పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక ఇంత ప్రతిష్టాత్మకమా?

దెబ్బకు దెబ్బ తీయాలని టీడీపీ భావిస్తోందా.. కుప్పానికి ప్రతీకారమా పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక?;

Update: 2025-08-09 14:35 GMT

ఆగస్టు 12న అంటే ఇంకో 48 గంటల్లో జరగనున్న పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక కడప జిల్లా రాజకీయ వాతావరణాన్ని ఉత్కంఠ భరితం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం కావడంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గంలో జెండా పాతాలని ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలు ఎంతగా తాపత్రయపడ్డారో ఇప్పుడు అలాంటి పరిస్థితే పులివెందులలో నెలకొందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఐదుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఈసారి మాత్రం ప్రత్యక్ష ఎన్నిక జరుగుతోంది. ఈనేపథ్యంలో వైసీపీ–టిడిపి మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు, వాగ్వాదాలు ఊపందుకున్నాయి.

జగన్ అడ్డా కాదు- ఎంపీ శబరి

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పులివెందుల టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. “పులివెందుల జగన్ అడ్డా కాదు, టిడిపి కంచుకోట అవుతుంది” అని వ్యాఖ్యానించారు. కడప, పులివెందులకు జగన్ ఐదేళ్లలో ఏమి చేశారో చెప్పాలని సవాలు విసిరారు. కడప స్టీల్ ప్లాంట్‌కు ఒక్క ఇటుక కూడా వేయలేదని, కొప్పర్తి ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన రూ.1,500 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. పల్లెల్లోకి వైఎస్ జగన్ తన పత్రిక 'సాక్షి' ప్రతినిధులను పంపి, ఏదైనా జరిగితే టిడిపిపై నెపం వేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే మాదే గెలుపు- ఎమ్మెల్యే ప్రత్తిపాటి

“ఎన్నికలు సజావుగా జరిగితే పులివెందులలో వైసీపీ గెలవదు” అన్నారు. గతంలో ఎప్పుడూ స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేదని, రౌడీ ముఠాలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధిలో చంద్రబాబు దేశానికి రోల్‌మోడల్ అని, సూపర్-6 పథకాలు మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు.

వాళ్లే దాడి చేసుకుని నెపం మాపైన వేస్తున్నారు- బీటెక్ రవి,

వైసీపీ నేతలు స్వతంత్రులుగా తమ అనుచరులనే నామినేషన్ వేయించి, కుట్రలు చేస్తున్నారని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. వాళ్లకే వాళ్లు దాడి చేసుకుని టిడిపిపై నింద వేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని పోలీసులు, ఎన్నికల కమిషన్ గమనించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ విమర్శలను వైసీపీ తిప్పికొట్టింది. టీడీపీ తప్పుడు ప్రచారం చేసినా పులివెందులలో టీడీపీ గెలవడం అసాధ్యమని, అది వైఎస్ జగన్ కంచుకోట అని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

వైసీపీ వాదన ఎలా ఉందంటే...

వైసీపీ శ్రేణులు టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని, ప్రజా మద్దతు పూర్తిగా తమవైపే ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల ఆధారంగా ప్రజలు వైసీపీ అభ్యర్థికి ఓటు వేస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి గెలుపు కోసం బయటి నుంచి వచ్చిన వాళ్లు రంగంలోకి దిగారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నేతలందరూ కట్టకట్టుకుని ఒక్క జెడ్పీటీసీ ఉపఎన్నికకు ఇంతగా కష్టపడడం చూస్తుంటే కూటమి ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారనే దానికి సంకేతమని వాదిస్తున్నారు.

పోలీసు, ఈసీ జాగ్రత్తలు

ఎన్నికల రోజు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందులలో తొలిసారి ప్రత్యక్ష ఓటింగ్ జరగబోతుండటంతో ఈ ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా దృష్టి నిలిచింది.

Tags:    

Similar News