అన్నా, నిన్నొదలా! జగన్ రూట్ లోనే చెల్లి షర్మిల

వైఎస్సార్ సీపీ పెట్టినప్పుడు అన్న జగన్ పన్నిన వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు దగ్గర్నుంచి చూసిన వ్యక్తిగా షర్మిల ఇప్పుడు వాటిని అన్న జగన్ పై ప్రయోగించనుందా?

Update: 2024-01-22 02:40 GMT
YS Sharmila

‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అనే షర్మిల ఇప్పుడు అన్నకే బాణాన్ని గురిపెట్టింది. అన్నదమ్ముల సవాల్ కి బదులు ఇప్పుడు అన్నా చెల్లెలి సవాళ్లు తెరమీదికి రాబోతున్నాయి. వైఎస్సార్ సీపీ పెట్టినప్పుడు అన్న జగన్ పన్నిన వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు దగ్గర్నుంచి చూసిన వ్యక్తిగా ఇప్పుడు ఏపీ రాజకీయ తెరపైకి వచ్చారు. ఆవేళ జగన్ ను వెనకుండి నడిపిన శక్తుల్లో, వ్యక్తుల్లో సగం మంది ఇప్పుడు షర్మిల పక్కనా ఉన్నారు. వస్తూనే అన్నపై రాజకీయంగా నిప్పులు చెరుగుతూ వచ్చిన షర్మిల మున్ముందు అన్న బాటలోనే నడుస్తారని, అన్న వ్యూహాలకు దీటుగా వ్యూహాలు పన్నగలదని నిరూపిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీలో నాలుగో పక్షం షర్మిల...

ఫిబ్రవరి రాకుండానే ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు YCP, టీడీపీ, BJPల ముక్కోణపు పోటీ కొనసాగుతుండగా... ఈ పోరులో ఇప్పుడు నాలుగో అడుగు పడింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల... వెంటనే ప్రత్యర్థులను టార్గెట్ చేశారు. వైసీపీ, టీడీపీపై వాడీవేడిగా విమర్శలు సంధిస్తున్నారు. ఇదే క్రమంలో సీఎం జగన్ తరహాలో షర్మిల జిల్లాల యాత్రలకు బయల్దేరబోతున్నారు. ఈ నెల 25 నుంచి సీఎం జగన్‌ ప్రాంతీయ క్యాడర్ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతుంటే... అంతకు రెండు రోజుల ముందు నుంచే జిల్లాల పర్యటనలు చేయనున్నారు షర్మిల. ఇద్దరు నేతల పర్యటనతో ఏపీ పాలిటిక్స్‌లో బ్రదర్‌, సిస్టర్‌ వార్‌ ప్రారంభమవుతుందని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.

న్నికల వేళ ఏపీ రాజకీయం ఆసక్తి పెంచుతోంది. తన పార్టీ అభ్యర్ధుల ఎంపిక దాదాపు పూర్తిచేసిన సీఎం జగన్‌... ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 25న భీమిలిలో బహిరంగసభలో పాల్గొననున్న జగన్‌... ఆ తర్వాత రీజియన్ల వారీగా కేడర్‌తో మమేకం కానున్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు... పవన్‌తో పాటుగా సభల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక పైన ఒక స్పష్టతకు రానున్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని ఇద్దరు నేతలు డిసైడ్ అయ్యారు. ఇక బీజేపీ వైఖరిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రజల్లోనే షర్మిల...

ఏపీలో ఆయా పార్టీల అధినేతలు తమ ప్రణాళికల్లో భాగంగా ప్రజల్లో ఉండగా... పీసీసీ బాధ్యతలు చేపట్టిన షర్మిల ప్రజల్లోనే ఉండాలంటూ హైకమాండ్ ఆదేశించింది. పార్టీ బలోపేత చర్యల్లో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు చేరికలపై ఫోకస్ పెట్టాలని హైకమాండ్ సూచించింది. పార్టీని వీడిన వారిని తిరిగి రప్పించటం, పార్టీకి ఓటు బ్యాంకు పెంచాలనే లక్ష్యాలను నిర్దేశించింది. అందులో భాగంగా సీట్లు దక్కని ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సమయంలోనే షర్మిల ప్రజల మధ్యకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్‌ను బలపరిచేలా ప్రయత్నాలు చేస్తూ... వైసీపీ,టీడీపీ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.

కొత్తగా పార్టీ బాధ్యతలు తీసుకున్న షర్మిల ఈనెల 23న ఇచ్ఛాపురం నుంచి జిల్లాల యాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రకు సమయం లేకపోవడంతో ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు బస్సు యాత్ర చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతంతోపాటు జిల్లాల్లో నేతల చేరికలపై షర్మిల ఫోకస్ పెట్టనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైనా షర్మిల పోరాటం చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీపై విమర్శలు ప్రారంభించిన షర్మిల... తన ప్రచార యాత్రలో మరింతగా దూసుకెళ్లనున్నారు.

జగన్ ను వదిలే సూచనలు కనిపించడం లేదే...

షర్మిల తన ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపైన ప్రధానంగా ఫోకస్‌ పెడతారని ఇప్పటికే సంకేతాలిచ్చారు. అదే సమయంలో బీజేపీతో టీడీపీ, జనసేన సంబంధాల గురించి నిలదీయనున్నారు. ఎన్నికల సమయం కావడంతో సీఎం జగన్, చంద్రబాబు, పవన్, షర్మిల జనం మధ్యనే ఉండనున్నారు. వైసీపీ సర్కార్‌ను ఓడించటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన షర్మిల.... అటు జగన్, ఇటు చంద్రబాబును ఎలా టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News