రాయదుర్గమా.. ‘రాజకీయ’ దుమారమా?

రాయదుర్గం తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు కొనసాగుతోంది. దీని నుంచి బయటపడి ప్రత్యర్థిని ఎలాగైనా ఓడించాలని పట్టుదలలో కాల్వ ఉన్నారు.

Update: 2024-05-02 09:05 GMT

ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయాలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో సాగుతున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజక వర్గం రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఏ పార్టీకీ ఆ పార్టీ గెలుపు కోసం చేసే ప్రయత్నాల్లో మేము ముందున్నామంటే.. మేము ముందున్నామని ఎవరికి వారే అనుకుంటున్నారు. కానీ తమలో ఉన్న వర్గ విబేధాలను సరిదిద్దుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నియోజక వర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి రంగంలో ఉన్నారు. గతంలో ఈయన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఆ పార్టీలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును విబేధించి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 2019 నుంచి వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెట్టు గోవిందరెడ్డికి ఏపిఐసీసీ చైర్మన్‌గా పదవిని కట్టబెట్టి తన మనిషిగా నిలుపుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. గోవిందరెడ్డి 2019లో అప్పటి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిని గెలుపించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ హైకమాండ్‌ దృష్టిలో మెట్టు గోవిందరెడ్డి ఉన్నారు. 2024 ఎన్నికల్లో సీటు సంపాదించిన గోవిందరెడ్డి ఈ సారి కూడా గెలవాలనే పట్టుదలతో అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి వైఎస్‌ఆర్‌సీపీలో ఎలాంటి వర్గ రాజకీయాలు లేవు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూసినందువల్ల 2024 ఎన్నికల్లో గెలిచి తన సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014లో కాల్వ శ్రీనివాసులకు టీడీపీ టికెట్‌ ఇచ్చినప్పుడు అప్పటి వరకు బాగానే పార్టీ కోసం పని చేసిన దీపక్‌రెడ్డి కాల్వను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. 2012 ఉప ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. దీపక్‌రెడ్డికి గ్రామ స్థాయిలో మంచి పట్టుంది. టీడీపీని నిర్మాణ పరంగా బలోపేతం చేయడంలో దీపక్‌ రెడ్డి పాత్ర కీలకమని స్థానికులు చెబుతున్నారు.
దూరంగా దీపక్‌ రెడ్డి వర్గం
ఇటీవల కాలంలో కాల్వ శ్రీనివాసులు దీపక్‌ రెడ్డి వర్గాన్ని కాస్త దూరం పెట్టినట్లు టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. డీ హీరేహాల్‌ మండలం మాజీ ఎంపీపీ భర్త మహాబలి వర్గం కూడా కాల్వ శ్రీనివాసులకు వ్యతిరేకంగా ఉంది. గతంలో కాల్వకు, మహాబలికి మధ్య జరిగిన గొడవలు నేటీకి సర్థుకోలేదు. మహాబలి దీపక్‌రెడ్డి వర్గీయుడు. మూడు రోజుల క్రితం అనంతపురంలో జరిగిన చంద్రబాబు సభలో మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నాగరాజు చంద్రబాబుకు బొకే ఇవ్వడానికి వేదికపైకి రాగా ఒక వర్గం వారు ఆయనను లాగేశారు. దీని వెనుకాల కాల్వ వర్గం వారే ఉన్నారనే చర్చ స్థానిక టీడీపీ నేతల్లో చర్చగా మారింది. గుమ్మగట్టు జడ్పీటీసీ వర్గం కూడా కాల్వ శ్రీనివాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
దిక్కుతోచని రామచంద్రారెడ్డి
వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌ నిరాకరించడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కాపు రామచంద్రారెడ్డి ఆ పార్టీని వీడారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని సమక్షంలో బిజెపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ బిజెపీ కూటమిలో భాగస్వామి కావడం వల్ల టీడీపీకి ప్రచారం చేయాల్సిన బాధ్యత బిజెపీకి ఉంది. రామచంద్రారెడ్డిని టీడీపీకి తరుపున ప్రచారానికి రావలసిన అవసరం లేదని కాల్వ శ్రీనివాసులు అడ్డుకట్ట కట్టారు. బిజెపీ మత రాజకీయాలు ప్రోత్సహిస్తున్నందు వల్ల బిజెపీ నాయకుడిగా రామచంద్రారెడ్డి ప్రచారం చేస్తే ఆ ఎఫెక్టుతో టీడీపీకి వచ్చే ఓట్లు తగ్గుతాయనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నట్లు సమాచారం. కాపు రామచంద్రారెడ్డి 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2012లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి 2019లో కూడా అదే పార్టీ నుంచి రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక్క సారిగా రాజకీయాలకు దూరం కావలసిన పరిస్థితి వచ్చింది. బిజెపీలో ఉన్నప్పటికీ మద్దతు తీసుకోవలసిన అభ్యర్థే నీ మద్దతు అవసరం లేదని చెప్పడంతో కాపుకు జుట్టు పీక్కోవలసిన పరిస్థి ఏర్పడింది. సుమారు 30 ఏళ్లుగా కాపు రామచంద్రారెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం నియోజక వర్గంలో పెద్దగా పని లేక పోవడంతో తమినాడులో బిజెపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ గవర్నర్‌ తమిళసైని గెలిపించేందుకు ప్రచారానికి వెళ్లారు.
కాంగ్రెస్‌ నుంచి చన్నప్పయ్య
కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంబి చన్నప్పయ్య ఈ సారి నియోజక వర్గంలో ఎక్కువ ఓట్లను రాబట్టే చాన్స్‌ ఉంది. కాంగ్రెస్‌ పెద్ద స్థాయిలో పోటీ ఇవ్వక పోయినా రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల మధ్య మూడో వ్యక్తిగా గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఈ నియోజక వర్గంలో 2.75లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో వాల్మీకులు 62 శాతం, కురుబలు 40 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ముస్లింల ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు 21500 మంది ఉన్నారు. దళిత, క్రిస్టియన్ల ఓట్లు సుమారు 30వేలు ఉండగా మరో 28 వేల వరకు చేనత వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. ముస్లింలు, కన్వర్టెడ్‌ క్రిస్టియన్లు, చేనేత వర్గాలు ఏ అభ్యర్థికి మొగ్గు చూపితే గెలుపు అటువైపే ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News