కుమారుని పెళ్లికి అన్నను ఆహ్వానించిన షర్మిల

కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాల్సిందిగా వివాహ ఆహ్వాన పత్రికను జగన్‌కు అందించారు.

Byline :  The Federal
Update: 2024-01-03 14:25 GMT
YS Sharmila and YS Jagan

కుమారుని పెళ్లికి రావాల్సిందిగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన చెల్లెలు షర్మిల ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి పెళ్లి పత్రిక అందించారు.

తన కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా వైఎస్‌ షర్మిల, ఆమె భర్త అనిల్‌లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం 5.32 గంటలకు జగన్‌ నివాసానికి షర్మిల, అనిల్‌లు తమ కుమారుడు, కుమార్తెతో చేరుకున్నారు. కడప నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న వీరు అక్కడి నుంచి కార్లలో సీఎం నివాసానికి వచ్చారు. సుమారు 32 నిమిషాల పాటు సీఎం ఇంట్లో ఉన్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాల్సిందిగా వివాహ ఆహ్వాన పత్రికను జగన్‌కు అందించారు. ఆ తరువాత కార్లలో 6.02 గంటలకు బయటకు వచ్చిన షర్మిల కుటుంబం నేరుగా విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి వారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ముందుగా అనుకున్న ప్రకారం వైఎస్‌ విజయమ్మ కూడా వీరితో రావాల్సి ఉంది. అయితే విజయమ్మ రాలేదు. షర్మిల కుటుంబం మాత్రమే వచ్చారు. కార్లు లోపలికి వెళుతున్న సమయంలో వెనుక వస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కారును రెండో గేటువద్ద ఆపివేశారు. అక్కడే మీడియారు ఉండటంతో మీరు లోపలికి ఎందుకు వెళ్లలేదని మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో అక్కడ హడావుడి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న సెక్యూరిటీ వారు అక్కడి నుంచి ఆర్కేను లోపలికి వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో ఆయన మెయిన్‌గేట్‌ వద్దకు వెళ్లి అక్కడ ఆగిపోయారు. సెక్యూరిటీ వారు అక్కడి నుంచి లోపలికి పింపించలేదు. షర్మిల బయటకు రాగానే వారితో పాటు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. షర్మిల కుమారుని పెళ్లి విషయం తప్ప వేరేవిషయాలేవీ సీఎం ఇంట్లో చర్చకు రాలేదని సమాచారం.
Tags:    

Similar News