ముస్లిం కోటలో.. పెద్దిరెడ్డి..!
ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నా.. ఒక్కసారి మాత్రమే ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యారు. రాయచోటిలో పెద్దారెడ్డి ప్రాభవం కొనసాగుతోంది.
(ఎస్.ఎస్.విం భాస్కర్ రావ్)
తిరుపతి: మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గం ఇది. బలిజలు కూడా అదే స్థాయిలో ఉన్నారు. నియోజకవర్గంలో పెత్తనం మాత్రం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉంది. దశాబ్దాల చరిత్రలో ఒక్కసారి మాత్రమే ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓటర్లపరంగా ముస్లిం- బలిజ సామాజిక వర్గానికి కోట. ఆ వర్గాలన్నీ చీలికలుగా వేరువేరు పార్టీలో ఉన్నాయి. ఇది కాస్తా.. రెడ్డి సామాజిక వర్గానికి కలిసివస్తోంది. పదవుల పగ్గాలు చేతుల్లోకి తీసుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ స్థానంలో సాగుతున్న చరిత్ర ఇది.
నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. 20 ఏళ్ల తర్వాత పసుపు దళం పాగా వేయాలని భావించింది. అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన ప్రయోగం వల్ల బలిజ సామాజిక వర్గ నేతకు అభ్యర్థిత్వం చేజారింది. అదే పార్టీ నుంచి తనకు టికెట్ ఖాయమనుకున్న రెడ్డి సామాజిక వర్గం నాయకుడూ భంగపడ్డారు. ఈ పరిస్థితి ఎలా మారిందంటే.. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏకాకిగా మిగిలిపోయే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగవాసి పాలకొండ రాయుడు, గడికోట ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ రెడ్డి సహకారం ఉంటే మినహా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గట్టెక్కే వాతావరణం లేదని పరిస్థితి కనిపిస్తోంది.
ముస్లిం కోట..
రాయచోటి నియోజకవర్గం విస్తరించిన సంబేపల్లి, చిన్నమండెం, రాయచోటి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో 2,31,637 మంది ఓటర్లు ఉన్నారు. కులాల వారీగా పరిశీలిస్తే నియోజకవర్గంలో అత్యధికంగా 60 వేల మంది వరకు ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. బలిజ సామాజిక వర్గం నుంచి 35 వేలకు పైగానే హోటల్లో ఉన్నారు. వీరితోపాటు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 30 నుంచి 40 వేల మంది ఉంటారని అంచనా. బీసీలు, రాజులు, ఆర్యవైశ్యులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓటర్లు ఉంటారు. ఈ నియోజకవర్గంలో 25 నుంచి 30 వేల మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఉంటారని ఓ అంచనా.
ఒక్కసారి మైనారిటీ...
రాయచోటి నియోజకవర్గంలో 1952 నుంచి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సంవత్సరం వై ఆదినారాయణ రెడ్డి నుంచి ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేల ప్రభావం ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన 17 ఎన్నికల్లో ఒకే ఒక్కసారి 1972లో ఎస్. హబీబుల్లా మాత్రమే రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ఎవరికి అవకాశం దక్కలేదు.
కాంగ్రెస్ హవాకు బీటలు..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగవాసి పాలకొండ రాయుడు టీడీపీ నుంచి ఎంట్రీతో కాంగ్రెస్ ప్రభావానికి బీటలు వారాయి. రాయచోటి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుగవాసి పాలకొండ రాయుడు 1999లో టీడీపీ అభ్యర్థిగా 51,026, 2004లో 51,044 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1989 నుంచి 1994 వరకు జరిగిన మూడు ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
గడికోట శ్రీకాంత్ ఎంట్రీతో..
రాయచోటి నియోజకవర్గం నుంచి 2009లో గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇక్కడ రాజకీయం పూర్తిగా మారిపోయింది. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గడికోట శ్రీకాంత్ రెడ్డి 2014, 2019 వరుస విజయాలతో టీడీపీ ప్రభావానికి దెబ్బ కొట్టారు. దీనికి కాస్త లింక్ ఉంది.
రాయచోటిలో కలసిరాని "లక్కీ"
లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి తండ్రి రాజగోపాల్ రెడ్డి అందించిన రాజకీయ వారసత్వంతో ఆయన కుమారుడు ఆర్ రమేష్ రెడ్డి 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగులో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గంలోకి విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసిన రమేష్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత.. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన రమేష్ రెడ్డి వరుస ఓటములు చవిచూశారు.
ఇప్పుడేమైంది అంటే...
2004 సార్వత్రిక ఎన్నికలకు రాయచోటి నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలంగా మారాయిని భావించారు. అభ్యర్థిత్వం తనకే అని రమేష్ రెడ్డి ధీమాతో ఉన్నారు. రమేష్ రెడ్డికి రాయచోటి టికెట్ దక్కితే, బలిజ సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి మాజీ ఎమ్మెల్యే సుగువాసి పాలకొండ రాయుడు కుమారుడు బాలసుబ్రమణ్యం.. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వని విధంగా వారి అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో రాయచోటిలో రమేష్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు.
