RK ROJA | నగరిలో 'గాలి'కి అడ్డుకట్ట వేసిన రోజా

నగరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎత్తుగడకు చెక్ పడింది. నగరి ఎమ్మెల్యే తమ్ముడు వైసీపీలో చేరికకు బ్రేక్ వేయించిన రోజా పైచేయి సాధించినట్టే కనిపిస్తోంది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-12 04:33 GMT

చిత్తూరు జిల్లా నగరి కేంద్రంగా ఏర్పడిన రాజకీయ సునామిని మాజీ మంత్రి ఆర్కే. రోజా అడ్డుకట్ట వేశారు. రోజా ప్రత్యర్థి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండో కొడుకు గాలి జగదీష్ వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ముద్దుకృష్ణమ పెద్దకొడుకు గాలి భానుప్రకాష్ నగరి ఎమ్మెల్యేగా గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి రోజాపై ఆయన విజయం సాధించారు. నిర్ణీత కార్యక్రమం మేరకు గాలి జగదీష్ బుధవారం వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషించారనేది రాజకీయవర్గాల్లో చర్చ. చివరి నిమిషంలో గాలి జగదీష్ ను పార్టీలోకి రానివ్వకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి వేసిన ఎత్తుకు రోజా చెక్ పెట్టినట్టు కనిపిస్తోంది.

నగరిలో రోజా వల్ల వర్గపోరు పెరగడం, సీనియర్లు పార్టీని వీడడంతో గడ్డు పరిస్థితి ఏర్పడింది. అంతకంటే ముందే జిల్లాలోని వైసీపీ పెద్దలతో సఖ్యత లేకపోవడం కూడా రోజాకు ఇక్కట్లు ఎదురైనట్లు చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో
వైసీపీ అధినేత వైఎస్. జగన్ అధికారం కోల్పోయిన తరువాత 2.0 ఫార్ములాతో పార్టీని పరిపుష్టి చేసుకునే పనిలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీపై దృష్టి సారించారు. ఆ బాధ్యతలు మాజీ మంత్రి, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారనేది పార్టీ వర్గాల సమాచారం. పదవుల కోసం "గాలి కుంటుంబం"లో అన్నదమ్ముల మధ్య పోటీ, కుటుంబ కలహాలను సొమ్ము చేసుకునే దిశగా.. నగరి నుంచి గాలి భానుప్రకాష్ ను వైసీపీ తెరమీదకు తీసుకుని రావడంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషించారనేది సమాచారం.
వ్యూహం ఇది
టీడీపీ మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కొడుకు గాలి భానుప్రకాష్ ను పార్టీలోకి తీసుకుని రావడం ద్వారా తమ పట్టు నిలుపుకోవాలనేది వైసీపీలో సీనియర్ నేతల మదిలో ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది. తనకు తెలియకుండా, ప్రమేయం లేకుండా గాలి జగదీష్ ను పార్టీలోకి తీసుకోవడంపై రోజా అభ్యంతరం చెప్పడమే కాకుండా, పార్టీని వీడతానని కూడా హెచ్చరించినట్లు నగరిలో ప్రచారం జరుగుతోంది. దీంతో జగదీష్ వైసీపీలో చేరడానికి అడ్డంకి ఏర్పడింది. అని చెప్పడం కంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. దీంతో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే. రోజా ఏకపక్ష వ్యవహారాలకు ఫులుస్టాప్ పెట్టాలనే ఆ పార్టీ జిల్లా పెద్ద నేతల లక్ష్యానికి గండి పడినట్లు కనిపిస్తోంది.
