అనకాపల్లిలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు

నూక్లియర్‌ పవర్‌ ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధం. దేశ, విదేశాల్లో అణు విద్యుత్‌ కేంద్రాలపై వ్యతిరేకత.;

Update: 2025-03-27 12:09 GMT

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కుతూహలంతో ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లడానికే తహతహలాడుతోంది. కూటమి ప్రభుత్వం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన వారి గుండెల్లో అణు బాంబుల్లాంటి ఆందోళన రేకెత్తిస్తోంది. అనకాపల్లి జిల్లాలో నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) ద్వారా 2800 మెగావాట్ల సామర్థ్యం ఉండే నూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌కు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అనకాపల్లి జిల్లా వాసుల్లోనే కాదు.. పొరుగున ఉన్న విశాఖ ప్రజల్లోనూ అలజడిని రేకెత్తిస్తున్నాయి.

దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ అణు విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న రోజులివి. రష్యాలోని చెర్నోబిల్, అమెరికాలోని ఐస్‌లాండ్, జపాన్‌లోని ఫుకుషిమాల్లో జరిగిన అణు ప్రమాదాల తర్వాత ప్రపంచ దేశాలన్నీ అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటును విరమించుకున్నాయి. అమెరికా తమ దేశంలో ఉన్న నాలుగు అణు విద్యుత్‌ కేంద్రాలను మూసివేసుకుంది కూడా. దశాబ్దం క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ తీర ప్రాంతంలోనూ నూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌కు ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే అక్కడ స్థానికులు, మత్స్యకారులు గట్టిగా వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా అడుగు ముందుకు పడలేదు. ఇంతలో ఇప్పుడు అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో ఎన్టీపీసీ ద్వారా అణు విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రెండు వేల ఎకరాలు అవసరమవుతాయని, అందుకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. ప్రజలకు హాని కలిగించే ఈ ప్లాంటును వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా తలూపింది. పైగా ఈ ప్లాంట్‌ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని బుకాయిస్తోంది. కానీ అణు విద్యుత్‌ ప్లాంట్ల వల్ల తలెత్తే పరిణామాలు, జరిగే ప్రమాదాలతో మానవాళికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో ప్రజలకు అవగాహన ఉండడంతో వీటి ఏర్పాటును అంగీకరించడం లేదు. ఉపాధి, ఉద్యోగాల మాట దేవుడెరుగు.. మనుషుల ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ నూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ను అంగీకరించబోమని తెగేసి చెబుతున్నారు. ఒక మెగావాట్‌ నూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌కు రూ.20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకు పెట్టుబడి అవుతుంది. ఈ లెక్కన అనకాపల్లి జిల్లాలో తలపెట్టిన 2800 మెగావాట్ల పవర్‌ ప్లాంటుకు సుమారు రూ.50 వేల కోట్ల అవసరమవుతుందని అంచనా.
Delete Edit
ఈ ప్లాంటుతో అనర్థాలెన్నో..
