శ్రీవారిమెట్టు వద్ద యాత్రికులకు ఏనుగుల మందతో తప్పిన ముప్పు
స్మగ్లర్ల కోసం వదిలిన కాపాడిన అటవీశాఖ డ్రోన్;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-29 06:39 GMT
తిరుమల శేషాచలం అడవులు ఎర్రచందనం సంపదకు నిలయం. ఎర్రపుష్పాల కోసం నిఘా పెడితే, ఏనుగులు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు తిరుమలకు వెళుతున్న యాత్రికులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో భారీ ప్రమాదమే కాదు. ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగారు.
తిరుపతి నుంచి శ్రీనివాసమంగాపురం మీదుగా శ్రీవారిమెట్టు మార్గంలో సోమవారం అర్ధారాత్రి ఈ ఘటన జరిగింది. గగనతలంలోకి వదిలిన డ్రోన్ కెమెరాలో పరిశీలీస్తుంటే, ఏనుగుల సంచారం కనిపించింది. దీంతో అధికారుల అప్రమత్తత వల్ల శ్రీవారిమెట్టు కాలిబాట నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికులకు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు.
తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. అక్కడి నుంచి నాలుగు అడుగులు ముందుకు వెళితే.. కుడి వైపు నుంచి రోడ్డు మార్గంలో శ్రీవారిమెట్టుకు చేరుకోవచ్చు. శ్రీవానివాసమంగాపురం దాటిన తరువాత అటవీ ప్రాంతమే. జనసంచారం ఏమాత్రం ఉండదు.
తిరుమలకు శ్రీవారిమెట్టు మార్గంలో నడిచివెళ్లడానికి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో టైంస్లాట్ టోకెన్లు తీసుకున్న యాత్రికులు బయలుదేరారు. అదే సమయంలో అధికారులు డ్రోన్ కెమెరా ఆకాశంలోకి వదిలి, గస్తీ నిర్వహిస్తున్నారు.అదే సమయంలో టోకెన్లు తీసుకున్న యాత్రికులు తిరుమలకు నడిచివెళుతున్నారు. కొందరు ఆ ప్రాంతానికి వాహనాల్లో వెళ్తున్నారు.
ఏనుగుల కదలికలు
ఈ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డుకట్ట వేయడానికి టీటీడీ ఫారెస్టు, రాష్ర్ట అటవీశాఖ కూడా ఎవరి పరిధిలో వారు నిఘా ఉంటారు. శ్రీవారిమెట్ట మార్గంలోనే తిరుమలకు నీరు పంపడానికి ఏర్పాటు చేసిన పంప్ హౌస్ పరిసరాల్లో సోమవారం అర్ధరాత్రి వదిలిన డ్రోన్ లో సుమారు 15 ఏనుగుల మంద సంచరిస్తున్న దృశ్యాలు కెమెరాలో విజువల్స్ లో కనిపంచాయి. వెంటనే శ్రీవారిమెట్టు ప్రాంతంలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు.
టీటీడీ అటవీశాఖ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. తిరుమలకు వెళుతున్న యాత్రికులను శ్రీవారిమెట్టు వెళ్లడానికి ముందే ఉన్న వినాయకస్వామి చెక్ పాయింట్ వద్ద యాత్రికులను నిలిపివేశారు. దాదాపు గంట పాటు యాత్రికులు అక్కడే ఉన్నారని టీటీడీ విజిలెన్స్ అధికారుల ద్వారా తెలిసింది.
పొలాలు ధ్వంసం
తిరుమల కొండకు దిగువనే ఉన్న శ్రీవానివాసమంగాపురం మైదానంగా ఉన్న అటవీప్రదేశంలోకి వచ్చిన ఏనుగులను గుర్తించిన టీటీడీ అటవీశాఖ సిబ్బంది, విజిలెన్స్ అధికారులు ఏనుగులను దారి మళ్లించడానికి తీవ్రంగా శ్రమించారు. పంప్ హౌస్ కు సమీపంలోని పంటపొలాలను చాలా వరకు ధ్వంసం చేసినట్లు సమాచారం అందింది. రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఏనుగుల మందను అటవీప్రాంతంలోకి మళ్లించినట్లు తెలిసింది.