సీఎం చంద్రబాబుకు రోజా ఘాటైన కౌంటర్
ఎన్నికల తర్వాత ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు ఒకొక్కరుగా సీఎం చంద్రబాబుపైన, ఆయన ప్రభుత్వంపైన విమర్శలు ప్రారంభించారు.
విశాఖపట్నం రుషి కొండపై గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్మించిన భవనాల అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలకు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలకు మధ్య వివాదాస్పద అంశంగా మారిపోయింది. అయితే రుషి కొండపై భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు, ఎవరి కోసం నిర్మిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారనే అంశాలను గత ప్రభుత్వం గోప్యంగా ఉంచడం వల్ల తాజాగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీటిని వెలుగులోకి తెచ్చింది. వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి తన కోసం జగన్‌మోహన్‌రెడ్డి రాజభవనాలను ఏర్పాటు చేసుకున్నారని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తుండగా, రాష్ట్రపతి, దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వ మంత్రుల వంటి వీవీఐపీలు వచ్చినప్పుడు వారి కోసం ప్రత్యేకంగా నిర్మించామని, అంతర్జాయ ప్రమాణాలతో వీటిని అందుబాటులోకి తెచ్చామని గత ప్రభుత్వ తాలూకు మాజీ మంత్రులు చెబుతున్నారు.