కూటమిలో సర్కార్ లో చిచ్చు రేపిన ఎస్జీఎస్టీ

ఏపీలో ఎస్జీఎస్టీ వసూళ్లకు సంబంధించి బీజేపీ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీల మధ్య దూరం పెరుగుతోందనేందుకు ఉదాహరణ.;

Update: 2025-03-27 10:46 GMT

తెలుగుదేశం, బీజేపీల మధ్య దూరం పెరుగుతోంది. బీజేపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా ఎస్జీఎస్టీ వసూళ్ల విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా ఆయన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు లేఖ రాసారు. ముందస్తు ఎస్జీఎస్టీ వసూళ్లు అనేవి చట్టంలోనే లేవని, అలాంటప్పుడు ఎలా వ్యాపారులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్జీఎస్టీ ద్వారా ఆదాయాన్ని ముందుగా రాబట్టుకొనేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్జీఎస్టీ అధికారులకు ఓరల్ గా ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చారు. మార్చి 31 లోపు ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పన్నుల వసూళ్లు జరగాలని అధికారులకు చెప్పటంతో వారు వ్యాపారులపై వత్తిడి పెంచారు. కొందరు వ్యాపారులకు అధికారులు ముందస్తు ఎస్జీఎస్టీ చెల్లించాలని చెబుతున్నారు. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో కమర్శియల్ ట్యాక్స్ అధికారులు వ్యాపారులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి ముందస్తు పన్ను చెల్లించాలని వత్తిడి పెంచారు. ఇటువంటి సమావేశాలు విజయవాడ నగరంలోనూ జరిగాయి.

ఆర్థిక మంత్రికి ఎంపీ రమేశ్ ఎందుకు లేఖ రాశారు?

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని వ్యాపారులు, ట్రేడర్లు బీజేపీ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేశ్ ను కలిసారు. అధికారులు ముందస్తు పన్ను చెల్లింపులు చేయాలని సతాయిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువగా సమావేశాలు ఏర్పాటు చేసి వేధిస్తున్నారని, ప్రతి సంవత్సరం మార్చి తరువాత మాత్రమే పన్నులు చెల్లిస్తున్నామన్నారు. కానీ ఈ ఏడాది ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదని వారు వాపోయారు. దీంతో ఎంపీ సీఎం రమేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు ఈనెల 20న లేఖ రాశారు. జిఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు పన్నును నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేయడం మంచి పరిణామం కాదని లేఖలో పేర్కొన్నారు.

మీరు తీసుకునే చర్యల కారణంగా వ్యాపారులు తమ వ్యాపారాలు సక్రమంగా చేసుకునేందుకు వీలు లేకుండా పోతోందని అంటున్నారు. అందువల్ల వారిని బాధ పెట్టవద్దని మనవి చేస్తున్నానని పేర్కొన్నారు. మార్చి 19, 2025న జారీ చేసిన ఈ ఆదేశాల ఫలితంగా డీలర్లు, ప్రజలు ఎదుర్కొంటున్న అనవసరమైన ఒత్తిడి, ఆందోళనను వెంటనే తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రమేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఏపీ ప్రభుత్వం ఎస్జీఎస్టీ (రాష్ట్ర వస్తు సేవల పన్ను) వసూళ్లకు సంబంధించి వ్యాపారులు, ట్రేడర్లకు నోటీసులు జారీ చేయడం, దానిపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడం అనేది పెద్ద చర్చగా మారింది.

రాజకీయ కోణం

సీఎం రమేష్ బీజేపీ ఎంపీ కావడం, కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి)పై ఒత్తిడి పెంచారు. ప్రభుత్వ తీరుపై సీఎం రమేష్ విమర్శలు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేయడమే. బీజేపీ ఆర్థిక విధానాలతో సమన్వయం లేకపోవడం వల్లనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విషయం ఆయన లేఖ ద్వారా అర్థమవుతోంది. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం రాజకీయ ఒత్తిడి లేదా వ్యూహాత్మక నిశ్శబ్దం కావొచ్చు. దీనివల్ల వివాదాన్ని మరింత పెంచకుండా ఉండవచ్చనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉండి ఉండవచ్చు.

ఆర్థిక కోణం

సీజీఎస్టీ వసూళ్లపై నోటీసులు జారీ చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని చెప్పొచ్చు. ఇది వ్యాపారులపై ఆర్థిక భారం పెంచుతుందనేది బీజేపీ వాదన. ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఇది ఇబ్బందికరంగా ఉంది. సీఎం రమేష్ దీనిని ప్రశ్నించడం వల్ల వ్యాపార వర్గాల్లో ఆందోళన ఉందని అర్థమైంది. దీనిని రాజకీయంగా ఉపయోగించుకునేందుకే ఆయన ఈ విధంగా లేఖ రాశారని చెప్పొచ్చు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదని కూడా అర్థమవుతోంది. అయితే జీఎస్టీలో ముందస్తు వసూళ్లు ఎప్పుడూ లేవు.

పరిపాలనా కోణం

నోటీసులు జారీ చేయడం జీఎస్టీ విధానాలను కఠినంగా అమలు చేయడంలో భాగంగా ఉండవచ్చు. కానీ దీనికి సరైన సమాచార వ్యాపారులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైతే వ్యాపారుల్లో అయోమయం, ఆందోళన సృష్టిసుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం వల్ల ఈ విషయంలో పారదర్శకత లోపించిందనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది.

ఎస్జీఎస్టీ (SGST), జీఎస్టీ (GST) మధ్య తేడా...