కుటుంబ గొడవ
2018 ఫిబ్రవరి 7న మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణించారు. ఆ తరువాతి నుంచి ఆయన కుటుంబంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తండ్రి వారసత్వంగా తనకు పదవి ఇవ్వాలని గాలి జగదీష్ పట్టుబట్టారు. ఇందుకు తల్లి సరస్వతి కూడా మద్దతు పలికారు. అయితే, సీఎం ఎన్. చంద్రబాబు మాత్రం గాలి భానుప్రకాష్ వైపే మొగ్గు చూపారు. ఈ వ్యవహారంలో అన్నదమ్ముల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోంది. అది ఎంతకీ చల్లారే పరిస్థితి లేకుండా పోయింది. కాగా,
2019 ఎన్నికల్లో కూడా గాలి ముద్దు కృష్ణమనాయుడు పెద్ద కొడుకు భానుప్రకాష్ వైపీసీ అభ్యర్థి ఆర్.కే. రోజా చేతిలో ఓటమి చెందారు. అప్పటి నుంచి గాలి జగదీష్ తన అన్న, నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ మధ్య సఖ్యత లేకపోవడం, నగరిలో మాజీ మంత్రి ఆర్కే. రోజాపై అసంతృప్తి, అసమ్మతి వైసీపీని బాగా దెబ్బతీసిందనే విషయంలో ఆ పార్టీ జిల్లా నేతలు, వైఎస్. జగన్ కూడా మదింపు వేశారని భావిస్తున్నారు.
ఒకే దెబ్బకు...
టీడీపీలో అసమ్మతి, అసంతృప్తి వాదులను కూడా తీసుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో వైసీపీ వ్యూహం అమలు చేస్తోంది. పార్టీని బలోపేతం చేసుకుకోవచ్చు అనేది ఒకటైతే.. టీడీపీని దెబ్బతీయొచ్చు. ఈ సంకేతం ప్రజల్లోకి బలంగా పంపవచ్చు అనే వ్యూహంతోనే "గాలి కుటుంబం"లోని అంతర్గత కలహాలను సొమ్ము చేసుకునే దిశగా వ్యూహం అమలుకు తెరతీసినట్లు కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ లో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో పాటు ఇంకొందరు నేతలు కూడా తెరవెనుక మంత్రాంగం సాగించినట్లు తెలుస్తోంది. అందుకు ప్రధానంగా,
వైసీపీలో వర్గపోరు
నగరిలో వైసీపీ నుంచి రెండుసార్లు విజయం సాధించిన ఆర్కే రోజా వర్గపోరుకు ఆజ్యం పోశారు. ఈ పరిణామాలే పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవడం వల్ల గత ఎన్నికల్లో ఆమె పరాజయానికి దారితీశాయి. అంతేకాకుండా, పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న సీనియర్లతో కూడా ఆమెకు సఖ్యత లేదనేది బహిరంగ రహస్యం. ఆ విషయాలను తరచి చూస్తే..
చలనచిత్ర రంగం నుంచి మాజీ మంత్రి ఆర్కే. రోజా 2004 టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. నగరి, 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి చెందారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్కే రోజాను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని రావడంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె వైఎస్. జగన్ సారధ్యంలో ఏర్పడిన వైసీపీలో చేరారు.
అత్తెసరు మెజారిటీ
2014లో రాష్ట్ర విభజన తరువాత నగరి నుంచి పోటీ చేశారు. అంతకుముందు టీడీపీ నుంచి పోటీ చేసి, ఓటమి చెందిన ఆమెను వైసీపీ శ్రేణులు ప్రత్యర్థిగానే భావించాయి. వైఎస్ఆర్ మరణానికి ముందే ఆయనతో సన్నిహితంగా మారిన మాజీ మంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి వెంట నగరిలో కూడా వైసీపీలో చేరారు. వారందరితో రోజాకు సామారస్య వాతావరణం ఏర్పరచడంలో సీనియర్లు ప్రధానంగా పెద్దిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆరు మండలాల నేతలు కలిసి పనిచేసినా రాజకీయ దిగ్గజం, టీడీపీ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, మరో కాంగ్రెస్ మాజీ మంత్రి ఆర్. చెంగారెడ్డి కూతురు సత్యస్వరూప ఇందిరపై 858 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు.
2019 ఎన్నికల్లో రోజా విజయం సాధించిన తరువాత తన సోదరులు, భర్త ప్రమేయం ఎక్కువ కావడం, టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం. వారికే పనులు చేయించడం. వైసీపీ వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధరరెడ్డి, నగరిలో మాజీ చైర్ పర్సన్ కేజే శాంతి, కుమార్ దంపతులను పట్టించుకోకపోవడం, శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డిని ఏమాత్రం ఖాతరు చేయకపోవడం. ఇలా నగరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నేతలతో వైరం కొనితెచ్చుకున్నారనే విషయంలో విబేధాలు భగ్గుమన్నాయి. తాను నేరుగా వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ తోనే మాట్లాడతా అనేటట్లు ఆమె వ్యవహరించిన తీరువల్లే ఏకాకిగా మిగిలారనే విషయాన్ని వైసీపీని వీడిన సీనియర్లు అనేకసార్లు ఆరోపించారు. వారందరి సహకారం ఉండి కూడా 2,78 ఓట్లతో మాత్రమే గెలిచారు.
