అత్తను చంపిన అల్లుడు.. ఎందుకంటే..

ఆదరణకు ప్రతిఫలం.. హత్య: ఇల్లరికం అల్లుడి దారుణం;

Update: 2025-07-24 07:26 GMT
నిందితుడు వెంకయ్య
ఇల్లరికం అల్లుడు ఎంత పని చేశాడో, చూడండంటూ వాపోతున్నారు తుమ్మూరు వాసులు. వెనకా ముందు ఎవ్వరూ లేనివాడు కదా అని చేరదీసి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఏకంగా అత్తనే హతమార్చాడో యువకుడు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని తుమ్మూరులో జరిగింది. ఈ మండలంలోని అయ్యప్పరెడ్డిపాళేనికి చెందిన సగటూరు చెంగమ్మ(47) ఒంటరి మహిళ. ముగ్గురు కుమార్తెలు. పెద్ద వాళ్లకి పెళ్లిళ్లు అయ్యాయి. మూడో కూతురు స్వాతిని పండ్లూరుకి చెందిన బోడెద్దుల వెంకయ్యకు ఇచ్చి వివాహం చేసింది. వెంకయ్య ట్రాక్టర్‌ డ్రైవర్. అల్లుణ్ణి చెంగమ్మ ఇల్లరికం తెచ్చుకుంది. కుమార్తెతో కలిసి ఉంటోంది. వెంకయ్యకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది.

చెంగమ్మ

కొంతకాలం బాగానే ఉన్న వెంకయ్య ఆ తర్వాత చెడు తిరుగుళ్లు తిరిగి కొన్ని వ్యాధులు తెచ్చుకున్నారు. ఈ విషయం అత్తకు తెలియడంతో ఇంటి నుంచి అతన్ని పంపించి వేశారు. అయితే అల్లుడికి అవసరమైన సహాయ సహకారాలను అత్త అందిస్తోంది. భార్యతో కాపురం మాత్రం చేయనివ్వడం లేదు. దీంతో కక్ష పెంచుకున్న వెంకయ్య అత్తను హతమార్చాలని ప్లాన్ చేశాడు. రెండు రోజుల కిందట చెంగమ్మకు ఫోన్‌చేసి మాట్లాడాలని రమ్మన్నాడు. నెల్లూరు నుంచి వస్తున్న చెంగమ్మ స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో అల్లుడితో మాట్లాడేందుకు దిగింది. అత్త మీద కోపంగా ఉన్న వెంకయ్య ఒక్కసారిగా కత్తితో ఆమెపై విచక్షణారహితంగా గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఎవరూ గుర్తించకుండా ఆమెను స్వర్ణముఖి నది కట్టమీద నుంచి కిందకు తోసేశాడు.
మంగళవారం రాత్రి ఆమెను నదిలో పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్టు బుధవారం ఉదయం అయ్యప్పరెడ్డిపాళేనికి వెళ్లాడు. అనుమానం వచ్చిన కుమార్తె తమ ఊరి వాళ్లకు విషయం చెప్పారు. గ్రామస్తులు వెంకయ్యను నిలదీయడంతో చెంగమ్మను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. నాయుడుపేట పోలీసులు వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అత్త మృతదేహాన్ని స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో నదిలో పూడ్చిపెట్టినట్లుగా పోలీసులకు చెప్పారు. బుధవారం సాయంత్రం మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. వెంకయ్య కటకటాల వెనుకున్నాడు. అనాథ అని చేరదీస్తే అల్లుడు ఇంత పని చేశాడా అని గ్రామస్తులు విస్తుపోతున్నారు.
Tags:    

Similar News