అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి అనుచరుడు అరెస్టు

ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రాకృష్ణారెడ్డి అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోను హల్‌చల్‌ చేశారు.;

Update: 2025-01-05 12:02 GMT

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం, కూటమి అధికారంలోకి రావడంతో కిశోర్‌ అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. హైదరాబాద్‌లో ఆయన తలదాచుకుంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్‌ వెళ్లి కిశోర్‌ను అరెస్టు చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో..అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో కిశోర్‌ అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రస్తుత విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై కిశోర్‌ దాడులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. కారు అద్దాలు బద్దలు కొట్టి దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కిశోర్‌పై కేసు నమోదు చేశారు. అయితే నాటి ప్రభుత్వంలో కిశోర్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పిన్నెల్లి హవా ఉండటంతో కిశోర్‌ మీద కేసు చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకంజ వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును తిరగతోడారు. దీంతో కిశోర్‌ను అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారని భావించిన కిశోర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిశోర్‌ కోసం తీవ్ర గాలింపులు చేపట్టారు. కిశోర్‌ హైదరాబాద్‌లో తల దాచుకుంటున్నట్లు సమచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి కిశోర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News