మాచర్ల, నర్సరావుపేట ప్రధాన కేసుల్లో ఒక్కరినీ అరెస్ట్ చేయని పోలీస్

మాచర్ల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో నమోదైన 18 పోలీస్ కేసుల్లో వందల మంది నిందితులు ఉంటే ఒక్కరినీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు.

Update: 2024-05-21 03:37 GMT

పల్నాడులో ఎన్నికల సందర్భంగ జరిగిన అరాచకాన్ని ఆపడంలో విఫలమైన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంలో కూడా విఫలమయ్యారు. సిట్ ఈ విషయాన్ని స్పష్టంగా తన నివేదికలో పేర్కొంది. మారణాయుధాలతో దాడులకు పాల్పడి సంఘటనలు, రాళ్లు రువ్వుకోవడాలు, వాహనాలు దహనం చేయడం, దాడుల్లో చాలా మంది క్షతగాత్రులు కావడం వంటి సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలన్నీ ఎక్కువగా మాచర్ల, నర్సరావుపేట నియోజకవర్గాల్లోనే చోటు చేసుకున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో పధానంగా 18 కేసుల్లో 474 మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు వీరిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదని సిట్ నివేదిక స్పష్టం చేసింది. 67 మంది 41ఎ కింద నోటీసులు ఇచ్చారు. గురజాల నియోజకవర్గంలో జరిగిన దాడులకు సంబంధించి 4కేసుల్లో 107 మందిని నిందితులుగా గుర్తించారు. ఇప్పటి వరకు 19 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ నివేదికలో పేర్కొన్నారు.

తాడిపత్రిలో చెలరేగిన హింసకు సంబంధించి 7 కేసుల్లో 728 మంది నిందితులున్నారు. వీరిలో 91 మందిని అరెస్టు చేశారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో చెలరేగిన హింసకు సంబంధించి 4 కేసుల్లో 61 మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో 14 మందిని మాత్రమే అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు రికార్డుల్లో పేర్కొన్నారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి వెతుకుతున్నట్లు సిట్ వివరించింది.

సిట్ విచారించిన 33 కేసుల్లో 1,370 మంది నిందితులు కాగా వారిలో ఇప్పటివరకు 731 మందిని పోలీసులు గుర్తించారు. మరో 639 మంది నిందితుల్ని గుర్తించాల్సి ఉంది. ఆయా కేసుల్లో 124 మందిని అరెస్టు చేశారు. 94 మందిని అరెస్టు చేయకుండా సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్‌ కింద నోటీసులిచ్చి విచారించారు. నిందితుల్ని గుర్తించేందుకు, అరెస్టు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సిట్‌ డీజీపీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. సీసీ ఫుటేజ్‌లు, వీడియోలు ఇతర డిజిటల్‌ ఆధారాలు సేకరించాలని దర్యాప్తు అధికారులను సిట్ ఆదేశించింది. నిర్దేశిత సమయంలోగా కేసులన్నింటిలోనూ అభియోగాలకు సంబంధించిన పత్రాలు దాఖలు చేయాలని సిట్ పోలీసులను ఆదేశించింది.

Tags:    

Similar News