జగన్ 2.Oపై సెటైర్లు పేలుతున్నాయి, ఎందుకు?

30 ఏళ్లు అధికారంలో ఉండేలా జగన్ 2.O ఉంటుందని వైసీపీ అధినేత చెప్పడాన్ని ప్రత్యర్థిపార్టీలు హాస్యాస్పదంగా కొట్టిపారేస్తున్నాయి. ఎందుకో ఈ కథనంలో చూద్దాం;

Update: 2025-02-09 09:54 GMT
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయం పేరే "జగన్ 2.O" అనే భావన. ఇప్పుడిది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ తమ రాజకీయ విధానాలు, వ్యూహాలను పునర్నిర్వచించుకుని పార్టీకి కొత్త దశా దిశను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని ప్రాధమిక అంచనా.

జగన్ 2.O యొక్క ప్రధాన లక్ష్యం. వైసీపీని మరింత బలోపేతం చేయడం, రాష్ట్రంలో తన ప్రభావాన్ని పునరుద్ధరించడం. ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఎదుర్కొన్న అపజయాల తర్వాత, జగన్ తమ విధానాలను పునఃపరిశీలించి, కొత్త వ్యూహాలను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రక్రియలో ప్రజాసంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకోవడం, జనంలో ఉండి ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయడం, యువతను, మహిళలను, ఇతర బలహీన వర్గాల మద్దతును కూడగట్టడం, పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు.
ప్రతిపక్షాల సెటైర్లు ఏలా ఉన్నాయంటే..
జగన్ 2.Oపై ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నాయి. జగన్ తీరు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనలు వేసినట్టుగా ఉందని కొందరు ఆరోపిస్తుంటే మరికొందరేమో జగన్ ఊహాజనిత ప్రపంచంలో విహరిస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. జగన్ మాటలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే, జగన్ ఈ విమర్శలను పట్టించుకోకుండా తమ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టారు.
జగన్ 2.O రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ స్థానాన్ని బలోపేతం చేయగలదా అనేది ఇప్పటికీ వేయి మిలియన్ డాలర్ల ప్రశ్నే. పార్టీ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. సీనియర్లు అనుకుంటున్న వారే ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. తాజాగా జగనే చెప్పినట్టు మరో ఇద్దరో ముగ్గురో ఎంపీలు కూడా బయటకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కింది క్యాడర్ కి భరోసా ఇచ్చే నాయకత్వ లేమి వెంటాడుతోంది. ప్రభుత్వం వైపు నుంచి వేట కొనసాగుతూనే ఉంటుంది. మరోపక్క జగన్ ను పాత కేసులు వెంటాడుతున్నాయి. ఈ దశలో ఆయన ప్రారంభించాలనుకుంటున్న 2.O జగన్ కి ప్రత్యేకించి వైసీపీ రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు అనే చెప్పాలి.
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏమన్నారంటే..
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు- జగన్ 2.Oపై తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు. జగన్ ఊహాజనిత ప్రపంచంలో విహరిస్తున్నారని, ఆయన మాటలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయని అన్నారు. జగన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన ప్రసంగాలు సినిమాలకు బాగుండొచ్చునేమో గాని నిజ జీవితానికి సరిపోవని వ్యాఖ్యానించారు. వైసీపీలో ఉండగా అసభ్యంగా మాట్లాడిన మంత్రులను, ఇతర నాయకులను కూటమి పార్టీలు చేర్చుకోకూడదని కూడా సలహా ఇచ్చారు. కేంద్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు కూటమికి ఎలాంటి భయం లేదని పేర్కొన్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మరో అడుగు ముందుకేసి జగన్ ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చింది. జగన్ విశ్వసనీయతను కోల్పోయారని, డబ్బు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన ఐదేళ్ల పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడే విమర్శలకు దిగారు. జగన్ కొత్త ఎత్తుల్ని ప్రజలు నమ్మరని, జగన్ 2.O ఒక ప్రచార వ్యూహం మాత్రమే అని, ఇది ప్రజలను మోసం చేయడానికి ఒక ప్రయత్నమని ఆరోపిస్తోంది.
సొంత చెల్లి షర్మిల కూడా అదే విమర్శ...
జగన్ కి విశ్వసనీయత లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. సొంత తల్లినీ, చెల్లినీ, మేనల్లుడు, మేనకోడలి ఆస్తుల్నే లాక్కున్న వ్యక్తి జగన్ ఆమె ఆరోపించారు. జగన్ కొత్త వ్యూహాలు ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు చేసే ప్రయత్నంలో భాగమేనని విమర్శించారు. ఈ కొత్త అవతారంలో ప్రజలను మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ 2.O అనేది ఒక ప్రచార వ్యూహం మాత్రమేనని కాంగ్రెస్ అభివర్ణించింది.
వామపక్ష పార్టీల నాయకులు కూడా ఇదే స్థాయిలో జగన్ ను విమర్శించాయి. వైసీపీ అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి జగన్ వేసిన సరికొత్త ఎత్తు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు.
జగన్ 2.O – విజయాలు, వైఫల్యాలు, సవాళ్లు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే యత్నాలు మొదలు పెట్టారు. 2019లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన జగన్ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆయన పాలనలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడం, నవరత్నాలు అమలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, దిశ చట్టం వంటి కార్యక్రమాలతో ప్రజల్లో అనేక విధాలుగా ప్రభావం చూపించారు. అయినా 2024 ఎన్నికల్లో ఓడిపోక తప్పలేదు. ఆర్థికపరంగా రాష్ట్రం కుదేలైందని, కొత్త పెట్టుబడులు రాకపోవడమే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మూడు రాజధానుల గందరగోళం తెరపైకి వచ్చింది. ఇప్పటికైనా వైసీపీ రాజధాని సమస్యపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సరిగ్గా ఈనేపథ్యంలో జగన్ 2.O అంటున్నారు. 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండేలా ప్లాన్ చేయడమే దీని లక్ష్యం అంటున్నారు. అయితే ఇది అనేక సవాళ్లు, సమస్యలు, ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమనే చెప్పాలి. ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారు వైఎస్ జగన్. తిరిగి ఆయన అధికారంలోకి వచ్చినపుడే జగన్ 2.O అంటే ఏమిటో తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉత్కంఠ పెరుగుతున్న వేళ, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) "జగన్ 2.O" పేరుతో కొత్త ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను చైతన్యపరిచే ప్రయత్నంగా పరిగణించవచ్చు. అయితే, ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? దీనికి రాజకీయ ప్రాముఖ్యత ఎంత?
ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రచారం చేయడం, అధికారపక్షం "దుష్ప్రచారాన్ని" ఎదుర్కోవడం, నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఈ 2.Oలో ఉండవచ్చు.
"జగన్ 2.O" అంటే సంక్షేమ పాలన కొనసాగింపే. టీడీపీ, జనసేన, బీజేపీ కలయికతో ఏర్పడిన ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టడమే. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడమే. టీడీపీ ప్రభుత్వ హయాంలో "జగన్ 2.O" పేరుతో వైసీపీ చేపట్టబోయే ఈ ఆందోళన కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలను ఎలా తిప్పుకొడుతుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News