2029 సార్వత్రిక ఎన్నికల్లో అజెండా సీనియర్ సిటిజన్లేనా? రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్నే టార్గెట్ చేశాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారం ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల్ని టార్గెట్ చేసింది. సీనియర్ల సంక్షేమమే తమ ధ్యేయంగా ప్రకటించి ముందుకు సాగనుంది. వచ్చే 25 ఏళ్లకు రూపొందిస్తున్న ప్రణాళికలో భాగంగా ఇప్పుడు నూతన విధానాన్ని తయారుచేసే పనిలో పడింది.
2014లో బీజేపీ అధికారం చేపట్టేనాటికి 45, 50 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు ఇప్పుడు సీనియర్ సిటిజన్లు అవుతున్నారు. ఇప్పుడు 35, 40 ఏళ్ల మధ్య వయస్కులు బీజేపీ టార్గెట్ చేసిన 2050 నాటికి సీనియర్లవుతారు. బీజేపీ నాయకత్వం సీనియర్లపై గట్టి నమ్మకంతో ఉంది. కొత్తకారును సమాధాన పరచడం కన్నా పాత తరాన్నే నమ్ముకుంటే ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. పైగా నికరమైన ఓటు బ్యాంకుగా భావిస్తోంది. అందుకనే ఇప్పుడు సరికొత్త సీనియర్ సిటిజన్ల విధానానికి నడుం కట్టింది. 2007 నాటి పాత విధానాన్ని పక్కన బెట్టి కొత్త విధానాన్ని రూపొందించే ప్రక్రియ చేపట్టింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ పనికి పూనుకుంది. పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్, వెల్ఫేర్ యాక్ట్ -2007 స్థానంలో కొత్త చట్టం రానుంది.
“ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ రెండు రంగాలపై పని చేస్తోంది. 1999లో సీనియర్ సిటిజన్లపై ఒక విధానాన్ని రూపొందించారు. దానికి 2007లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాని ఆధారంగా ఇప్పుడు మరింత మెరుగైన విధానాన్ని తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇది రాబోయే 25 ఏళ్లకు దిశానిర్దేశం చేయనుంది అని అసోసియేషన్ ఆఫ్ సీనియర్ లివింగ్ ఇండియా కార్యదర్శి అమిత్ యాదవ్ చెప్పారు.
ఇప్పుడున్న రెండు చట్టాల్లో ఆస్తి హక్కులు, వృద్ధాశ్రమాల రక్షణకు సంబంధించిన కొన్ని క్లాజులు ఉన్నాయి. వాటిని మార్చడమే లేక కొత్త వాటిని చేర్చడమో చేస్తారు.
దక్షిణ భారతదేశమే వయోవృద్ధుల్లో టాప్..
ప్రస్తుతం దేశంలో అంటే 2024లో సుమారు 15.7 కోట్ల మంది 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఉన్నారు. మొత్తం జనాభాలో ఈ శాతం 11 శాతం. 2040నాటికి ఆ సంఖ్య 26 కోట్లకు, 2050నాటికి 34.6 కోట్లకు చేరుతుంది. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు దక్షిణాది రాష్ట్రాలలోనే ఉండబోతున్నారు. ఈ రాష్ట్రాలలో బర్త్ రేట్ బాగా తగ్గింది. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి ట్రెండ్స్ ప్రకారం రాబోయే రోజుల్లో 60ఏళ్లు పైబడిన వారిలో పురుషుల కంటే స్త్రీలు ప్రత్యేకించి వితంతులు ఉంటారు. పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం చాలా ఎక్కువగా ఉంటుంది. 2022 ఎకనామిక్ సర్వే ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళల జీవిత కాలం పెరిగింది. స్త్రీల ఆయుర్దాయం 70.7 సంవత్సరాలు కాగా పురుషుల ఆయుర్దాయం 68.2 ఏండ్లుగా ఉంది. అంటే పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం రెండున్న ఏళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో (urban areas) ప్రజల సగటు ఆయుర్దాయం 72.6 ఏండ్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సగటు ఆయుర్దాయం 68 సంవత్సరాలుగా ఉంది.
“2050 నాటికి ప్రతి ఐదుగురు భారతీయుల్లో ఒకరు సీనియర్ అవుతారు. ఇది ప్రపంచ జనాభాలో 70 శాతం మంది వృద్ధులను సూచిస్తుంది. ఇది చాలా పెద్ద సంఖ్య. అదృష్టవశాత్తూ భారతదేశంలో ఆయుర్దాయం పెరిగింది. అదే సమయంలో రోగాల భారమూ పెరిగింది" అన్నారు సీనియర్ లివింగ్ అసోసియేషన్ ASLI ఛైర్మన్ రజిత్ మెహతా.
రాబోయే విధానంలో ప్రభుత్వ మద్దతు, సామాజిక న్యాయం, ఆరోగ్యం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల వంటి అంశాలను చూసేందుకు ఓ నోడల్ ఏజెన్సీ ఉండాలన్నది సీనియర్ సిటిజన్ల ఆకాంక్షగా ఉంది. జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో అనుసరించే ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది.
నిజంగానే సీనియర్ సిటిజన్లపై ప్రేమ ఉందా?
వేగంగా కదులుతున్న ఫైళ్లు, సీనియర్ సిటిజన్ల సంఘాలతో సమావేశాలను బట్టి చూస్తుంటే త్వరలోనే వయోవృద్ధుల విధానం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ విధానానికి చట్టబద్ధత కల్పిస్తే మరింత ప్రయోజనం ఉంటుందన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్యాపదేశంగా చెప్పినా అదే నిజం కానుంది.
నికరమైన ఓటు బ్యాంకు వయోవృద్ధులది. ఎన్ని పనులున్నా ఓటింగ్ కు వెళ్లే సెక్షన్లలో ఇది ప్రధానమైంది. పైగా ఇప్పుడున్న నాయకుల్లో నరేంద్ర మోదీ అందరి నోళ్లలో నానే వ్యక్తి. మిగతావారందరూ వాళ్ల వాళ్ల రాష్ట్రాలకే పరిమితమైనా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి నరేంద్ర మోదీ. రాహుల్ గాంధీ లాంటి వాళ్లున్నా మోదీ ముందుంటారన్నది చంద్రబాబు లాంటి వాళ్ల అభిప్రాయం. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే మోదీ ప్లాన్ చేస్తున్నారు. దానిలో ఇదొక ప్రధానాంశం కాబోతోంది. అందుకే సీనియర్ లివింగ్ సెగ్మెంట్‌లో వేగం పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ సిటిజన్ గృహాలకు కనీస ప్రమాణాలను నిర్దేశించింది. మహారాష్ట్ర ఎన్నికలకు ముందే అక్కడ సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్‌ల కోసం మార్గదర్శకాలను ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ PM-JAY బీమా పథకాన్ని 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులకు విస్తరించాలని నిర్ణయించింది.