అనకాపల్లి జిల్లాలో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి అనుమతులు అంటే.. ఆంధ్ర రాష్ట్రం పెను ప్రమాదంలోకి వెళ్తున్నట్టే.. గాలి, నీరు, పర్యావరణంపై తీవ్ర ప్రమాదం పడుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్, హిందూస్థాన్‌ షిప్‌యార్డు, నేవల్‌ డాక్‌యార్డు, విశాఖపట్నం, గంగవరం పోర్టులు, ఎన్టీపీసీ, బార్క్, ఫార్మా పరిశ్రమలు, ఎస్‌ఇజెడ్, ఎన్‌ఎఒబి వంటి కీలకమైన రంగాలు, పరిశ్రమలున్నాయి. అణు ప్రమాదం సంభవిస్తే క్షణాల్లో ఈ ప్రాంతం పెను విధ్వంసానికి గురవుతుంది. అణు ప్రమాదం తీవ్రత 80 కిలో మీటర్లు వరకు ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 30 కిలో మీటర్ల పరిధిలో ప్రజలు, జీవరాశులపై ప్రభావం ఉంటుంది. అణు విద్యుత్‌ తీవ్రమైన రేడియేషన్‌ కలిగి వుంటుంది. క్యాన్సర్, ఎక్యూట్‌ రేడియోషన్‌ సిండ్రోమ్, ఎనీమియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంలో అణు విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుతో భద్రతా పరంగా కూడా ప్రమాదకరమే. అంతేకాదు.. తీరానికి చేరువలో ఏర్పాటు చేసే ఈ అణు విద్యుత్‌ కేంద్రాలపై శత్రుదేశాలు దాడి చేస్తే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. అణు కేంద్రాలపై దాడి అనంతరం విడుదలయ్యే రేడియో ధార్మిక శక్తి కారణంగా భారీ జన నష్టం సంభవిస్తుంది. దీనికి తోడు ఆంధ్ర తీర ప్రాంత జిల్లాలు తరచుగా తుపానులకు గురవుతున్నాయి. ఇటువంటి ప్రదేశాల్లో భారీ అణు రియాక్టర్లను ఏర్పాటు చేయాలనుకోవడం ప్రమాదకరమైన నిర్ణయం అవుతుంది.
గత దుర్ఘటనలు ఇవీ..
1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్‌ మీద అమెరికా జరిపిన అణుదాడుల్లో లక్షలాది మంది మరణించారు. అప్పటి నుంచి అణు శక్తికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 1979లో అమెరికాలోని త్రీమైల్‌ ఐలాండ్, 1986లో ఆనాటి సోవియట్‌ యూనియన్‌లోని చెర్నోబిల్, 2011లో జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రాల్లో జరిగిన దుర్ఘటనల్లో ప్రాణ నష్టం అపారంగా సంభవించింది. చెర్నోబిల్‌ అణు దుర్ఘటన జరిగిన రోజున మరణించిన వారి సంఖ్య తక్కువే అయినా, ఆ రియాక్టర్‌ నుంచి విడుదలైన ప్రమాదకర రేడియేషన్‌ కారణంగా తర్వాతి కాలంలో లక్ష మంది మృత్యువాత పడ్డారు. యూరప్‌లోని 40 శాతం భూభాగం అణు దుష్ఫలితాల ప్రభావానికి గురైంది. ఈ ఉదంతం తర్వాత 22 దేశాల్లో 108 అణువిద్యుత్‌ ప్రాజెక్టులను నిలిపివేశారు.
అందరూ వద్దనుకుంటుంటే...
మన దేశంలోని గుజరాత్, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్, మహరాష్ట్ర ప్రజలు తిరస్కరించిన ఈ అణు విద్యుత్‌ కేంద్రాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే సామాజిక, పర్యా వరణ సమస్యలతో పాటు తీర ప్రాంతంలో భద్రతా పరమైన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచమంతా అణు విద్యుత్‌ కేంద్రాలపై ఆధారపడటం తగ్గించి వేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి పాలకులు మాత్రం ఇంకా అణు విద్యుత్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు తిరస్కరించిన అణు విద్యుత్‌ కేంద్రాలను మన రాష్ట్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పట్లో ఆంధ్రా తీరంలోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో నిర్మించాలనుకున్న 12 భారీ అణు విద్యుత్‌ కేంద్రాల కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి ఆగమేఘాల మీద వేలాది ఎకరాలుసేకరించింది. ఆ భూములు అలా నిరుపయోగంగా ఉండగా, తాజాగా అనకాపల్లి జిల్లాలో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 2,800 మెగావాట్ల అణు విద్యుత్‌ కేంద్రానికి రెండు వేల ఎకరాల భూమి సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. భూసేకరణ బాధ్యతను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మోదీ సర్కార్‌ అప్పగించింది. మోదీ మోజులో ఉన్న కూటమి పెద్దలు ఇకపై అణువిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు.