" తన 25 ఏళ్ల రాజకీయ జీవితానికి పాతర వేశారు" ఆర్ రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈయన ప్రస్తుతం వైఎస్సార్సీపీలోకి వెళ్లే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. బలిజ సామాజిక వర్గం ఓట్లు చెదిరిపోకుండా మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు కుమారుడు సువాగసి బాలసుబ్రమణ్యంను రాజంపేట అసెంబ్లీ స్థానానికి బదిలీ చేస్తూ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇక్కడ టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయలు మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సుగువాసి బాలసుబ్రమణ్యం రాజంపేటలో ఏ మేరకు ఆదరిస్తారు అనేది వేచి చూడాలి.
హామీ తీసుకుని చేరి..
"కాంగ్రెస్ పార్టీ నుంచి రావాలంటే, టికెట్‌పై హామీ ఇవ్వాలి" అనే కండిషన్‌పైనే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. టీడీపీలో చేరారు. అనుకున్న సమయం రానే వచ్చింది. టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు రాయచోటి అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఖరారు చేశారు. ఈయనకు రాయచోటి నియోజకవర్గంలో స్థానం స్థిరపడాలి అంటే, టీడీపీ పట్టు సాధించాలంటే.. సుగవాసి కుటుంబంతో పాటు మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఆర్ రమేష్ రెడ్డి అందించే సహకారం పైనే టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
బలమైన నాయకులు ఉన్నా..
మండిపల్లి ఒంటరేనా..?!
రాయచోటిలో టీడీపీకి బలమైన నాయకత్వం, బ్యాంకు ఉంది. అవన్నీ కాదనిపించి, టికెట్ దక్కించుకున్న టిడిపి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఎంతటి సహకారం ఉంటుందనేది ప్రస్తుత చర్చ. టీడీపీ అధినాయకత్వం అనుమతించినందుకు వల్ల మాజీ ఎమ్మెల్యే సుగవాసి వారసులు బాలసుబ్రమణ్యం, మరో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, ఇంకో మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి సోదరులు తోడుగా ఉంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఢీకొనవచ్చునే రాంప్రసాద్ రెడ్డి ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. రమేష్ రెడ్డి సోదరులు సైలెంట్‌గా ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనకు ముందు రోజే లక్కిరెడ్డిపల్లి సర్కిల్లో టీడీపీ ప్రచార సామాగ్రిని వారి అనుచరులు దహనం చేశారు. టీడీపీ కార్యాలయం దరిదాపులకు కూడా వెళ్లడం లేదని సమాచారం. అభ్యర్థిత్వంలో తన పేరు ఊసు కూడా లేని స్థితిలో అప్పటివరకు కార్యాలయం ప్రారంభించిన అనుచరులకు విందులు కూడా ఏర్పాటు చేసిన గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఎక్కడ ఉండేది కూడా తెలియడం లేదు అంటున్నారు.
మండిపల్లికి కలసిరాని అదృష్టం!
2012లో జరిగిన ఉప ఎన్నికల్లో పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, 34.037 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 25,344 సాధించుకున్నారు. ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించారు.
అదే కారణమా..?
రాయచోటిలో 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు సుగవాసి కుటుంబానికి కాకుండా ఆర్ రమేష్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. దీనివెనక బలమైన కారణమే ఉందని రాయచోటి ప్రాంతంలో ఉన్న ఒక చర్చ. 2012 ఉప ఎన్నికల్లో రాయచోటిలో జరిగిన బహిరంగ సభకు టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు రావడం, ఆ వేదికపై సుగవాసి పాలకొండ రాయుడు "నేను వైఎస్ కుటుంబాన్ని విమర్శించలేను" అని చెప్పడం వల్లే
అప్పట్లో ప్రాధాన్యత తగ్గించారని వ్యాఖ్యానాలు ఉన్నాయి. గత ఎన్నికలకు రెండు నెలల ముందు విజయాన్ని ఆకాంక్షించే సుగవాసి బాలసుబ్రమణ్యం కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబుకు టీటీడీ పాలకమండలి సభ్యత్వం కల్పించారని వ్యవహారం కూడా ప్రస్తావించదగిన విషయం. ఇదిలా ఉండగా బలమైన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలను కాదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాయచోటి అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, ఎన్ని ప్రతికూలతల మధ్య టీడీపీ అభ్యర్థి మనవడా ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. వర్గాలకు అతీతంగా నాయకులు సహకారం అందిస్తే మినహా ఇక్కడ పరిస్థితులు అనుకూలించవని భావిస్తున్నారు.