అధికారం, ఆస్తి వైఎస్‌ కుటుంబాన్ని ముక్కలు చేశాయి

ఆ కుటుంబం అన్యోన్యానికి మారు పేరు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం అంటే దేశంలోనే ఆదర్శ కుటుంబమని అందరూ భావించారు. కానీ..;

Update: 2025-02-09 04:00 GMT

బంధాలు, బంధుత్వాలకు అతీతమైనది డబ్బు. డబ్బుకోసం చావడానికైనా, చంపడానికైనా వెనుకాడని నైజం నేటి మానవుల్లో కొందరిది. తండ్రి బతికుండగా ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబం ఆయన చనిపోయిన తరువాత ముక్కలైంది. ఇందుకు డబ్బు కారణమైంది. అధికారం, డబ్బు ఎంతటి వారినైనా, ఏదైనా చేయిస్తుందనేందుకు ఉదాహరణ నేటి వైఎస్సార్‌ ఫ్యామిలీ. అన్నా చెల్లెలు మనసులు ముక్కలయ్యాయి. బాధను దిగమింగుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్‌ బతికుండగా సమకూర్చిన ఆస్తులు నేడు ఆకుటుంబ జీవన గమనాన్ని చిన్నాభిన్నం చేశాయి.

అందుకే ఎడబాట్లు..
2019కి ముందు వైఎస్‌ జగన్, వైఎస్‌ షర్మిల ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. క్విడ్‌ప్రోకో కింద నమోదైన కేసుల్లో జగన్‌ జైలుకు వెళితే వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని నడిపించారు. అన్నా, తమ్ముడు, బాబాయ్, తాత, అవ్వా అంటూ అన్నకు అండగా రాష్ట్రంలో పాదయాత్ర చేసి వైఎస్సార్‌ సీపీకి ఊపిరి పోశారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి విజయ దరహాసం చిందించారు. అధికార దాహం ఎలా ఉంటుందంటే తల్లి, తండ్రి, అన్నా, చెల్లి, బంధువులు గుర్తుకు రారు. చుట్టూ మందీ మార్బలం ఉంటుంది. కాలు కింద పెట్టనివ్వకుండా నాయకుడిని కాపాడేందుకు సవాలక్ష మంది ఉంటారు. ఇది జరగాలంటే అధికారం కావాలి. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. చెల్లిని, తల్లిని మరిచిపోవడం మొదలైంది. అది వారికి నచ్చలేదు. అందుకే ఎడబాట్లు తప్పలేదు.
ఒకే జనరేషన్‌ అంటూ చెల్లిని దూరంగా పెట్టి...
ఒకే జనరేషన్‌లో అన్నా చెల్లెలు పదవుల్లో ఉండటం నాకు ఇష్టంలేదు. అందుకే నేను చెల్లికి పదవి ఇవ్వలేదు. ఏ రాజ్యసభో ఇచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదని నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చాలా సార్లు వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఎప్పుడైతే చెల్లెలుకు పదవి ఇచ్చేందుకు జగన్‌ నిరాకరించాడో అప్పుడే స్పర్థలు మొదలయ్యాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్‌ విజయమ్మ కూడా కుమారుడి పోకడను ప్రశ్నించకుండా ఉండలేకపోయారు. ఆమె ప్రశ్నకు జగన్‌ నుంచి సరైన సమాధానం లేదు. పైగా తల్లికి ఏ ఒక్కటీ చెప్పకుండానే నిర్ణయాలు తీసుకుని అవి తల్లి నిర్ణయాలుగా పార్టీ గౌరవాధ్యక్షురాలు పేరుతో ప్రకటనలు విడుదల చేయడాన్ని కూడా ఆమె అంగీకరించలేకపోయారు. పార్టీ అధికారంలో లేనప్పుడు ఏది చేసినా సర్థుకు పోయారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎందుకు సర్థుకుపోవాలి అనుకున్నారు. కొడుకు పోకడ సరిగా లేదని భావించిన వైఎస్‌ విజయమ్మ తాను పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉండదలుచుకోలేదని, తనకు తెలియకుండానే తన పేరుతో ప్రకటనలు విడుదల కావడం ఏమిటని ప్రశ్నించి రాజీనామా చేశారు.
తాను రాజీనామా చేస్తున్నట్లు వేదికపై విజయమ్మ ప్రకటిస్తే వేదిక ఎదురుగా కూర్చున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎందుకు ఇలా జరిగిందనే ఆలోచన కూడా చేయలేదు. ప్రభుత్వంలో పదవులు ఇచ్చేందుకు జగన్‌ అంగీకరించక పోవడంతో ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందిగా కోరారు. 2019లోనే ఎవరెవరికి ఏ సంస్థలు చెందుతాయి. భూములు, ఇతర అన్ని రకాల ఆస్తుల పంపకాలు చేసినట్లు గత సంవత్సరం వైఎస్‌ షర్మిల వెల్లడించారు. ఆ ప్రకారం కాకుండా వైఎస్‌ జగన్‌ మెలికలు పెడుతూ షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో ఒకే ఇంట్లో ఉండటం కూడా కుదరదని వేరువేరుగా ఉండటం మొదలు పెట్టారు.
