సీఆర్‌డీఏపై గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు

అమరావతిలోని సీఆర్‌డీఏ ప్రాంతంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నేటి నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నాయి.

Update: 2024-08-03 04:28 GMT

ఆం్ర«దప్రదేశ్‌ రాజధాని ప్రాంతమైన అమరావతిలోని సీఆర్‌డీఏపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ వెనక్కు తీసుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. 2015–16లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయాలైతే అమలు చేసేసిందో అవే నిర్ణయాలు తిరిగి నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పలు సంస్థలకు ఇచ్చిన స్థలాల్లో తిరిగి వారు పరిపాలనా భవనాలు నిర్మించుకునేందుకు వారిని ఈ ప్రభుత్వం ఆహ్వానించింది.

సీఆర్‌డీఏలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌
ముందుగా సిఆర్‌డిఏలో ఉద్యోగుల భర్తిని చేపట్టనుంది. గతంలో 778 మంది ఉద్యోగులు, అధికారులు ఉండగా వారిలో ప్రస్తుతం 249 మాత్రమే ఉన్నారు. మిగిలిన వారిని తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కొన్ని కేటగిరీలకు ఇప్పటికే సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కన్సల్‌టెంట్లుగా పనిచేసే వారు గతంలో 47 మంది ఉన్నారు. ప్రస్తుతం 15 మంది కన్సల్‌టెంట్లు ఉండగా వారి పనులు కూడా పూర్తి కావొచ్చాయి. మిగిలిన 32 మందిని తీసుకునేందుకు సీఆర్‌డిఏ నిర్ణయించింది.
మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే సిఆర్‌డీఏ పరిధి
క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డిఏ) ఏర్పడినప్పుడు 8,352.69 చదరపు కిలో మీటర్ల పరిధిని నిర్ణయించారు. గత ప్రభుత్వం 6,993.24 చదరపు కిలో మీటర్లకు కుదించింది. ప్రస్తుత ప్రభుత్వం గతంలో ఉన్న పరిధి సీఆర్‌డీఏలో ఉంటుందని తేల్చింది. సిఆర్‌డీఏలో ఉన్న కొంత భాగాన్ని తగ్గించి మిగిలిన భాగాన్ని పల్నాడు, బాపట్ల డెవలప్‌మెంట్‌ అథారిటీలుగా గత ప్రభుత్వం మార్చింది. ఈ అథారిటీలను అలాగే ఉంచి అందులో సీఆర్‌డీఏ నుంచి చేర్చిన భూ భాగాన్ని తిరిగి సీఆర్‌డీఏలో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కోర్‌ క్యాపిటల్‌ సిటీ పరిధిని 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 217 చదరపు కిలో మీటర్లుగా నిర్థారించింది. మాస్టర్‌ ప్లాన్‌లోనూ ఇవే కొలతలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కోర్‌ క్యాపిటల్‌ పరిధిలో 54 చదరపు కిలో మీటర్లు ఉండే నాలుగు గ్రామాలను మంగళగిరి మునిసిపాలిటీ పరిధిలో కలిపింది. తిరిగి ఈ 54 చదరపు కిలో మీటర్ల పరిధిని కోర్‌ క్యాపిటల్‌ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోర్‌ క్యాపిటల్‌ నిర్మాణంలో సింగపూర్‌ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ సింగపూర్‌ వారిని అమరావతి నిర్మాణంలో పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు సింగపూర్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలు పెట్టింది.
నాలుగు లైన్లుగా కరకట్ట నిర్మాణం
ప్రకాశం బ్యారేజీ సమీపం నుంచి క్యాపిటల్‌ సిటీ ఎంత దూరం ఉంటే అంతవరకు కృష్ణా నది పరివాహక ప్రాంతం వెంబడి నిర్మించిన కరకట్టను నాలుగు లైన్ల రహదారిగా మార్చనున్నారు. ఇందుకు టెండర్లు కూడా పిలవనున్నారు. గత ప్రభుత్వం రెండు లైన్ల రహదారికి నిధులు కూడా మంజూరు చేసింది. ఆ పనులను రద్దు చేసి గతంలో నాలుగు లైన్ల రహదారి, మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
