సినీనటి కాదంబరీ జెత్వానీ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. పరస్పర ఆరోపణలు, నిందలు, సవాళ్లతో సాగుతున్న ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు- తెలుగుదేశం, వైసీపీ- మధ్య వివాదానికి కారమమైంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు టాప్ ఐపీఎస్ లపైనా ఇంకో ఇద్దరు పోలీసు అధికారులపైనా వేటు పడింది. ఇంకా మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా ఈ కేసులో సస్పెండ్ అయిన విశాల్ గున్నీ ఈ వ్యవహారమై మూడు పేజీల లేఖ రాసి వైఎస్ జగన్ ప్రభుత్వంలో పని చేసిన సీఎంవో అధికారులను ఇరుకున పెట్టేసిట్టు కనిపిస్తోంది. తన పై అధికారులు చెప్పడం వల్లే తాను ముంబై వెళ్లి జెత్వానీని విజయవాడ తీసుకువచ్చినట్టు స్పష్టం చేశారు. ఆయన రాసిన తీరు చూస్తుంటే త్వరలో మరికొందరిపై వేటు పడక తప్పదేమో అన్నట్టుగానే ఉంది. గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన వారే ఈసారి టార్గెట్ అయ్యే అవకాశం ఉంది.
కేసు నమోదుకు ముందే విమాన టికెట్లు...
కేసు నమోదుకు ముందే తనకు ముంబై వెళ్లేందుకు విజయవాడ సీపీ ఆఫీసు నుంచి విమాన టికెట్లు బుక్ చేసి ఇచ్చారన్నారు విశాల్ గున్నీ. తాను ముంబై వెళితే ఏమేమి చేయాలో కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు కార్యాలయం నుంచి రాతపూర్వకంగా అందిందన్నారు. ‘అంత పెద్ద సార్ చెప్పారని.. ఏదైతే అదైందని విమానం ఎక్కి వెళ్లిపోయా.. ఎఫ్‌ఐఆర్ నమోదైన గంటలోనే ముంబైకి ఫ్లైట్ ఎక్కా’ అని విశాల్ గున్నీ ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఉదయం 6.30కి కేసు నమోదైతే.. ఏడున్నరకు అప్పటి డీసీపీ విశాల్ గున్నీ మరో ముగ్గురు పోలీసులు ముంబైకి వెళ్లారు. అక్కడ రోడ్డుపై ఆమె కారును అడ్డగించి కుటుంబ సభ్యులతో పాటు విజయవాడకు తీసుకొచ్చేశారు. హింసించి భయపెట్టారు. ముంబైలో ఆమె పెట్టిన కేసు మార్చి 14న మూసేసే వరకూ జైల్లో పెట్టారు. అన్నీ సర్దుకున్నాక ఆమెను పంపించేశారు. ఆ తర్వత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది. హైదరాబాద్‌లో తనకు తెలిసిన సినిమా వాళ్లతో జెత్వానీ మాట్లాడాక ఆమె ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి న్యాయం చేయాలని కోరారు. జెత్వానీ తన తల్లితో కలసి విజయవాడకు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది.
గున్నీని రిలీవ్ కాకుండా ఆపిందెవరు...
ఈ కేసులో ముంబై వెళ్లడానికి ముందు ఓ పెద్ద వ్యవహారం నడిచింది. విజయవాడ సీపీపీగా పని చేస్తున్న విశాల్ గున్నీని నాటి వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. వెంటనే ఆయన రిలీవ్ కావాల్సి ఉన్నా దాదాపు 12, 13 రోజులు తొక్కిపట్టారు. ఈలోగా ఆయనతో ఆ సినీనటి అరెస్ట్ వ్యవహారాన్ని నడిపించారు. ఈ విషయాన్నే ఆయన తన వాంగ్మూలంలో పేర్కొంటూ... బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే రిలీవ్ అవుదామనుకున్నా. సరిగ్గా ఆ సమయంలో పీఎస్ ఆర్ ఆంజనేయులు సీపీఎంవోకు పిలిపించి జెత్వానీకేసు అప్పగించారు. ఆ పి పూర్తి చేస్తేన రిలీవ్ చేస్తామంటూ నాపై తీవ్ర వత్తిడి తెచ్చారు అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
తెరపైకి మరో న్యాయవాది...
జెత్వానీ కేసులో మరో వ్యక్తి ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఆయనో న్యాయవాది. పీఎస్ఆర్ ఆంజనేయులు వ్యూహంలో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఈ న్యాయవాది ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని తెలుస్తోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి రెండో తేదీలోపు ఆయన పలుమార్లు కాంతిరాణాను కలిసి ఈ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినట్టు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ న్యాయవాది ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన ఎందుకు ఈ పని చేశారు, ఎవరు చెబితే చేశారనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులో ఎన్నో మలుపులు మరెన్నో మరకలు..
