పవన్‌ కళ్యాణ్‌కు ప్రకాష్‌రాజ్‌కు మధ్య లడ్డూ లడాయి

పవన్‌ కళ్యాణకు ప్రకాష్‌రాజ్‌కు మధ్య మాటల యుద్ధం మొదలైందా? పవన్‌ మాట్లాడిన ప్రతీ మాటకు ప్రకాష్‌రాజ్‌ ఏమని సమాధానం చెబుతారు?

Update: 2024-09-24 13:15 GMT

ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌కు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ హీరో, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌కు మధ్య తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై మాటల యుద్ధం మొదలైంది. ఇది చినికి చినికి గాలివానలా మరనుందా అనే అనుమానాలు తెలుగు సినీ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు విచారణ చేపట్టి దోషులను శిక్షించాల్సింది పోయి.. ఇష్యూని జాతీయ స్థాయిలో ఎందుకు వివాదం చేస్తున్నారని ప్రకాష్‌ రాజ్‌ ప్రశ్నించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కాస్త ఘాటుగానే స్పందించారు. సనాతన ధర్మం గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రకాష్‌రాజ్‌ను హెచ్చరించారు. విదేశాల్లో షూటింగ్‌లో ఉన్న ప్రకాష్‌ రాజ్‌ పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. నేను చెప్పిందేంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? అని సూటిగానే ప్రశ్నించారు.

ప్రకాష్‌ రాజ్, పవన్‌ కళ్యాణ్‌లు మంచి మిత్రులే. ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వరుస ఫ్లాప్‌లతో డౌన్‌ ఫాలై.. మంచి హిట్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రకాష్‌రాజ్, పవన్‌ కళ్యాణ్‌లు కలిసి నటించిన ‘బద్రీ’ పవన్‌ కళ్యాణ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా టాలీవుడ్‌లో తిరుగు లేని హీరోగా పవన్‌ కళ్యాణ్‌ను నిలబెట్టింది. నువ్వు నందా అయితే నేను సిద్ధూ.. సిద్ధార్థ్‌ అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పే డైలగా చాలా ఫేమసైంది అప్పట్లో. మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు అంటే ప్రకాష్‌ రాజ్‌కు ఎంతో ఇష్టం. ఎంతో గౌరవం కూడా. అంతే గౌరవం ప్రకాష్‌రాజ్‌కు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు ఇస్తారు. అయితే తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం వీరి మధ్య ఉన్న బాండింగ్‌కు బ్రేక్‌ పడేలా మారింది.
అసలేం జరిగింది..
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపైన, దానిపైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తున్న తీరుపై తొలుత ప్రకాష్‌రాజ్‌ స్పందించారు. ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. ‘జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను కోట్‌ చేస్తూ మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు. జస్ట్‌ ఆస్కింగ్‌ ’అని పోస్టు పెట్టారు.
దీనిపైన పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ‘హిందువులకు జరిగిన అపవిత్రత గురించి నేను మాట్లాడుతున్నా. ప్రకాష్‌రాజ్‌కు సంబంధం ఏంటి ఇందులో? నేనొక మతాన్ని నిందించానా? ఇస్లామ్‌ను నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? హిందూ ధర్మానికి అపవిత్రం జరిగింది. ఇలా జరక్కూడదని మాట్లాడుతున్నా. తప్పు జరిగినప్పుడు మాట్లాడ కూడదా? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్‌రాజ్‌కు చెబుతా ఉన్నా. మీరంటే గౌరవం. వెన్‌ ఇట్‌ కమ్స్‌ టు సెక్యులరిజమ్, ఇట్‌ ఈజ్‌ టూ వే, నాట్‌ ఒన్‌ వే. మీరంటే ఎంత గౌరవం ఉందో అది మీకు తెలుసు. నేను పాటించే ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడ కూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజానికి విఘాతం కలుగుతుంది అంటారు. అసలు సెక్యులరిజమ్‌ అంటే ఏమిటి? తాను పాటించే సనాతన ధర్మం అన్ని ధర్మాలకు ఆశ్రయమిస్తుంది. అలాంటి సనాతన ధర్మం మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడ కూడదంటే ఎలా? ప్రకాష్‌ రాజ్‌ యు హ్యావ్‌ టు లేర్న్‌ ఏ లెసన్స్‌. ఐ రెస్పెక్ట్‌ యు. ఇదొక ప్రకాష్‌ రాజ్‌కే కాదు హూ థింక్స్‌ ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ సెక్యులరిజమ్‌ అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇంకా కొనసాగిస్తూ కామెంట్స్‌ చేసే ముందు సనాతన ధర్మ అంటే ఎందో తెలుసుకోవాలని హెచ్చరించారు. ఇనఫ్‌ ఆఫ్‌ దిస్‌. ఇది చాలన్నారు. సనాతన ధర్మంపై ఇష్టానికి మాట్లాడుతున్నారని, అయప్ప స్వామి మీద మాట్లాడుతారు. సరస్వతి మీద మాట్లాడుతారు. అల్లా మీద మీరు మాట్లాడ గలరా? జీసస్‌ మీద మాట్లాడ గలరా? అని ప్రశ్నించారు.
దీనిపై తిరిగి ప్రకాష్‌రాజ్‌ స్పందించారు. మళ్లా ఎక్స్‌ వేదికగా మరో పోస్టు పెట్టారు. ‘శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్‌ మీట్‌ని చూశాను. నేను చెప్పిందేంటి? మీరు దాన్ని అపర్థాం చేసుకొని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతీ మాటకు సమాధానం చెబుతాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి. ప్లీజ్‌’ అంటూ తన పోస్టును పెట్టారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన తర్వాత ప్రకాష్‌ ఏమి మాట్లాడుతారు? పవన్‌ మాట్లాడిన ప్రతి మాటకు ఏమని సమాధానం చెబుతారనేది తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు సర్వత్రా చర్చగా మారింది.
Tags:    

Similar News