'Social Psycho'| ఎంపీ అవినాశ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు: షర్మిల

తల్లీ, చెల్లీ అనికూడా చూడకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సోషల్ సైకోలు ఏ ఒక్కర్నీ వదలొద్దని వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-11-20 10:59 GMT
YS Sharmila (File Photo)
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా హీట్ వేవ్ (Social media Heat wave) కొనసాగుతోంది. తల్లీ, చెల్లీ అనికూడా చూడకుండా పోస్టులు పెడుతున్న ఏ ఒక్కర్నీ వదలొద్దని వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తనపైన, తన తల్లి విజయమ్మపైనా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తనపై పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, సోషల్ సైకో వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని, అతన్ని ఆ పనికి పురికొల్పిన ఎంపీ అవినాశ్ రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి విచారించాలన్నారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ఈ తరహా సైకోల వెనుక ఎంతపెద్ద నాయకుడున్నా వదిలిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. తన తల్లి వైఎస్‌ విజయమ్మ, చెల్లి సునీతపై పోస్టులు పెట్టించింది వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని.. అలాంటపుడు ఆయన్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులకు వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి మూలకారణమని షర్మిల చెప్పారు. ఆయన్ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని పోలీసులను నిలదీశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
‘‘అసభ్య పోస్టుల వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా.. ఏ ప్యాలెస్‌లో దాక్కున్నా పోలీసులు వదిలిపెట్టవద్దు. పోస్టులు పెట్టిన వారిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారు. వారి వెనకున్న వారిని ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారు? తెర వెనకున్న వారిని వదిలేస్తే న్యాయం జరగదు. 33శాతం మహిళలు అసెంబ్లీలో ఉండాలని నిత్యం చెప్పే వారే సోషల్ మీడియా వేదికగా అసభ్య ప్రచారం చేయడం దుర్మార్గం. సమాజంలో మహిళలు ఎదగకూడదనే ఇలాంటి దాడుల చేస్తున్నారు. వివేకా హత్య కేసులో సునీతకు అండగా ఉంటాను. ఆ కేసులో అసలు దోషులెవరో కనిపెట్టి శిక్షించాలి’’ అన్నారు షర్మిల.
కడప స్టీల్ ఫ్యాక్టరీకి పదేపదే శంకుస్థాపనలు, కొబ్బరి కాయలు కొట్టడంతో సరిపోతోందని వైఎస్ షర్మిల విమర్శించారు.
Tags:    

Similar News