అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నారు. ఈ పార్క్ ఏమిటి? ఎలా పనిచేస్తుంది?;
క్వాంటమ్ వ్యాలీ పార్క్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిత ఒక అత్యాధునిక సాంకేతిక కేంద్రం. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రూపొందించిన ఒక అభివృద్ధి ప్రాజెక్టు. ఈ పార్క్ భారతదేశంలో క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉండటానికి ఏపీని ఈ రంగంలో అంతర్జాతీయ హబ్ గా మార్చడానికి ఉద్దేశించారు. ఈ మేరకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటుకు బుధవారం ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పార్క్ పనులు ౨౦౨౬ జనవరి నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వంతో IBM, TCS, L&ట్ సంస్థలు ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకున్నాయి.
క్వాంటమ్ వ్యాలీ పార్క్ లో ఏముంటాయి?
ఐబీఎం క్వాంటమ్ సిస్టం 2: దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్, 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ తో కూడిన ‘క్వాంటమ్ సిస్టం 2’ ఈ పార్క్ లో ఏర్పాటు చేస్తారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ కు కీలకమైన సౌకర్యం. 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ అనేది ఐబీఎం (IBM) అభివృద్ధి చేసిన ఒక అత్యాధునిక క్వాంటమ్ ప్రాసెసర్, దీనిని క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం రూపొందించారు. ఇది 156 క్వాంటమ్ బిట్ లు (క్యూబిట్ లు) కలిగి ఉంది. ఇవి సాంప్రదాయ కంప్యూటర్లలోని బిట్ లకు భిన్నంగా, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్ మెంట్ వంటి క్వాంటమ్ మెకానిక్స్ లక్షణాలను ఉపయోగించి సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి. ఈ ప్రాసెసర్ ను ఐబీఎం క్వాంటమ్ సిస్టం 2లో ఉపయోగిస్తారు. ఇది ఐబీఎం అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ గా పరిగణిస్తారు.
క్యూబిట్ సంఖ్య: 156 క్యూబిట్ లు, ఇది ఐబీఎం గతంలోని 127-క్యూబిట్ ఈగిల్ ప్రాసెసర్ కంటే అధికం. ఈ అదనపు క్యూబిట్ లు ఎక్కువ సమాంతర గణనలను అనుమతిస్తాయి. ఇది సంక్లిష్ట క్వాంటమ్ సర్క్యూట్ లను అమలు చేయడానికి సహాయపడుతుంది.
ట్యూనబుల్ కప్లర్ ఆర్కిటెక్చర్: హెరాన్ ప్రాసెసర్ ట్యూనబుల్ కప్లర్ లను ఉపయోగిస్తుంది. ఇవి క్యూబిట్ ల మధ్య అనవసరమైన జోక్యం (క్రాస్ టాక్)ను తగ్గిస్తాయి. దీనివల్ల గణనలలో లోపాలు (ఎర్రర్ రేట్) పూర్తిగా తగ్గుతాయి. ఈగిల్ ప్రాసెసర్ తో పోలిస్తే హెరాన్ లోపాలలో 3-5 రెట్లు తక్కువ ఉందని ఐబీఎం పేర్కొంది.
స్థాయి సిస్టమ్ మిటిగేషన్: హెరాన్ r2 వెర్షన్ లో కొత్తగా పరిచయం చేసిన ఈ ఫీచర్, క్యూబిట్ ల చుట్టూ ఉన్న మెటీరియల్స్ తో సంఘర్షణ వల్ల కలిగే శబ్దం (నాయిస్)ను తగ్గిస్తుంది. దీనివల్ల సమయం, స్థిరత్వం కలిసొస్తాయి.
రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్స్: క్వాంటమ్ కంప్యూటింగ్, AI సంబంధిత సాంకేతికతలపై పరిశోధనలు చేయడానికి అధునాతన పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
ఇంక్ బేషిన్ సెంటర్స్: స్టార్టప్ లు, టెక్ కంపెనీలకు సహకారం అందించేందుకు ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇవి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి.
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్: క్వాంటమ్ కంప్యూటింగ్, AI రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడానికి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
పారిశ్రామిక సహకారం: ఐబీఎం వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో పాటు, స్థానిక, గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో సహకారం ద్వారా ఉత్పత్తుల తయారీ, అభివృద్ధి జరుగుతుంది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్: అధునాతన ల్యాబ్ లు, డేటా సెంటర్స్, టెక్ కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఈ పార్క్ లో భాగంగా ఉంటాయి.
చంద్రబాబు అభివృద్ధి ప్రణాళిక
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాంటమ్ వ్యాలీ పార్క్ ను, అమరావతిని ఒక గ్లోబల్ టెక్ హబ్ గా మార్చే దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఆయన అభివృద్ధి ప్రణాళికలో కీలక అంశాలు.
గ్లోబల్ టెక్ హబ్ గా అమరావతి: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, హైదరాబాద్ లోని సైబర్ సిటీలాగా, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఒక టెక్నాలజీ హబ్ గా రూపొందించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్వాంటమ్ కంప్యూటింగ్, AI పై దృష్టి: భవిష్యత్ సాంకేతికతలైన క్వాంటమ్ కంప్యూటింగ్, AI రంగాలలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రంగాలు ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని ఆయన భావిస్తున్నారు.
పారిశ్రామికవేత్తల సహకారం: ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీకి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. CII ప్లీనరీ సమావేశంలో ఆయన సమాధానాలు పారిశ్రామిక వేత్తల నుంచి స్టాండింగ్ ఓవేషన్ ను రాబట్టాయి.
స్కిల్ డెవలప్ మెంట్: యువతకు క్వాంటమ్ కంప్యూటింగ్, AI రంగాలలో నైపుణ్యం కల్పించే శిక్షణ ఇవ్వటం, ఈ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం.
