తిరుమల లడ్డూ పై ఆంక్షలు ఎత్తివేయాలి: కందారపు మురళి

తిరుమల లడ్డూలపై ఆంక్షలు ఎత్తివేయాలని టిటిడి ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

Update: 2024-09-02 13:58 GMT

తిరుమల లడ్డూలపై ఆంక్షలు ఎత్తివేయాలని టిటిడి ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. టీటీడీ ఈఓ శ్యామలరావు అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరిలు తిరుమల లడ్డూపై ఆంక్షలు విధిస్తూ చేసిన ప్రకటన అర్థం లేనిదని, తక్షణం ఈ ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

తిరుమల ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందని, కరోనా తర్వాత లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారని అనేకమంది దర్శనం కాకుండానే అఖిలాండం వద్ద మొక్కు తీర్చుకొని వెనక్కు వెళుతూ, లడ్డు ప్రసాదాన్ని తమ వెంట తీసుకుని వెళ్లి బంధువులకు, స్నేహితులకు పంచి పెడుతున్నారని ఇటీవల ఇదో ఆచారంగా మారిందని గుర్తు చేశారు.

ఎవరో పెళ్లిలో లడ్డూలను పంచిపెట్టారని, ఆకారణంగా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ విధానం తీసుకువచ్చామని చెప్పటం అర్ధరహితమైందని ఆయన ఆ ప్రకటనలో విమర్శించారు. పెద్ద సంఖ్యలో లడ్డూల కొనుగోలును నియంత్రించడానికి విధివిధానాలు రూపొందించాలి మినహా ఆధార్ కార్డుకు రెండు లడ్డులే అని పరిమితి విధించడం సమంజసం కాదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రస్తుతం లడ్డూ తయారీకి రూ.38 లు ఖర్చవుతున్నదని ఆమేరకు చూసినా ఒక్కో లడ్డుపై టీటీడీకి 12 రూపాయలు లాభం చేకూరుతుందని అన్నారు. వాస్తవంగా దళారుల తీవ్రత పెరుగుతున్నది దర్శనాల వద్ద, రూముల కేటాయింపు వద్ద అనే విషయాన్ని మరిచి ఏ దళారీ గొడవలులేని లడ్డూలకు రేషన్ పెట్టారని, దర్శనాల్ని క్రమబద్ధీకరించే విషయం మరిచారని తీవ్రంగా విమర్శించారు.

సాధారణ ప్రజానీకానికి లడ్డూల్ని దూరం చేయడం అంటే బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహించడమేనని ఆయన ఆ ప్రకటన విమర్శించారు. వీఐపీలకి, రాజకీయ నాయకులకి పెద్ద సంఖ్యలో లడ్డూలు తీసుకు వెళుతున్న పద్ధతిని మార్చగలరా? అని ఆయన ప్రశ్నించారు. సామాన్యులకి ఓ రూలు పెద్దలకు మరో రూలా? అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణం టిటిడి యాజమాన్యం రేషనింగ్ వైఖరి విడనాడాలని కోరారు. కందారపు మురళి టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు, తిరుపతి.

Tags:    

Similar News