అన్న మెడలు వంచాలని...
ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెట్టి రంగంలోకి దిగితే ప్రజల్లో వైఎస్‌ కుటుంబంపై ఉన్న గౌరవం తగ్గుతుందనే భావనతో వైఎస్‌ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ఫెయిల్‌ అయ్యారు. ఏ రాజకీయ అధికారంతో తన కుటుంబాన్ని దూరం చేసుకునేందుకు కూడా జగన్‌ వెనుకాడలేదని భావించిన షర్మిల అదే అధికారం చేజిక్కించుకుని అన్నలోని అహంకారాన్ని చంపాలనే ఆలోచన చేశారు. ఆమె మాతృ సంస్థ అయిన కాంగ్రెస్‌ పార్టీలో చేరి అన్న అహంకారానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టారు. సోనియా, రాహుల్‌ గాంధీల ఆశీస్సులు పూర్తిగా పొందారు.
తల్లికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు
ఒకే జనరేషన్‌ నుంచి అన్నా చెల్లెలు ఇద్దరూ ప్రభుత్వంలో ఉండటం మంచిది కాదని భావించిన జగన్‌ తన తల్లికి అవకాశం ఎందుకు ఇవ్వలేదనే చర్చకు అవకాశం ఇచ్చారు. వైఎస్సార్‌ మరణించిన తరువాత ఆయన స్థానంలో పులివెందుల నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు. అసెంబ్లీలోనూ హూందాగా వ్యవహరించారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడే మాటల కోసం అందరూ ఎదురు చూశారు. మాట్లాడిన తరువాత చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. అంటే విజయమ్మ చాకచక్యంగా వ్యవహరించ గలిగిన సత్తా ఉన్న వ్యక్తి అని అర్థమైంది. మరి ఆమెను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎందుకు రానివ్వలేదు. మనసులో ఉన్నా కొడుకుపై ఉన్న అభిమానంతో ఎప్పుడూ తన గురించి రాజకీయ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. నిజానికి విజయమ్మ రాజకీయాల్లో రాణించే సత్తా ఉన్న వ్యక్తిగా ప్రూవ్‌ చేసుకున్నారు.
మా నాన్న సమానంగా ఆస్తి ఇచ్చారు..
మానాన్న బతికుండగానే నాకు, మా అన్నకు సమానంగా ఆస్తి ఇచ్చారు. అప్పుడే ఎవరెవరికి ఏమేమి చెందాలో నిర్ణయించి చెప్పారు. ఇప్పుడు జగన్‌మోహన్‌ రెడ్డి మారిపోయాడు. నాకు రావాల్సిన ఆస్తులు ఇవ్వడం లేదు. పైగా తల్లిపైనే పోలీస్‌ కేసు పెట్టారు. చెల్లిని రాజకీయంగా విమర్శించాలని, అన్నపై షర్మిల చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పాలని విజయసాయిరెడ్డితో చెప్పించినట్లు షర్మిల శుక్రవారం వెల్లడించారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన తరువాత మొదటి సారిగా షర్మిలను వారం రోజుల క్రితం కలిసి మాట్లాడారు. ఆయన ఏమి మాట్లాడించి చెప్పకపోయినా షర్మిల మాత్రం తనవద్దకు వచ్చి విజయసాయిరెడ్డి చెప్పిన అంశాలు చెప్పటం విశేషం. ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తారని వైఎస్‌ జగన్‌ నిరూపించారంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.
అధికారం, డబ్బు ఎంతటి వారినైనా విడదీస్తుందని, అధికారానికి, డబ్బుకు ఇచ్చే విలువ సమాజంలో కొందరు దేనికీ ఇవ్వరని అన్నా చెల్లెళ్లను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అధికారం మహా చెడ్డది. ఒకసారి అధికారం చేపట్టాక అది పోతే జీవితమే కోల్పోయినంత బాధ అని పిస్తుందని ఒక మాజీ మంత్రి ఒక సందర్భంలో నావద్ద వ్యాఖ్యానించారంటే.. అధికార దాహం ఎలాంటితో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News