షర్మిల, జగన్‌లు పోటా పోటీగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వం కోసం షర్మిల, జగన్‌ల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. పోటా పోటీగా జయంతి వేడుకలను జరిపేందుకు పోటీ పడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఆయన కుమారుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుమార్తె, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ పడుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించనుండగా, కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్‌ఆర్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేందుకు సన్నద్దమయ్యారు.
ఇద్దరూ వైఎస్‌ఆర్ బిడ్డలే అయినా, ఇప్పుడు ఆయన వారసత్వం కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్‌ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకొని, తానే వైఎస్‌ఆర్ వారసుడిని అని జగన్ ప్రజల్లోకి వెళ్లారు. మొదట అదే బాటలో నడిచి, అన్న జగన్ పార్టీ కోసం శ్రమించి అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించిన షర్మిల, అనంతరం జరిగిన పరిణామాల్లో తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడకు వెళ్లిపోయారు. 2024 ఎన్నికలకు ముందు ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేయడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడం, అన్న ప్రభుత్వంపైనే కత్తి కట్టడం, పాలన తీరుపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోయడం, కడప నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగడం, తర్వాత ఓడి పోవడం అన్నీ చకచక జరిగి పోయాయి. ఈ నేపథ్యంలో అటు జగన్, ఇటు షర్మిల తండ్రి వైఎస్‌ఆర్ జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో వైఎస్‌ఆర్ రాజకీయ వారసులు ఎవరనేది మరో మారు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.