2024 ఎన్నికల నాటికి నగరిలో ఆర్కే. రోజా చేజేతులా ఆజ్యం పోసిన వర్గపోరుకు తోడు అసంతృప్తి కూడా తోడయింది. ఈ పరిస్థితుల్లో మూడోసారి విజయం సాధించి హేట్రిక్ కొట్టాలనే ఆశలకు సీనియర్లందరూ, పార్టీని వీడిన రోజే వైసీపీలో గుబులు బయలుదేరింది. అయినా పథకాలు ఆదరిస్తాయనే వారి మితిమీరిన విశ్వాసం రోజాపై రెండోసారి పోటీ చేసిన మాజీ మంత్రి గాలి ముద్దకృష్ణమ కొడుకు భానుప్రకాష్ కు ఊహించని విధంగా 45,004 ఓట్ల భారీ మెజారిటీ దక్కింది.
"నగరిలో రోజాకు మినహా స్థానిక నేతల్లో ఒకరికి టికెట్ ఇవ్వండి. లేదంటే ఆమెను ఓడించి తీరుతాం" అని టీడీపీలో చేరిన మాజీ వైసీపీ నేతలు ఆర్. చక్రపాణిరెడ్డి, మురళీధరరెడ్డి, నగరిలోని కేజే దంపతులు బహిరంగంగానే వైసీపీ అధినేతకు అల్టిమేటం ఇచ్చారు. అయిన ఫలితం లేకపోవడంతో వారు అన్నంతపని చేయడం ద్వారా తమ సత్తా చాటుకున్నారనేది నగరిలో వినిపించే మాట.
నష్టనివారణ చర్యలకు రోజా చెక్
పార్టీని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న వైసీపీ చీఫ్ జగన్ కు జిల్లాలు, నియోజకవర్గాల్లోని అసంతృప్తివాదులను దరికి చేరుకునే పథకం అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ మాజీ మంత్రి గాలి కొడుకు భానుప్రకాష్ చేరికకు మార్గం ఏర్పడింది. దీనికి పెద్దిరెడ్డి తోడ్పాటు అందించారని చెబుతున్నారు.
వైసీపీలో చేరడానికి మంగళవారం మధ్యాహ్నమే గాలి జగదీష్ విజయవాడ చేరుకున్నారు. సాయంత్రానికి అక్కడి నుంచి సందేశం అందింది. "విజయవాడకు ఎవరూ రాకండి. కార్యక్రమం వాయిదా పడింది" అనేది ఆ సందేశం సారాంశం అని నగరిలో ప్రచారం జరిగింది.
వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ వద్ద తనకు ఉన్న ప్రాధాన్యతను మాజీ మంత్రి ఆర్కే. రోజా మరోసారి నిరూపించుకున్నారు. జగదీష్ ను పార్టీలోకి రానివ్వకుండా అడ్డుకోవడం ఇది రెండోసారి అని చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల వేళ కూడా ఇదే ప్రయత్నం జరిగింది. చివరి నిమిషం వరకు దీనిని సఫలం కానివ్వకుండా, రోజా అడ్దుకట్ట వేశారని పార్టీవర్గాల ద్వారా తెలిసింది. తాజాగా మరోసారి ఇదే పరిస్థితి రిపీట్ అయ్యింది. ఈ వ్యవహారం వైసీపీలోనే జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి తెరతీసే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ రాజకీయాల్లో చక్రంతిప్పే స్థాయిలో వ్యవహారాలు సాగిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డికే ఆర్కే. రోజా చెక్ పెట్టారని భావిస్తున్నారు. దీంతో ఈ పార్టీ వ్యవహారాలు ఎలా చక్కదిద్దుతారనేది వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News