ఏపీలో 16 నుంచి ఇసుకే ఇసుక
ఇసుక రీచ్‌లను గుర్తించి, తగిన అనుమతులు తెచ్చుకొని తవ్వేందుకు ముందుకొచ్చే ప్రైవేటు వ్యక్తులకు రీచ్‌లను అప్పజెప్పేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Byline : Vijaykumar Garika
Update: 2024-10-12 04:19 GMT
నదుల్లోని ఇసుక రీచ్‌లను గుర్తించి, వాటికి అనుమతులు తెచ్చుకొని, తవ్వేందుకు ముందుకొచ్చే ప్రైవేటు వ్యక్తులకు ఇసుక రీచ్‌లను అప్పజెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిలికా శాండ్, క్వార్ట్జ్ , మైకా వంటి ఖనిజాలకు పర్మిట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించిన పర్మిట్లు జారీ చేయక పోవడం వల్ల కొన్ని పరిశ్రమలకు ఈ ఖనిజాలు లభ్యం కావడం లేదని, దీంతో పర్మిట్లు జారీ చేసి పరిశ్రమలకు అందేలా చూడాలని నిర్ణయించింది.
ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడంతో పాటు ఇసుక రీచ్‌లకు నేరుగా వెళ్లి కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 16 నుంచి అనుమతులున్న అన్ని ఇసుక రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ మొదలవ్వగానే నిల్వలన్నీ బుక్ అయిపోతున్నాయని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక అవసరం ఉన్న వాళ్లు నేరుగా రీచ్ వద్దకు వెళ్లి ఇసుకను తెచ్చుకోవచ్చు. అయితే అందుకు అవసరమైన నగదు చెల్లించాల్సి ఉంటుంది. అలా నగదు చెల్లించిన వారికి ఇసుక ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విక్రయాలు నిర్వహించిన తర్వాత శాండ్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. ఇసుక పాలసీలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదనే విషయం ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థలకు జమయ్యే సీనరేజీ ఫీజు, తవ్వకాల ఖర్చునే వసూలు చేస్తున్నామనే అంశాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇసుక అక్రమాలు జరక్కుండా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటుతో పాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇసుక కొనుగోలు దారుల వివరాలను పరిశీలన చేయాలని నిర్ణయించారు.