జగనన్న రత్నాలను తూర్పారబట్టిన షర్మిలక్క

అన్న వైఎస్‌ జగన్‌ ఎంచుకున్న నవరత్నాల మాదిరిగానే నవ సందేహాలతో చెల్లి షర్మిల కౌంటర్‌ చేస్తున్నారు.

Byline :  The Federal
Update: 2024-05-03 06:49 GMT

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలకే ప్రాథాన్యత ఇస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నవ రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత బలంగా భావిస్తున్న నవరత్నాలపై ఆయన చెల్లి షర్మిల గురి పెట్టింది. జగన్‌ బలాన్ని దెబ్బతీసేందుకు ఆమె నవరత్నాలల్లోని వైఫల్యాలను ఎత్తి చూపుతూ అస్త్రాలను సంధిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె ఈ నవ అస్త్రాలను సంధిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్‌ను అధికారంలోకి తెచ్చిన నవరత్నాలు
2019 ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిన పదం నవ రత్నాలు. జగన్‌ తన మేనిఫెస్టోను నవ రత్నాలు పేరుతో రూపొందించి ప్రజల్లోకి తీసుకొచ్చారు. నవ అంటే తొమ్మిది. తొమ్మిది సంక్షేమ పథకాలను రూపొందించి వాటిని నవ రత్నాలుగా పేర్కొంటూ వైఎస్‌ జగన్‌ ప్రచారం చేశారు. వీటికి నాడు మంచి ఆదరణ లభించింది. అన్ని వర్గాల ప్రజలకు దీనిని చేరువ చేయగలిగారు జగన్‌. అధికారంలోకి వస్తే వీటిని తూచా తప్పకుండా అమలు చేస్తామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సంక్షేమ పథకాల ద్వారా మేలు చేస్తామని ప్రచారం చేశారు. వీటి వల్ల ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని ప్రచారం చేపట్టారు. మొత్తమ్మీద నవ రత్నాలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. నవ రత్నాల కాన్‌సెప్ట్‌ కొత్తగా ఉండటం, పథకాల ద్వారా చేకూరే లబ్ధి కూడా ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబును కాదని వైఎస్‌ఆర్‌సీపీకి ఆ పార్టీ అధినేతకు పట్టం కట్టారు. తర్వాత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నవ రత్నాల చుట్టూ తిప్పుతూ వచ్చారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నవ రత్నాలనే కొనసాగిస్తామని వెల్లడించారు. ఒకటి రెండు పథకాలకు గతంలో కంటే కాస్త ఎక్కువ మొత్తం లబ్ధిదారులకు అందజేస్తామని ప్రకటించారు. ఇలా నవ రత్నాలు అనేది వైఎస్‌ఆర్‌సీపీకి, జగన్‌మోహన్‌రెడ్డికి బ్రాండ్‌ గా మారిపోయింది.
బ్రాండ్‌ను బద్దలు కొట్టాలనే ప్రయత్నంలో
దీనిని బ్రేక్‌ చేయాలని వైఎస్‌ షర్మిల నిర్ణయించుకున్నారు. ఏ పేరుతో అయితే జగన్‌ పాపులర్‌ అయ్యారో, తన బ్రాండ్‌గా మార్చుకున్నారో అదే పేరుతోనే జగన్‌పై షర్మిల విమర్శన అస్త్రాలను సంధించాలని నిర్ణయించుకున్నారు. జగన్‌ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. అమలు చేయని హామీలను, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను, ఎస్సీ,ఎస్టీ వర్గాలకు అమలు కాని పథకాలు, గతంలో ఉన్న పథకాల రద్దు వంటి అంశాలను ఎంచుకుంటున్నారు. వాటిని ప్రశ్నల రూపంలో జగన్‌కు సంధిస్తున్నారు. ప్రతి సారి తొమ్మిది అంశాలను ఎంచుకొని వాటిని నవ సందేహాలనే పేరుతో బహిరంగ లేఖలు రాస్తూ సీఎం జగన్‌ను ఊపిరి సల్పకుండా చేస్తున్నారు.
నవ పేరుతో అన్న వైఎస్‌ జగన్, చెల్లి వైఎస్‌ షర్మిల మధ్య జరుగుతున్న ప్రశ్న పోరు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. నవ రత్నాల పేరుతో అధికారంలోకి రావడమే కాకుండ తన బ్రాండ్‌గా మార్చుకున్న జగన్‌ను అదే నవ పేరుతో విమర్శలు, బహిరంగ లేఖాస్త్రాలు జగన్‌పై సంధిస్తుండటం ఆకసక్తి కరంగా మారిందనే టాక్‌ కూడా నడుస్తోంది. 2024 ఎన్నికల్లో అన్న జగన్, చెల్లెలు షర్మిల రాజకీయాలు, విమర్శలు నవ చుట్టూ తిరగడం కూడా ఆసక్తికరంగా మారింది. నవ సందేహాల పేరుతో తాజాగా మరో అస్త్రాన్ని సంధించారు. కడపలో మాట్లాడుతూ ఉద్యోగ వర్గాల సమస్యలపై ఆమె గళమెత్తారు. ఉద్యోగుల పక్షాన 9 ప్రశ్నలను నవ సందేహాల పేరుతో సంధిస్తూ వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేయలేదని, ఉద్యోగుల మెడికల్‌ బిల్లులు పెండింగ్‌లోనే పెట్టారని, ఐఆర్‌లో కోతలు పెట్టారని, 12వ పీఆర్‌సీ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
Tags:    

Similar News