రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు : మాజీ సీఎం వైఎస్ జగన్
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని, టీటీడీ విశిష్టతను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. పూజలతో ప్రక్షాళన చేద్దామని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు పిలుపు. ఎప్పుడంటే?
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో అన్నీ దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసన సభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పూజల్లో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు అపవిత్రం చేశారు. తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు జగన్‌మోహన్‌రెడ్డి తన ట్వీటర్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశారు. సెప్టెంబరు 28, శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిచ్చారు.