'పోతిన మహేషా... ఎంత 'పోశారో' చెప్పవా?'

టీడీపీ అధినేత చంద్రబాబుకు పోతిన మహేష్ ఛాలెంజ్ విసిరారు. జగన్ అందించిన ఉద్యోగాల అంశంపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.

Update: 2024-04-29 15:07 GMT

జనసేన మాజీ నేత ప్రస్తుత వైసీపీ నేత పోతిన మహేష్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. తన మాటలతో మరోసారి జనసైనికులకు టార్గెట్ అయ్యారు. ‘ఉద్యోగాల కల్పనపై చర్చలకు సిద్ధమా’ అంటూ ఆయన చంద్రబాబుకు విసిరిన సవాల్‌పై బాబు కన్నా ముందు జనసైనికులు స్పందిస్తున్నారు. పోతిన మహేష్‌పై సెటైర్లు, జోక్‌లు, విమర్శలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పోతిన చేసిన ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లూ ఏమైందంటూ ఒకరేంజ్‌లో ప్రశ్నిస్తున్నారు.

అసలు మహేష్ ఏమన్నారంటే..

రాష్ట్రంలో అర్హత ఉన్న అక్క, చెల్లెమ్మకు సొంత ఇల్లు ఉండాలని ఆకాంక్షించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని, ఇలాంటి ఆలోచన మరే ఇతర సీఎం చేయలేదని జగన్‌ను కొనియాడారు. అంతేకాకుండా జగన్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలన్నీ బోగస్ అని, ఓట్ల కోసం ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తోందని ఘాటుగా స్పందించారు. ‘‘అందుకు జగన్ టార్గెట్‌గా చంద్రబాబు, పవన్ చేస్తున్న ప్రతి ప్రసంగం నిదర్శనమే. ఏ మీటింగ్‌లో అయినా జగన్ చేసిన మంచిని చంద్రబాబు, పవన్ అసలు ప్రస్తావనకైనా తీసుకొచ్చారా. ఏకాడికి జగన్‌పై నిప్పులు చెరగడం తప్ప వాళ్లు చేస్తున్నదేముంది. ఆఖరికి సభల్లో తాము ప్రజలకు ఏం చేస్తామో కూడా చెప్పలేని దుస్థితిలో వాళ్లు ఉన్నారు. కానీ 2029లో కూడా ప్రజల కోసం ఏం చేయగలమో చెప్పి స్థాయిలో సీఎం జగన్ ఉన్నారు. జగన్‌పై అక్కసు వెళ్లగక్కడం, విమర్శలు చేయడం తప్ప బాబు, పవన్‌లకు ఏమీ రాదు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి అవసరమా’’అని ప్రశ్నించారు.

అంతేకాకుండా ‘‘పేద ప్రజలను గొప్ప స్థాయికి తీసుకెళ్లాలన్న గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి జగన్. ఆ దిశగా ఆయన పనిచేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు జగన్‌పై బురదజట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. జగన్ హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 2 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించింది. దీనిపై చర్చలకు చంద్రబాబు కానీ కూటమిలో ఏ నేత అయినా సిద్ధమా’’అని ఛాలెంజ్ చేశారు.

రంగంలోకి దిగిన జనసేనికులు

కూటమిని, చంద్రబాబును ఉద్దేశించి పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి జనసైనికులు రంగంలోకి దిగారు. పోతినను ఉద్దేశించి పోతు కోతకొచ్చిందంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో పోతిన మహేష్.. జగన్‌ను విమర్శించిన వ్యాఖ్యలను కూడా షేర్ చేస్తున్నారు. ‘‘అప్పుడు కనిపించలేదా జగన్ చేసిన మంచి. కండవాతో పాటు ఎంత మొట్టింది? ఎక్కడ సెటిల్ అయ్యింది(ల్యాండ్) వాటి దెబ్బకు కళ్లు తెరుసుకున్నట్లు ఉన్నాయే. జగన్ చేసిన ప్రతి పని మంచిగానే కనిపిస్తోంది. ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. అక్కా, చెల్లెమ్మలు కనిపిస్తున్నారు’’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

వైసీసీలో చేరగానే మీకు కూమా నటన బాగా వచ్చేసిందే అని చురకలంటించారు. దీంతో పాటుగా గతంలో ‘‘వైసీపీ నేతలకు, మంత్రులకు జగన్‌కు పవన్ ఫోబియా పట్టుకుంది. పవన్ పేరు వింటే వణికిపోతున్నారు. మంత్రులు కూడా తమ శాఖలను వదిలేసి పవన్‌పైనే ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్నారు. బ్రో సినిమాపై డైరెక్టర్లు, నిర్మాతలు మాట్లాడతారు. మంత్రులకు ఏం సంబంధం. మీరంతా రాజకీయ పదవులకు రాజీనామా చేసి మూవీ మ్యాగజైన్ నడుపుకోండి. రివ్యూలు చెప్పుకోండి. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేయండి.. ఎంతైనా మీకు బాగా నటన వచ్చు కదా’’అన్న వ్యాఖ్యలను జనసైనికులు గుర్తు చేశారు. దీనిని ఉద్దేశించే ‘‘ఎంత ముడితే వచ్చింది ఈ నేచురల్ యాక్టింగ్’’ అంటూ సెటైర్లు వేశారు.

అప్పటి సవాల్ ఏమైంది మహేష్!

గతంలో ఇళ్ల నిర్మాణం, ప్రత్యేక హోదా, పోలవరం సహా ఇతర ప్రజా సమస్యలపై కూడా చర్చకు రావాలని తాను వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నానని పోతిన చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సవాల్ పూర్తయిందా.. ఇప్పుడు మరో సవాల్ అంటున్నావ్ అంటూ జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు.

జనసైనికుల సెటైర్లతో పోతిన మహేష్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. పార్టీ మారితే ఆటోమేటిక్‌గా స్వరం మారుతుందనడానికి పోతిన మహేష్ నిలువెత్తు నిదర్శనం అవుతున్నారని ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. మరి వీటిపై మహేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News