కోర్‌ క్యాపిటల్‌ను జాతీయ రహదారికి అనుసంధానం
217చదరపు కిలో మీర్లు విస్తీర్ణంలో ఉన్న కోర్‌ క్యాపిటల్‌ సిటీలో తూర్పు నుంచి పడమర వైపుకు ఒక రహదారి గ్రిడ్‌ను ఏర్పాటు చేసి దానిని చైన్నై–కోల్‌కత్త జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. ఈ రహదారి గ్రిడ్‌కు అనుసంధానంగా ప్రతి కిలో మీటరుకు ఉండే రోడ్లలో 5, 11, 13, 15 నెంబర్‌ రోడ్లు జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇన్నర్, ఔటర్‌ రింగ్‌ రోడ్లు, వెస్ట్రన్‌ బైపాస్‌ రోడ్లు రాబోతున్నాయి. ఇప్పటికే చేపట్టిన ఈస్ట్రన్‌ బైపాస్‌ రోడ్డు పూర్తయిన వెంటనే ఈ రోడ్లను అనుసంధానం చేస్తూ కృష్ణానదిపై ఆరు ఐకానిక్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
సంస్థల కోసం స్థలాలు తీసుకున్న వారికి ఆహ్వానం..
రాజధాని ప్రాంతంలో ఇప్పటికే పలు సంస్థలకు భూములు కేటాయించి ఉన్నాయి. అయితే వాటిలో ఆయా సంస్థలు తమ కార్యాలయాలు నిర్మించుకునేందుకు గత ప్రభుత్వం సహకరించకపోవడంతో అలాగే వదిలేశారు. ఈ ప్రభుత్వం అటువంటి వారికి మరో రెండేళ్లలో కార్యాలయాల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 130 సంస్థలకు భూములు కేటాయించారు. ఈ సంస్థలు ఇప్పుడు వస్తాయా? రావా? అనే విషయం తెలుసుకునే పనిలో సీఆర్‌డీఏ వారు ఉన్నారు. వారితో సంప్రదింపులు మొదలు పెట్టారు. ఈ మేరకు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి నారాయణ ఆయా సంస్థల అధినేతలతో మాట్లాడుతున్నారు. బిట్స్‌పిలానీ సంస్థను కూడా రాజధాని ప్రాంతానికి తీసుకొస్తున్నామని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి పి నారాయణ చెప్పారు.
కట్టడాల సామర్థ్యాన్ని పరిశీలించిన ఐఐటీ నిపుణులు
ప్రస్తుతం అమరావతిలో నిలిచిపోయిన కట్టడాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు హైదరాబాద్, చెన్నై ఐఐటీ నిపుణులకు ప్రభుత్వం అప్పగించింది. శుక్రవారం హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల కమిటీ అమరావతిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎన్‌జీవోలు, నాలుగో తరగతి నివాస సముదాయాలను పరిశీలించారు. వాటి స్థితి గతులపై నివేదికను ముఖ్యమంత్రికి అందించారు. శనివారం చెన్నై ఐఐటీ నిపుణులు అమరావతిలో పర్యటించి అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఐదు టవర్ల నిర్మాణాలను పరిశీలిస్తారు. వాటి సామర్థ్యం ఏవిధంగా ఉందో పరిశీలించిన తరువాత వచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. ఈ నిర్మాణాలను కొనసాగించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. అయితే నీళ్లు శంకులో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్లు నిపుణుల కమిటీ నివేదికలు తీసుకుంటోంది.
సీఆర్‌డిఏ పరిధిలో వివిధ రకాల నిర్మాణాల గురించి ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబునాయుడు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి పి నారాయణ, ఉన్నతాధికారులు పలు మార్లు సమావేశాలు నిర్వహించారు. చర్చలు కూడా జరిపారు. అమలు చేయాల్సిన అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకటీ రెండు రోజుల్లో గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు చేస్తూ మొదట రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసే విధంగా అన్ని రకాల ఆదేశాలు వెలువడనున్నాయి. ఇప్పటికే కొన్ని అంశాలపై ఆదేశాలు వెలువడ్డాయి. మిగిలిన అంశాలపై కూడా ఆదేశాలు జారీ కానున్నాయి. సీఆర్‌డీఏకు పూర్వపు కళ రానుంది.
Tags:    

Similar News