ఫ్యాన్ వైపు శైలజానాథ్ చూపు?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ‘ఫ్యాన్ కిందికి’ చేరుతున్నారా? గతంలో కూడా ఆయన టిడిపిలో చేరతారని ప్రచారం జరిగింది.;
Byline : The Federal
Update: 2024-02-23 14:54 GMT
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
రాజకీయాల్లో ఏ క్షణాన ఏమి జరుగుతుందనేది ఊహించలేం. ఇటు ఉన్నవారు క్షణంలో అటు మారిపోతారు. ఆటు నుంచి ఇటు వస్తుంటారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయ భవిష్యత్ కోసం పావులు కదుపుతుంటారు. రాజకీయమంటే అదేగా... ‘మనిషి ఇక్కడ మనసు అక్కడ అన్నట్లు’ ఓ మాజీ మంత్రి కాంగ్రెస్‌లో ఉంటూనే వైయస్సార్ సీపీ టికెట్ కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పాతర పడింది. దీంతో చాలామంది నాయకులు రాజకీయ భవిష్యత్తుపై బెంగ కూడా పెట్టుకున్నారు. కొందరైతే పార్టీలు మారిపోయారు.
డాక్టర్ సాకే శైలజానాథ్ కూడా ఉన్నారా? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చివరి మంత్రి వర్గంలో పనిచేసిన ఆయన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
విభజనకు అనుకూలంగా...
రాష్ట్ర విభజన సమయంలో ఆయన చివరి మంత్రివర్గంలో కూడా సభ్యుడు. రాష్ట్ర విభజన సమయంలో చేసిన హడావిడి ద్వారా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆదేశాలు పాటించారని అందుకు అనుగుణంగా అనుకూలంగా ఉన్నారని అన్ని వర్గాల నుంచి నిరసనలు కూడా ఎదుర్కొన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో రాజకీయంగా ఆయన కాస్త నిరాశకు లోనైనట్లు ప్రచారంలో ఉంది. ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నించే క్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు.
వై ఎస్ ఆర్ కు సన్నిహితంగా...
దళిత సామాజిక వర్గానికి చెందిన సాకే శైలజానాథ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. సాకే శైలజనాథ్ కూడా డాక్టర్ కావడం వల్ల వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆయనపై మమకారం చూపించే వారిని ఆ పార్టీ వారితోపాటు ప్రజల్లో కూడా అభిప్రాయం ఉంది.
ఎన్నికలవేళ యాక్టివ్
ఏ పార్టీ నుంచి అయినా సరే సింగనమల నుంచి టికెట్ కోసం ఆయన తాపత్రయపడ్డారని అంటున్నారు. సాకే శైలజానాథ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం కిందటి సంవత్సరం ముమ్మరంగా సాగింది.
ఇప్పుడేం జరుగుతోంది..
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైయస్ షర్మిలారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆమె సారధ్యంలో ఎటు వెళ్లలేక కాంగ్రెస్ పార్టీలోనే నిద్రాణంగా ఉన్న సీనియర్ నాయకులు అందరూ బయటికి వచ్చారు. వారిలో సాకే శైలజానాథ్ కూడా ఒకరు. పార్టీ శ్రేణులను ఏకం చేసే రీతిలో సాగిన కార్యక్రమాల అనంతరం అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం సభకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
పార్టీ మారుతున్నారనే ప్రచారంపై ఆయనను సంప్రదంచగా ‘అనంతపురం పట్టణంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ శంఖారావ సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నాను’ అని మాత్రమే అన్నారు.