GST (వస్తు సేవల పన్ను) భారతదేశంలో 2017లో ప్రవేశపెట్టిన ఒక సమగ్ర పరోక్ష పన్ను విధానం. ఇది వస్తువులు, సేవలపై విధించే ఏకీకృత పన్ను. దీనిలో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి.

1. CGST (Central GST) కేంద్ర ప్రభుత్వం సేకరించే పన్ను. 2. SGST (State GST) రాష్ట్ర ప్రభుత్వం సేకరించే పన్ను. 3. IGST (Integrated GST) రాష్ట్రాల మధ్య లావాదేవీలపై కేంద్రం సేకరించే పన్ను. GST అనేది ఈ మూడు రకాల పన్నులకు కలిపిన సాధారణ పదం.

ఉదాహరణకు పన్ను వసూలు ఎలా ఉంటుందంటే...

ఒక వస్తువు ధర రూ. 1000 అనుకుంటే GST రేటు 18% విధిస్తే... ఒకే రాష్ట్రంలో లావాదేవీ జరిగినప్పుడు CGST (9%) = రూ. 90, SGST (9%) = రూ. 90, మొత్తం GST = రూ. 180 అవుతుంది. రాష్ట్రాల మధ్య లావాదేవీ అయితే IGST (18%) = రూ. 180 ఉంటుంది. GST అనేది మొత్తం పన్ను విధానాన్ని సూచిస్తుంది. అయితే SGST అనేది దానిలో రాష్ట్ర స్థాయిలో సేకరించే ఒక భాగం మాత్రమే.

జిఎస్టీ ముందస్తు వసూళ్లు చేయవచ్చా?

భారతదేశంలో జిఎస్టీ చట్టం ప్రకారం జిఎస్టీని ముందస్తు వసూళ్లు (అడ్వాన్స్ పేమెంట్స్) చేయడం సాధ్యం కాదు. అయితే ఒక వస్తువు లేదా సేవ సరఫరా జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్‌వాయిస్ జారీ అవుతుంది. జిఎస్టీ వర్తిస్తుంది. అయితే వ్యాపారి ముందస్తు చెల్లింపు తీసుకుంటే ఆ మొత్తం పై జిఎస్టీ విధించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ‘రిసీప్ట్ వోచర్’ జారీ చేయాలి. సరఫరా జరిగిన తర్వాత ఇన్‌వాయిస్ జారీ చేసినప్పుడు ఆ ముందస్తు చెల్లింపును సర్దుబాటు చేయవచ్చు.

ఆయిల్ కంపెనీల విషయంలో జీఎస్టీ వర్తించదు...

భారతదేశంలో ఆయిల్ కంపెనీల విషయంలో వ్యాట్ (VAT - Value Added Tax) ట్యాక్స్ అమలు గురించి చెప్పాలి. 2017లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) ప్రవేశపెట్టినప్పటికీ, పెట్రోలియం ఉత్పత్తులు (పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) GST పరిధిలోకి రాలేదు. ఈ ఉత్పత్తులపై ఇప్పటికీ VAT విధిస్తున్నారు. ఇది రాష్ట్రాలు నిర్ణయిస్తాయి.

ప్రస్తుతం మార్చి 26, 2025 నాటికి పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి స్వంత VAT రేట్లను అమలు చేస్తాయి. రాష్ట్రాల మధ్య VAT రేట్లు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలో పెట్రోల్‌పై VAT సుమారు 35.20 శాతం, డీజిల్‌పై 27శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది భిన్నంగా ఉంది. పెట్రోల్ పై సుమారు 31 శాతం నుంచి 33 శాతం వ్యాట్ (ధరలు, అదనపు సుంకాలను బట్టి మారవచ్చు) ఉంది. డీజిల్ పై సుమారు 22.5 నుంచి 24 శాతం వ్యాట్ ఉంది. మద్యం పై 50 నుంచి 70 శాతం వరకు వ్యాట్ ఉంది. అంటే మద్యం రకాలను బట్టి ట్యాక్స్ ఉంటోంది. ఇక న్యాచురల్ గ్యాస్ ఇటీవల నిర్ణయం ప్రకారం 2023లో వ్యాట్ రేటు 14.5 నుంచి 24.5 శాతానికి పెంచారు. ఈ రెండు పన్నులు (ఎక్సైజ్ + VAT) కలిపి ఇంధన ధరలో 50-60 శాతం వరకు ఉంటాయి. ఇది అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా ధరలు పెద్దగా తగ్గకపోవడానికి ఒక కారణం.

ముందస్తు వసూళ్లపై వాణిజ్య పన్నుల శాఖ ఏమంటోందంటే...

అడ్వాన్స్ ట్యాక్స్ కాదు, అడ్వాన్స్ రిటర్న్ లు వ్యాపారులను వేయమంటున్నామని విజయవాడ ఒకటవ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ షేక్ జహీర్ తెలిపారు. మేము ఎక్కడా అధికారికంగా అడ్వాన్స్ ట్యాక్స్ పై మాట్లాడటం లేదు. ఈనెలలో జరిగే వ్యాపారానికి సంబంధించి వ్యాపారులు వచ్చేనెల 11వ తేదీ లోపు అమ్మకాలు ఫైనల్ చేసి ట్యాక్స్ కడుతుంటారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఈనెల 31వ తేదీలోపు రిటర్నులు వేయమంటున్నాం. అంతే కాని ఏ వ్యాపారికీ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలని నోటీసులు ఇవ్వలేదని అన్నారు.

Tags:    

Similar News