సునీత రెడ్డి పొలిటికల్ ఎంట్రీపై షర్మిల క్లారిటీ

సునీత రెడ్డి రాజకీయ ప్రవేశంపై వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-03-15 15:21 GMT
Source: Twitter


మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు గురై నేటికి ఐదేళ్లు. ఈ నేపథ్యంలో కడపలో ఆయన వర్ధంతిని ఆయన కుమార్తె సునీత రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకానంద రెడ్డి ఆత్మీయులు, సన్నిహితులతో పాటు అన్ని రాజకీయ పార్టీ నేతలు విచ్చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ వర్ధంతి కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కార్యక్రమంలో వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత రెడ్డి సహా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కుటుంబీకులే సునీతా రెడ్డిని నిందితురాలిగా చూశారని బాధపడ్డారు.



రాజకీయ ఎంట్రీ ముఖ్యం కాదు


అనంతరం ఆమె రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అన్న అంశంపై సునీత రెడ్డి స్పందించారు. ప్రస్తుతం తన రాజకీయ రంగ ప్రవేశం ముఖ్యం కాదని అన్నారు. ‘‘ప్రజాక్షేత్రంలో నాకు జరగాల్సిన న్యాయం తప్పక జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో జగన్‌కు ఎట్టిపరిస్థితుల్లో ఓటెయ్యొద్దు. తద్వారా న్యాయవ్యవస్థలో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’’అని సునీత తెలిపారు.


సునీతకు నేనున్నా..


ఈ క్లిష్ట సమయంలో సునీతకు ఎవరు అండగా నిలిచినా.. నిలవకపోయినా.. తాను అండగా నిలుస్తానని షర్మిల వ్యాఖ్యానించారు. ‘‘సునీతకు అండగా ఉంటానని ఆస్తి కోసమో, అధికారం కోసమో చెప్పట్లేదు. చిన్నప్పటి నుంచి సునీతను చూశాను. తన బాధను అర్థం చేసుకోగలను. అన్ని విధాలుగా సునీతకు అండగా ఉంటా’’అని ఆమె వ్యాఖ్యానించారు. చిన్నాన్న(వివేకానందరెడ్డి) కోపగించుకోవడం తాను ఎప్పుడూ చూడలేదని, అంతటి శాంత స్వభావికి, మంచి మనిషికి అంతటి క్రూరమైన మరణం రావడం తనను ఇప్పటికీ కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సునీత రాజకీయ అంశంపై మాట్లాడుతూ... ‘‘సునీత నాతోనే నా వెంటే ఉంటారు. త్వరలోనే ఆమె రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇస్తాం’’అని తెలిపారు.


సునీతకు మేం తోడుంటాం: ఆదినారాయణ


వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన హత్య కేసులో తీవ్ర నిందలు ఎదుర్కొన్న ఆదినారాయణ రెడ్డి కూడా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా సునీత వెంట తాము ఉంటామని ఆయన ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. ‘‘సునీత తన రాజకీయ జీవితంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలకు అతీతంగా ఆమెకు మద్దతుగా మేము నిలుస్తాం’’అని ఆసక్తికర ప్రకటన చేశారాయన.


వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో షర్మిల సహా వివేకా కుటుంబం సైతం సీఎం జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా సునీత రాజకీయ ప్రవేశంపై షర్మిల చేసిన వ్యాఖ్యలు మరిన్న సందేహాలకు దారి తీశాయి. సునీత రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారా? లేకుంటే పులివెందుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Tags:    

Similar News