ముంబైలో ఓ పారిశ్రామికవేత్తపై సినీనటి జెత్వానీ పెట్టిన లైంగిక వేధింపుల కేసులో పోలీసులు తగిన విధంగా స్పందించలేదు. ఆ పారిశ్రామికవేత్తకు సన్నిహితుడైన ఏపీ వ్యాపారవేత్త కుక్కుల విద్యాసాగర్.. ఆమెను ఎలాగైనా కట్టడి చేయాలనే వ్యూహంలో భాగంగా ఆమెపై ఏపీలో కేసు పెట్టించి అరెస్ట్ అయ్యేలా చేశారన్నది అభియోగం. ఇప్పుడు విశాల్ గున్నీ కూడా దాదాపు అదే అంశాన్ని ఖరారు చేసినట్టు అర్థమవుతోంది. ఆమె పై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేస్తే పోలీసులు ‘జెట్’ స్పీడ్‌తో స్పందించారు. పైగా ఇది పూర్తిగా సివిల్ కేసు. భూలావాదేవీలకి సంబంధించిన ఈ ఫిర్యాదుపై ఎలాం టి విచారణ చేయలేదు. ఆమె తప్పు చేసినట్టు ఆధారాలు లేకున్నా జెత్వానీపై కేసు పెట్టడానికి ముందే ముంబై నుంచి ఆమెను తీసుకురావడానికి విమాన టికెట్లు బుక్ చేసుకున్నా రు. డీజీపీ అనుమతి తీసుకోకుండా, నిబంధనలను పాటించకుండా, ‘ప్రభుత్వ పెద్దల’ ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైన గంటలోనే ముంబైకి వెళ్లి అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు.
ముంబైలో జెత్వానీ ఫిర్యాదు చేసిన పారిశ్రామికవేత్తను ఆ కేసు నుంచి కాపాడటానికి ఏపీలో ఆమెపై అక్రమ కేసు పెట్టించారు. ఆమధ్య వచ్చిన వకీల్ సాబ్ సినిమాలోని సన్నివేశాలను తలపించారు. ఇదంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గత ఫిబ్రవరిలో జరిగింది. జెత్వానీ అరె్‌స్టకు తాడేపల్లిలోని సీఎంవోలోనే ప్లాన్ వేశారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు వ్యూహాన్ని ఖరారు చేయగా నాటి విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీ అమలు చేశారు. ప్రభుత్వం మారి టీడీపీ కూటమి వచ్చాక జెత్వానీ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వ చ్చింది. విమాన టికెట్ల బుకింగ్, ఉన్నతాధికారుల విచారణలో గున్నీ ఇచ్చిన వివరణతో ఐపీఎస్ లు బుక్ అయినట్టే కనిపిస్తోంది.
ఇదీ జెత్వానీ కేసు...
ప్రముఖ పారిశ్రామికవేత్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గత ఏడాది డిసెంబరులో ముంబై నటి కాదంబరి జెత్వానీ బంద్రాకుర్లా పోలీసు కాంప్లెక్స్‌లో ఫిర్యాదు చేశా రు. ఆ పారిశ్రామిక వేత్త తన పలుకుబడితో కేసు నమోదు కాకుండా చూసుకున్నారు. దాంతో ఆమె ముంబై హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకురావడంతో కేసు నమోదు చేశారు. ఆ పారిశ్రామికవేత్త అప్పటి ఏపీ సీఎం జగన్‌కి స్నేహితుడు కావడంతో డిసెంబరు చివరి వారంలో తాడేపల్లికి వచ్చి సాయం కోరారు. జెత్వానీతో వైసీపీకి చెందిన కుక్కల విద్యాసాగర్‌కు పరిచయం ఉందని, ఏదో ఒకటి చేసి తనను బయట పడేయాలని కోరారు. అంతే.. రాజకీయ నాయకులు, పోలీసులు ఒక్కటైతే జరగందేముంటుందీ?
తెరవెనుక తతంగం నడిచింది. పోలీసు అధికారులు వ్యూహం ఖరారు చేశారు. రాజకీయ నాయకులు కదిలారు. కృష్ణా జిల్లాలోని తన భూమిని కాజేసేందుకు జెత్వానీ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొండపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకుందని ఇబ్రహీంపట్నం పోలీసులకు విద్యాసాగర్‌తో ఫిర్యాదు ఇప్పించారు. పోలీసులు ముంబై వెళ్లారు. ఆమెను అరెస్ట్ చేసి తీసుకువచ్చి 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ సినీనటి తాను ముంబైలో ఆ పారిశ్రామిక వేత్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంది. ఆమె జైలు నుంచి విడుదలైంది. ప్రభుత్వం మారడంతో విచారణ మొదలైంది. అదిప్పుడు పోలీసు అధికారుల మెడకి చుట్టుకుంది. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీ ‘కథ’ నడిపించారని అర్థమవుతోంది.
విశాల్ గున్నీ వాంగ్మూలంతో మరెంతమంది పెద్దల తలకి ఈ వ్యవహారం చుట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.