గవర్నర్‌ను కలిసిన పురంధేశ్వరి.. ‘ఆ వివరాలన్నీ చెప్పండి’

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఉత్కంఠ వాతావరణం అలుముకొని ఉంది. ఎవరు గెలుస్తారా అన్నది ఎవరికీ అంతుచ్చిక్కని నిగూఢ రహస్యంగానే ఉంది..

Update: 2024-06-01 06:53 GMT

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఉత్కంఠ వాతావరణం అలుముకొని ఉంది. ఎవరు గెలుస్తారా అన్నది ఎవరికీ అంతుచ్చిక్కని నిగూఢ రహస్యంగానే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు చేసే ప్రతి చర్య కీలకంగా మారుతోంది. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. ఆమెతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా గవర్నర్‌తో చర్చలు చేశారు. ఈ భేటీలో ఆంధ్రప్దేశ్ స్థితి గతుల గురించి గవర్నర్‌తో చర్చించినట్లు పురందేశ్వరి వివరించారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన అన్ని వివరాలను అందించాలని, బహిర్గం చేయాలని కోరినట్లు తెలిపారు.

‘‘గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళన కరంగా ఉందని నా దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాను. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ, పలు ఎఫ్‌ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి మరీ పలు సంస్థల నుంచి అప్పులు తీసుకుంది. ఈ అప్పుల తీసుకోవడం హద్దుమీరిపోయింది. కార్పొరేషన్లను సృష్టించి అవి ప్రభుత్వ అప్పులు కాదని చెప్పి, కార్పొరేషన్ పేరిట రుణాలు సేకరించి వాటిని దారి మళ్లిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో అనేకం’’ అని ఆమె వివరించారు.

మద్యాన్ని చూపి కూడా అప్పులు!

‘‘ఇలా వదిలేస్తే ప్రజలు తాగే మద్యం కార్పొరేషన్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని చూపి కూడా అప్పులు తెచ్చే పరిస్థితులు వస్తాయి. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్, ఇతర ఫండ్స్‌ను కూడా ప్రభుత్వమే తీసుకుంటోంది. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్ ఉండటంతో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆఖరికి పంచాయతీల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించింది’’ అని విమర్శలు గుప్పించారు.

‘‘తెచ్చిన అసలు, ఇప్పుడు వాటికి వడ్డీలు కూడా కలుపుకుంటే అంతా తడిసి మోపెడైంది. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత అంతకుముందు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన మొత్తాలను సీఎంఎఫ్‌ఎస్‌లకు అప్‌లోడ్ చేస్తూ వాటిని క్రమంలో చెల్లించకుండా నచ్చిన వారికి మొదట లెక్క చెల్లిస్తున్నారు. ఇది అందరికి దృష్టికి వచ్చింది. ఎన్నికల సమయంలో ఆపధర్మ ప్రభుత్వంగా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేయడం సమంజసం కాదు’’ అని ఆమె వివరించారు.

ఆ వివరాలపై అవగాహన కల్పించాలి

మొత్తం అవుట్ స్టాండింగ్ RBI లిస్టు ప్రకారం తెచ్చిన అప్పులు.

కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల మొత్తం (కార్పొరేషన్ల వారీగా)

కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు మొత్తం.

రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు మొత్తం

రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు మొత్తం

ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్స్ వివరాలు

ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రావిడెంట్ ఫండ్స్ నుండి మరియు ఆర్థిక సంస్థల నుండి తెచ్చిన అప్పుల వివరాలు

ప్రభుత్వ ఉద్యోగులకు TA,DA బకాయిలు ఎంత ఉన్నవి

ప్రతి సంవత్సరం రీపేమెంట్ కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టవలసి ఉంది

సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్కు, డిస్కం లకు, పవర్ సప్లయర్స్ లకు చెల్లించవలసిన బకాయిలు ఎంత ఉన్నవి .

ఈ సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకాలకు

నిధులు రిలీజ్ చేయవలసి ఉన్నప్పటికీ, అతికొద్ది మాత్రమే ఇచ్చి మొత్తం రిలీజ్ చేసినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు

బట్టన్ నొక్కిన వారికి కూడా పాక్షికంగా చెల్లించిన విధానం

ఈ విధంగా ఈ సంవత్సరం సంక్షేమ పథకాలకు ఎంత నిధులు చెల్లించవలసి ఉన్నది.

రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని కేసులు ఉన్నవి .

కోర్టులు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలుపరచకుండా కంటెంప్ట్ కేసులు ఎన్ని ఉన్నవి.

ఈ అంశాలకు సంబంధించిన వివరాలను తెప్పించి వాటిపై తమకు అవగాహన కల్పించాలని గవర్నర్‌ను కోరినట్లు పురందేశ్వరి చెప్పారు.

Tags:    

Similar News