అంతర్జాతీయ సంస్థల అనుమానాలు..
ఆంధ్రా తీరప్రాంత జిల్లాల్లో నిర్మించాలనుకుంటున్న అణు విద్యుత్‌ కేంద్రాలపై అంతర్జాతీయ సంస్థలైన మెక్‌ ఆర్థర్‌ ఫౌండేషన్, ఎన్‌ఆర్‌డిసి(నేషనల్‌ రిసోర్సెస్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌) గతంలో పలు అనుమానాలను వ్యక్తం చేశాయి. ఈ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘ద వరల్డ్‌ న్యూక్లియర్‌ ఇండస్ట్రీ స్టేటస్‌ రిపోర్ట్‌’లో ఆంధ్రాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న అణు విద్యుత్‌ కేంద్రాల గురించి ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత నూక్లియర్‌ ప్లాంట్‌కయ్యే వ్యయం సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు వ్యయం కన్నా 10 నుంచి 12 రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, యూనిట్‌ విద్యుత్‌ ధర సుమారు రూ. 12–15 వరకూ ఉంటుంది కాబట్టి ఇవి ఆర్థికంగా ఏ మాత్రం లాభసాటి కాదనీ ఆ నివేదికలో పేర్కొన్నారు.
సాంకేతిక సమస్యలు
1996లో ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్‌ వాటా 17 శాతం ఉండగా, అది 2022వ సంవత్సరంలో 10 శాతానికి పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యం గల 22 అణు రియాక్టర్లు ఉంటే, వాటిలో తారాపూర్‌లో రెండు, కైగాలో రెండు, నరోరాలో రెండు, రాజస్థాన్‌లో ఒకటి, మద్రాస్‌లో ఒక యూనిట్‌ పూర్తిగానో, పాక్షికంగానో మూత పడ్డాయి. మన దేశ అణు రియాక్టర్లు నిత్యం సాంకేతిక లోపాలు ఎదుర్కొంటూ ఏనాడూ పూర్తి ఉత్పాదక సామర్థ్యంతో పనిచేయలేదు. మన దేశంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు 90 నుంచి 95 శాతం ఉత్పాదక సామర్థ్యంతో పని చేస్తుండగా అణు విద్యుత్‌ కేంద్రాలు తమ ఉత్పాదక సామర్థ్యంలో 40 శాతం మాత్రమే పని చేస్తున్నాయి. మరోవైపు అనకాపల్లి న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ లో లభించే ఉద్యోగ అవకాలు తక్కువ గా ఉంటాయి. స్థానిక ప్రజలకు ఉద్యోగావకాశాలు ఇంకా స్వల్పంగా ఉంటాయి. ఆ ప్రాజెక్టులను తయారుచేసే సంస్థలు విదేశాల్లో ఉండటం వలన, ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా లభిస్తాయి. .
సోలార్‌ ప్రాజెక్టులతో ప్రత్యామ్నాయం..
ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధి సాధించింది. అందువల్ల ఈ అణు విద్యుత్‌ కేంద్రాలను తీరప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయో జనాలేమీ ఉండకపోగా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకూడదు. దేశ భద్రతాపరంగాను, ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి దృష్ట్యా అణు విద్యుత్‌ ప్లాంట్‌కు భూములు కేటాయించవద్దు. విద్యుత్‌ పెంపునకు సోలార్, విండో, పంపుడ్‌ స్టోరేజ్, పర్యావరణ రహిత గ్రీన్‌ ఎనర్జీ వంటి అనేక ప్రత్యామ్నాయాలుండగా విషత్యులమైన అణు విద్యుత్‌ ప్లాంట్‌కు అనుమతులు ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకునేట్లు చూడాలి. అనకాపల్లి జిల్లాలో 2,800 మెగావాట్ల న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టును నిర్మిస్తే, 2011 జపాన్‌లో ఫుకుషిమా వంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుతో స్థానిక ప్రజలు నష్టపోతారు. ఇంకా ఈ ప్లాంటుకు రోజులకు 3 బిలియన్‌ గ్యాలన్ల నీరు అవసరమంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు వచ్చాక కూడా విశాఖ, అనకాపల్లి ప్రాంతంలో నీటి కొరత ఉంటుంది. ఇలా నూక్లియర్‌ పవర్‌ ప్లాంటుకు బదులు లక్షలాదిమందికి లాభం కలిగించే సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్యానెళ్లను, సోలార్‌ ఇరిగేషన్‌ పంప్‌ సెట్లను సులభంగా అందుబాటు చేసే పథకాన్ని ప్రభుత్వం చేపట్టాలి. వారు ఉత్పత్తి చేసే మిగులు విద్యుత్‌ను గ్రిడ్లకు విక్రయించే వీలుంది. అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు అవసరమైన రియాక్టర్లు, యురేనియం ఇంధనాన్ని విదేశాల నుంచి, డాలర్‌ ధరలకు దిగుమతి చేయవలసి ఉంది. అందువల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ ధరలు సామాన్యుల పరిధిలో ఉండవు. రియాక్టర్‌ లను తయారు చేసి, అమ్మే విదేశీ కంపెనీలు రియాక్టర్‌ డిజైన్లో, నిర్లక్ష్యం చూపించే ఆస్కారం ఉంటుంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువవుతాయని అని భారత ప్రభుత్వ ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Delete Edit
ఉపసంహరించుకోకపోతే ఉద్యమిస్తాం..
అనకాపల్లి జిల్లాలో నిర్మించ తలపెట్టిన ప్రమాదకర నూక్లియర్‌ పవర్‌ ప్లాంటును ఉపసంహరించుకోకపోతే ఉద్యమిస్తాం. అణు విద్యుత్‌ ప్లాంట్‌ ఎంత ప్రమాదకరమో జపాన్‌ ఫుకుషిమా నూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టు దుర్ఘటనే ఉదాహరణ. ఆ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు. లక్షలాది మంది నిర్వాసితులయ్యారు. అప్పట్నుంచి ఈ ప్లాంట్లపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన వచ్చింది. ప్రమాదానికి గురైన న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి రోజూ వస్తున్న వేల టన్నుల అణుధార్మిక జలాలను, ఈ రోజు వరకు జపాన్‌ ప్రభుత్వ సంస్థలు శుద్ధి చేయలేక పోతున్నాయి. ఒకవేళ అటువంటి ప్రమాదం జరిగితే, జరిగే ప్రాణ, ఆస్థి నష్టం అంచనాలకే అందదు. ఫుకుషిమా వంటి ప్రమాదం, కొవ్వాడ, అనకాపల్లి న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ల లో, ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని గుర్తించాలి. ప్రాజెక్టు చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, జనాభాను నియంత్రించే దిశలో, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకూడదు. 16 కిలోమీటర్ల పరిధిలో, ప్రమాదం జరిగి అత్యవసర పరిస్థితి ఏర్పడే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, అక్కడి ప్రజలను తరలించి పునరావాసం కలిగించడానికి నిరంతరం తయారుగా ఉండాలి. 30 కిలోమీటర్ల పరిధిలో, న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టు వలన కలిగే అణుధార్మిక ప్రభావాన్ని నిరంతరం మోనిటర్‌ చేయాలి. పైగా ప్లాంట్‌ ప్రభావిత పరిసర ప్రాంత ప్రజలు క్యాన్సర్, ఎనీమియా వంటి ప్రమాదకర రోగాల బారిన పడతారు. అందుకే అణు విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు వార్త వినగానో అనకాపల్లి ప్రాంత ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ప్రతిపాదిత ప్లాంట్‌ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వారి భయాన్ని కళ్లారా చూశాం. ఈ ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ కూడా రాశాం. ప్లాంట్‌ను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడ్తామని సీపీఐ (ఎం) కార్యదర్శి వర్గ సభ్యుడు కే లోకనాథం‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు. 
Delete Edit

Tags:    

Similar News