రాయలసీమ ఉద్యమనేత దశరథ రామిరెడ్డి అరెస్ట్

రాయలసీమ ఉద్యమకారుడు, సీమకు సాగునీరు ఇవ్వాలని పోరాడుతున్న దశరథ రామిరెడ్డిని నంద్యాలలో పోలీసులు కారణం చెప్పకుండా అరెస్ట్ చేశారు.

Update: 2024-01-02 08:30 GMT
బొజ్జా దశరథ రామిరెడ్డి ని అరెస్ట్ చేసి పోలీస్ జీపులో నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు

రాయలసీమ ఉద్యమనేత, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో నంద్యాల సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

రాయలసీమకు సాగునీటిని ఇవ్వాలని ఆయన చాలాకాలంగా పోరాడుతున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ‘సిద్దేశ్వరం అలుగు’ ఏర్పాటు చేసి రాయలసీమకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. అయితే పాలకులు పట్టించుకోకపోవడంతో రాయలసీమ ప్రజలను సమీకరించిన దశరథ రామిరెడ్డి 2016లో సిద్దేశ్వరం వరకు పాదయాత్ర చేసి ప్రజా శంకుస్థాపన చేశారు.

ప్రతి ఏటా అక్కడే వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే సిద్దేశ్వరం పాదయాత్ర నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ దశరథరామిరెడ్డి అక్కడికి వెళ్లడంతో పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఈ కేసుపైనే దశరథ రామిరెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేసి ఉండోచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనను ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆత్మకూరు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు





 


బొజ్జా దశరథరామిరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.


ఖండన

రాయలసీమ ప్రజా ఉద్యమనేత బొజ్జా దశరథరామిరెడ్డి గారి అరెస్టును రాయలసీమ సాంస్కృతిక వేదిక. తీవ్రంగా ఖండించింది.

అరెస్టులతో సిద్దేశ్వర అలుగు సాధనా ఉద్యమాన్ని అడ్డుకోలేరని ప్రజలు మరింత చైతన్యవంతులై సీమ ప్రాంత పురోగతికై కదులుతారని వేదిక నేత డాక్టర అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి అన్నారు.

బొజ్జ దశరథరామిరెడ్డి గారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



Tags:    

Similar News