జగన్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న షర్మిల
వైఎస్ షర్మిలను కట్టడి చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక సవాల్‌గా మారింది.
G Vijaya Kumar
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన దగా డిఎస్సీ ధర్నా, చలో సచివాలయం కార్యక్రమం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం దీనిపైనే చర్చించుకుంటున్నాయి. దగా డిఎస్సీ పేరుతో సచివాలయం ముట్టడికి పిలుపు నిచ్చారు. దీనికి పార్టీలకు అతీతంగా మద్ధతు లభించింది. సీపీఐ రామకృష్ణ ధర్నాలో పాల్గొని కాంగ్రెస్‌కు సంఘీభావం తెలిపారు. వేలాది మంది కాగ్రెస్ కార్యకర్తలతో పాటు భారీగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. అయితే వీరు రోడ్లపైకి వస్తే పరువు పోతుందని భావించిన ప్రభుత్వం అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపిసిపి అధ్యక్షురాలు షర్మిలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లోనే నిర్బంధించారు. కొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను బుధవారం అర్ధ రాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. అయితే గురువారం వాటిని చేధించుకొని వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపైకి తరలి రావడంతో పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. దీంతో విజయవాడలోని కొన్ని రోడ్లు రణరంగంగా మారాయి.