అంతర్జాతీయ సహకారం: ఐబీఎం వంటి అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా అధునాతన సాంకేతికతలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడం.
ఆర్థిక వృద్ధి, ఉపాధి: ఈ పార్క్ ద్వారా భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించడం, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచడం ఆయన లక్ష్యం.
క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే...?
క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించి సమాచారాన్ని ప్రాసెస్ చేసే ఒక అధునాతన కంప్యూటింగ్ విధానం. సాంప్రదాయ కంప్యూటర్ల బిట్ లను (0 లేదా 1) ఉపయోగిస్తాయి. అయితే క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్ లను (quantum bits) ఉపయోగిస్తాయి. ఇవి క్వాంటమ్ లక్షణాలైన సూపర్ పొజిషన్, ఎంటాంగిల్ మెంట్, ఇంటర్ ఫెరెన్స్ ను ఉపయోగించి సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి.
క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రయోజనాలు
వేగం: సాంప్రదాయ కంప్యూటర్లకు సాధ్యం కాని సంక్లిష్ట సమస్యలను (ఉదా. పెద్ద సంఖ్యల కొరకు ఫ్యాక్టరైజేషన్, ఆప్టిమైజేషన్ సమస్యలు) వేగంగా పరిష్కరించగలదు.
క్రిప్టోగ్రఫీ: సురక్షిత ఎన్ క్రిప్షన్ విధానాలను అభివృద్ధి చేస్తుంది. డేటాను సురక్షితంగా రక్షించే సాంకేతికత. ఇది సమాచారాన్ని అర్థం చేసుకోలేని రూపంలోకి మార్చడం (ఎన్ క్రిప్షన్), అవసరమైన వ్యక్తులు మాత్రమే దాన్ని తిరిగి అర్థం చేసుకునేలా (డీక్రిప్షన్) చేయడం ద్వారా పనిచేస్తుంది. ఇది సమాచార గోప్యత, సమగ్రత, ప్రమాణీకరణను నిర్ధారిస్తుంది. ఉదాహరణకు, ఆన్ లైన్ లావాదేవీలు, సురక్షిత సందేశాలు, డిజిటల్ సంతకాలు వంటివి క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తాయి.
డ్రగ్ డిస్కవరీ: అణువుల సంఘర్షణలను సిమ్యులేట్ చేయడం ద్వారా కొత్త ఔషధాల అభివృద్ధి చేస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ లను వేగవంతం చేయడం.
ఆర్థిక రంగం: పోర్ట్ ఫోలియో ఆప్టిమైజేషన్, రిస్క్ అనాలిసిస్ చేస్తుంది.
మెటీరియల్ సైన్స్: (Material Science) కొత్త పదార్థాల రూపకల్పన జరుగుతుంది. పదార్థాల లక్షణాలు, నిర్మాణం, సంశ్లేషణ, అనువర్తనాలను అధ్యయనం చేసే శాస్త్రీయ రంగం. ఇది రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ లను సమన్వయం చేస్తూ, లోహాలు, పాలిమర్లు, సెరామిక్స్, సెమీకండక్టర్లు, కాంపోజిట్ ల వంటి వివిధ పదార్థాల గుణాలను అర్థం చేసుకొని మెరుగుపరచడం, కొత్త పదార్థాలను రూపొందించడంపై దృష్టి సారిస్తుంది.
పరిమితులు
సాంకేతిక సవాళ్లు: క్వాంటమ్ కంప్యూటర్లు అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పనిచేయాలి, క్యూబిట్ లు సులభంగా డీకోహెరెన్స్ కు గురవుతాయి. (అంటే బాహ్య జోక్యం వల్ల సమాచారం కోల్పోతాయి).
ఖర్చు: క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ, నిర్వహణ ఖర్చు ఎక్కువ.
ప్రారంభ దశ: క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో వాణిజ్యపరంగా అందుబాటులో లేదు. పరిశోధన దశలోనే ఉంది.
క్వాంటమ్ కంప్యూటింగ్ సాంప్రదాయ కంప్యూటింగ్ తో పోలిస్తే విప్లవాత్మకమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుంది. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. దీని పూర్తి సామర్థ్యాన్ని అన్ లాక్ చేయడానికి ఇంకా చాలా పరిశోధన, సాంకేతిక పురోగతి అవసరం. క్వాంటమ్ వ్యాలీ పార్క్ వంటి ప్రాజెక్టులు ఈ రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడతాయి.
క్వాంటమ్ మంచి ఫలితాలను ఇస్తుంది: ఫ్రొఫెసర్ బాలాజీ
ఏపీలోని అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేయాలనుకోవడం మంచి పరిణామ మని నాగార్జున విశ్వ విద్యాలయం డిపార్ట్ మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హెచ్వోడీ డాక్టర్ వి బాలాజీ అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రస్తుతం ఏఈ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఏ విధంగా పనిచేస్తుందో అంతకంటే గొప్పగా క్వాంటమ్ టెక్నాలజీ పనిచేస్తుందన్నారు. అతి సూక్ష్మమైన చిప్ లు ఇందులో వస్తాయన్నారు. కావాల్సిన డేటాను తీసుకుని పరిశీలించి అందులో ఒరిజినల్ ను వేరు చేసేందుకు క్వాంటమ్ ఉపయోగ పడుతుందని చెప్పారు. ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్లు తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు ద్వారా ఎంతో మంది నిష్నాతులైన కంప్యూటర్ ఇంజనీర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. క్వాంటమ్ టెక్నాలజీని మల్టిపుల్ గా ఉపయోగించుకోవచ్చన్నారు.