మంటెక్కిస్తున్న గుంటూరు ఎన్నికల 'కారం'
గుంటూరు నగరం.. ఎన్నికల ఘాటెక్కుతోంది. అధికార వైసీపీ సిట్టింగ్‌లను కాదని ఇద్దరు కొత్త అభ్యర్థుల్ని తెరపైకి తెస్తే.. విపక్షాలు ఇంకా వెతుకులాటలోనే ఉన్నాయి..;
గుంటూరులో ఎన్నికల వేడి రాజుకుంది. సీట్లు వస్తాయని భావిస్తున్న వాళ్లు ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలు పెడితే.. సందిగ్ధంలో ఉన్నవాళ్లు వీధుల్లోకి వెళ్లాలో లేదో తెలియక సతమతం అవుతున్నారు. అధికార వైసీపీ గుంటూరులో సిట్టింగ్‌లను కాదని ఇద్దరు కొత్త అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇందులో ఒకరు ఏడాది ముందు నుంచే సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. మరొకరు తాజాగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే... ప్రతిపక్షాల పరిస్థితి మరోలా ఉంది. ఉమ్మడిగా పోటీ చేస్తాయని భావిస్తున్న టీడీపీ-జనసేన-బీజేపీలు ఈ టికెట్లు తమకంటే తమకే కావాలంటూ పట్టుబడుతున్నాయి. దీంతో ఈ రెండు సెగ్మెంట్ల నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో స్పష్టత లేకుండాపోయింది.
దూకుడు పెంచిన వైసీపీ..
గుంటూరు నగరంలో అధికార వైసీపీ దూకుడు పెంచింది. గుంటూరు వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల అభ్యర్థులను మార్చేసింది. వెస్ట్‌లో మద్దాలి గిరి స్థానంలో మంత్రి విడదల రజనికి, ఈస్ట్‌లో ముస్తఫా స్థానంలో ఆయన కూతురు షేక్ నూర్ ఫాతిమాకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో వీరిద్దరూ తమతమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మద్దాలి ప్లేస్‌లో విడదల రజని...
గుంటూరు వెస్ట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి బదులు ఈసారి మంత్రి విడదల రజనికి అవకాశం కల్పించారు సీఎం జగన్. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటున్న రజని.. పార్టీ క్యాడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే మద్దాలితో పాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఏసురత్నం, మేయర్ కావేటి మనోహర్‌నాయుడు ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు మంత్రి రజిని. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 25 డివిజన్లు ఉండగా... ప్రతిరోజు నాలుగైదు డివిజన్‌ల అధ్యక్షులు, కార్పొరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
టీడీపీ జనసేన తీరు ఎలా ఉందంటే...
ఇక ఈ స్థానంలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు జనసేన, ఇటు బీజేపీ వెస్ట్ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. జనసేనకు అవకాశమిస్తే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ కూడా గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి.. క్యాంపెయిన్ ప్రారంభించారు. అటు బీజేపీ నేత వల్లూరు జయప్రకాశ్ నారాయణ కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు టీడీపీ నేతలు కూడా ఈ టికెట్ తమకే కావాలని పట్టుబడుతున్నారు. టిడిపి ఇన్‌చార్జి కోవెలమూడి నాని టికెట్ ఆశిస్తుండగా.. తెనాలి సీటు త్యాగం చేస్తున్న ఆలపాటి రాజా కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. వీరితోపాటు NRIలు ఉయ్యూరి శ్రీనివాసరావు, మన్నవ మోహనకృష్ణ, భాష్యం ప్రవీణ్ వంటి వాళ్లు కూడా తమకు అవకాశం వస్తుందేమోనన్న ఆశతో ఉన్నారు. ఇక శేషయ్యలాంటి బీసీ నేతలు కూడా ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ఏ పార్టీ బరిలో ఉంటుందో ? ఎవరికి టికెట్ దక్కుతుందనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.
దూసుకుపోతున్న నూర్ ఫాతిమా..
ఇక గుంటూరు ఈస్ట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా స్థానంలో ఆయన కూతురు షేక్ నూర్‌ఫాతిమాకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఫాతిమా తన రాజకీయ వారసురాలు అని ముస్తఫా ఏడాది క్రితమే ప్రకటించారు. అప్పటి నుంచే అధికార పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు మేయర్ కావటి మనోహర్‌కు ఎమ్మెల్యే ముస్తఫా మధ్య విభేదాలున్నాయంటున్నా అవేవీ ఫాతిమాను ఆపలేకపోతున్నాయి. అభివృద్ధి పనుల్లో మేయర్ సహకారం అందించడం లేదని చాలాసార్లు ఎమ్మెల్యే తూర్పారబట్టారు. ఈ క్రమంలో మేయర్ ఫాతిమాకు సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక్కడ టీడీపీ అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ సెగ్మెంట్‌లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మైనార్టీ అభ్యర్థిని పోటీలో ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ ఇన్‌చార్జి నసీర్ అహ్మద్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన డేగల ప్రభాకర్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కేటాయిస్తే నేరెళ్ల సురేశ్ పోటీ పడే అవకాశముంది.
మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులిద్దరూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తే.. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉన్నాయి. మిగతా పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఎంపిక జరిగే వరకు వైసీపీ అభ్యర్థుల తొలి దశ కూడా పూర్తయ్యే అవకాశముందని స్థానికంగా చర్చ జరుగుతోంది.