లిక్కర్ స్కాంలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుక్కి బిగుస్తున్న ఉచ్చు
భార్గవరెడ్డికి సంబంధం ఉన్నట్టు చెబుతున్న సిట్;
By : The Federal
Update: 2025-09-04 04:29 GMT
ఏపీ లిక్కర్ స్కాం రోజుకో మలుపుతిరుగుతోంది. రూ.3,500 కోట్ల కుంభకోణంగా చెబుతున్న ఈ కేసులోకి తాజాగా వైఎస్ జగన్ రైట్ హ్యాండ్ సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ పేరు వచ్చింది. భార్గవ్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియాకు ఇన్ చార్జిగా పని చేశారు. ఇప్పుడు తప్పుకున్నారు.
లిక్కర్ స్కాంలో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (ఏ-39), అనుమానితుడైన చంద్రపతి ప్రద్యుమ్నతో కలిసి భీమ్ స్పేసెస్ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థలో సజ్జల భార్గవరెడ్డి డైరెక్టర్‌గా ఉన్నట్లు సిట్ తేల్చింది. వైసీపీ హయాంలో 2021 డిసెంబరులో ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. నగదు రూపంలో తీసుకున్న మద్యం ముడుపుల్ని వేర్వేరు చోట్లకు పంపినట్టు సిట్ ఆరోపిస్తోంది. నల్లధనాన్ని వైట్‌లోకి మార్చడానికి ఈ కంపెనీని వినియోగించారని సిట్ ఆరోపించింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి (ఏ-38), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (ఏ-39)ల కంపెనీలు, సంస్థల్లో సిట్ అధికారులు బుధవారం సోదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి హైదరాబాద్‌లలోని 12 కంపెనీల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి.
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న భీమ్ స్పేసెస్ ఎల్‌ఎల్‌పీ సంస్థ చిరునామాకు వెళ్లి తనిఖీలు చేయగా.. అక్కడ ఈషా ఇన్‌ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో కంపెనీ కూడా ఉన్నట్లు తేలింది. భీమ్ స్పేసెస్ ఎల్‌ఎల్‌పీలో సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ప్రద్యుమ్న డైరెక్టర్లుగా ఉన్నారు. ఈషా ఇన్‌ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ ప్రద్యుమ్న డైరెక్టర్‌గా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్మును ఈ కంపెనీల ద్వారా రూటింగ్ చేసినట్లు సిట్ అనుమానిస్తోంది.
వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్టును నిఖిలానంద లాజిస్టిక్స్ నిర్వహించింది. ఈ కంపెనీ విజయానందరెడ్డిదని, ఇందులో సజ్జల భార్గవ్ రెడ్డి హస్తం ఉందని అనుమానిస్తోంది సిట్.
మద్యం కుంభకోణం కేసులో తనిఖీలు, సోదాలు చేసినా సీఎంఆర్ ప్రాజెక్ట్స్, నిఖిలానంద లాజిస్టిక్స్ వంటివాటి గుట్టు బయటకు రాకుండా ఉండేందుకు.. అసలు లేని సంస్థ పేరుతో బోర్డు పెట్టినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు.