసుకుంటూ ఉన్నారు. రెండు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ ద్వారా నిర్వహించే తనిఖీల్లో కనీసం గా నాలుగు లక్షల మందికి పైగానే అనర్హులను తొలగించాలని లక్ష్యంగా పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 1.40 లక్షల మంది అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు కూడా ప్రభుత్వానికి నివేదికలు అన్యాయాన్ని చెబుతున్నారు.
రాష్ట్రంలో మొదటి దశగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు వివరాలు సేకరిస్తారు. దీనికోసం స్థానికులు కాకుండా పరుగు మండలానికి చెందిన అధికారులను నియమించారు. ఒక్కో బృందం 40 మంది పింఛన్ లబ్ధిదారులు పరిశీలించి నివేదికను తయారు చేయనున్నారు.
ఈ వివరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అనర్హులను జాబితా నుంచి తొలగించడానికి చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
ఆ తర్వాత జనవరి నుంచి కొత్తగా తీసుకునే దరఖాస్తులు అర్హులైన వారిని పరిశీలించి, పింఛన్లు మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి, వైసీపీ అధికారంలో ఉండగా, అంతకు ముందు టిడిపి కాలంలో మంజూరైన ఎనిమిది లక్షల సామాజిక పింఛన్లు తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చిన టిడిపి పాత సీన్ రిపీట్ చేస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు.
వైసిపి పాలనలో ఆ పార్టీ మద్దతుదారులే కాదు. నోరు, బలం, శక్తిసామర్థ్యాలు ఉన్న టిడిపి నేతలు కూడా వారి సంబంధికులకే కాదు. కుటుంబీకులకు కూడా సామాజిక పింఛన్లు మంజూరు చేయించుకున్న విషయం ఆయా ప్రాంతాల్లోని స్థానిక వార్డు సచివాలయం కూడా తెలిసిన విషయమే.
పట్టణాల్లో ఇంకా జాస్తి...
మండల కేంద్రాల్లోనే కాదు. పట్టణాల్లో కూడా అనర్హుల సంఖ్య గణనీయంగా ఉంది. స్థానిక సిబ్బందిని కాకుండా, ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతిలోనే పొరుగు మండలాల సిబ్బందిని రంగంలోకి దించితే, అనేక విచిత్రాలు బయటపడే అవకాశం ఉంది.
ఒక సంఘటన పరిశీలిద్దాం..
అది తిరుపతి నగరం కపిల్ తీర్థం రోడ్డు. ఆయన మూగవాడు. ఎస్బిఐ కి ఎదురుగాని నివాసం. ప్రధాన రోడ్డు పక్కనే కోట్ల విలువైన ఇల్లు ఉంది. ఇంకో సంఘటన
ఆ వ్యక్తికి పోలియోతో రెండు కాళ్లు చచ్చుపడ్డాయి. కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో లబ్ధిదారులిద్దరికీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అలనా పాలన కొదవలేదు. వీరు వైసీపీ మద్దతుదారులు ఎంత మాత్రం కాదు. వారంతా టీడీపీ మద్దతుదారులే. మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి.
చంద్రగిరిలో వైసీపీ మద్దతుదారులకు అనర్హత లేకున్నా, పింఛన్లు మంజూరు చేసిన తీరుపై పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఎంతమంది పేర్లు గల్లంతు అవుతాయో ఊమించలేం. దీనిపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది వేచిచూడాలి.